ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...

వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...
Showing posts with label బంధం. Show all posts
Showing posts with label బంధం. Show all posts

Tuesday, April 10, 2012

దేవీ నీలాల సరాలు ~ 1

వేచి ఉన్న ఏకాంతం వశమై ఆ యుగళం పారవశ్యంతో  ఏకమవుతుంది...

ఏమయిందో...

మళ్లీ ఎదురవబోయే ఎడబాటు ఊహకంది ఆ క్షణంలో చొరబడింది..
ఒక్కసారిగా ఆమె కంపించి ఆతని మీద వాలిపోయింది
చేతులు దండలా ఆతని కంఠాన్ని చుట్టుకున్నాయి
మొహం ఛాతిలో దాగిపోయింది
లాలనగా అతను ముంగురులు సవరించబోతే
చేతుల బంధనం బిగుసుకుంది
ఫాలభాగామేమో ఆతని చుంబనాన్ని నిరాకరిస్తూ గారంగా ఛాతిని దోస్తుంది
కొనతేరిన ఆమె చుబుకం ఛాతి మధ్య గాయం చేస్తుంది
ఆమె నయనాలు ఏదో రచిస్తున్నాయి
అర్ధం చేసుకుంటున్న అతని హృదయం ద్రవిస్తుంది

చేదండని  వదిలించి చుబుకాన్ని అందుకుని మాట కలుపుతూ అతను
ఆమె నయన కావ్యాల్లో ఆతని అనునయ  వాక్యాలు కొట్టుకుపోతున్నాయి

ఏమయిందో...
తనే ఆ క్షణాన్ని వశం చేసుకుంది
ఆతని ఫాలాన్ని చుంబించి దరి చేర్చుకుంది

ఆతని నయనాలూ రచిస్తున్నాయి

Wednesday, November 23, 2011

మనసైంది…




మాటలతో మొదలైన బంధం చూపులతో రూపు దిద్దుకుంది
చూపుల్లోనే బయట పడ్డ మనసులు బలంగా పెనవేసుకుంటున్నాయి...

మన కలయిక నీ పలుకుల్లో వ్యక్తమవుతున్నపుడు
నా కలలకి నువ్వు భాష్యం చెప్తున్నట్టుంటుంది

నీ చిలిపి విసురుల్లో
నీ వెవ్వెవ్వేల... ఆ ఆ ఆ కారాల
గారాల నయగారాల్లో పులకించిపోతున్నాను

యధేచ్చగా నువ్వు నన్ను నీలో కలుపుకుంటుంటే
నన్ను నేను మరిచిపోతున్నాను

చుట్టూ ఏమవుతున్నా, కాలం ఎరుగక
మనసు ప్రశాంతంగా ఉంది
రేపటి మన మనుగడని ఆవిష్కరించుకుంటుంది..



పంచభూతాలు నాకు సరి కొత్తగా ప్రస్ఫుటమవుతున్నాయి

Thursday, November 1, 2007

పిపాసి



ప్రేమ సౌధం కుప్పకూలి...,
గూడు కట్టుకున్న ఆశలు చెల్లా చెదురై,దిక్కు తోచక
హఠాత్తుగా ఆవరించిన శూన్యతకి ఒంటరైనమనసుతో... ఒక నేస్తం...

పచ్చ నోట్లు పలచనై,
బతుకు బండి భారమై,
అలసిన వదనంతో... ఒక నేస్తం...

సంసార సాగరం ఈదుతూ,
గజిబిజి నడకలతొ బిజీ-బిజీగా సతమతమవుతూ... ఒక నేస్తం...

కాల ప్రవాహంలొ కొట్టుకుపోతూ...
నిన్నటి జాడ మరచి, తోడు విడిచి...
కొత్త స్నేహాలతో వర్తమానంలొనే గడిపే... ఒక నేస్తం...

ఒకరితో కాలాన్ని పంచుకోలేక...
ఒకరితో పంచుకుని...
బరువెక్కిన హృదయంతో నేను...

ఎంతమంది నేస్తాలున్నా...
ఒంటరైన ఈ క్షణాన,నా మనసు...
కొత్త నేస్తాన్ని కోరుకుంటుంది...

నాతో కబుర్లు చెప్పాలని...
నన్ను అలరించాలని...
బరువైన ఈ క్షణాన్ని తేలిక చేయాలని...