నీరెండలో చలి కాచుకుంటూ ఉంటాను
ఏ చిలిపి మేఘమో సూరుడికి అడ్డం పడుతుంది
ఒక్కసారిగా వణికిపోతాను
మండుటెండలో పొలంలోని కొలనులో బట్టలిప్పి స్నానానికి దిగుతాను
ఇంతలో దట్టమైన మేఘాలు అల్లుకుంటాయి
బట్టలు తడిపేస్తాయి
అటుగా ఏదో అందం కదులుతుంటుంది చూడబోతాను
గాలి వీస్తుంది అది జారుకునేంత వరకూ
కళ్ళల్లో దుమ్ముని చూస్తాను
ఎండా వానా ఒకేసారి కాపు కాస్తాయి
ఎవరో ఎవరితోనో కలుస్తారు
అయోమయాతిశయంలో నేను
నడిచి నడిచి అలసి ఆగిపోతాను దాహంతో
దూరంగా తడి కనపడి పరుగులుతీస్తాను
నా నిట్టూర్పులు ఎండమావుల్లో కలిసిపొతాయి
ఏకాంత వనం లో ఎద ఏదో రాగం ఆలపిస్తూ ఉంటుంది
ఇంతలో ఆలోచనలు సీతాకోకచిలుకలైపోతాయి
పట్ట బుద్ధీ కావు ఒక్క చోటా నిలవవూ
.
.
.
ప్రకృతి లీలలు అంతుబట్టవు
మనసేమో మాట వినదు...