ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...

వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...

Saturday, January 10, 2009

నాతో నేను...

ఈ రాత్రి ఢిల్లీలో జనవరి మాసపు రాత్రిలా లేదు
మా గోదావరి శీతాకాలపు సాయంత్రంలా ఉంది
ఎముకలు కొరికే చలి లేదు
చూపులకు అడ్డం పడే పొగ మంచు పొరలు లేవు

నేను ఈ సమయాన్ని వృధా చేసుకోదలచుకోలేదు
అనాయాసంగా పార్క్ లోకి అడుగులేసాను
నిర్మానుష్యంగా, పార్క్ అంతా నాకోసమే ఎదురుచూస్తున్నట్టుంది
తనివితీరా అడుగులేస్తూ, అంతా కలియ తిరుగుతూ నేను

లేలేత చలి నాలో వెచ్చదనాన్ని పెనవేసుకుంటుంది
ఆస్వాదిస్తూ నేను... నడుస్తూ... నాతో నేను...
అనుభూతి నింపిన ఆర్ధ్రతతో మూసుకున్న నా కళ్ళు ఆకాశం వైపు చూసాయి
దేదీప్యమానంగా మెరుస్తున్న విద్యుద్దీపపు వెలుతురు తెరలు
కళ్ళలోని ఆర్ధ్రతా సాంద్రపు పొరలు నా చూపుల దారిని అడ్డగించలేకపోయాయి
దూరంగా చందమామ.... నా పండు చందమామ!
నిర్మలంగా,ప్రశాంతంగా,హాయిగా...!
ఏ చింతాలేని ఈ క్షణపు నా మనసులాగా...
ఎన్నిరోజులైంది! చిరుగాలికి ఆడే కొమ్మల చాటున దోబూచులాడే చంద్రాన్ని కనుగొని!

చాలాసార్లు ప్రకృతి నా స్థితిని అద్దం పడుతూ నాకు చూపిస్తుంది,
ఆ అద్దంలో నన్ను నేను కనుగొంటాను...

Friday, October 10, 2008

ప్రేమ గోరింటాకు

శీతాకాలపు నిండు వెన్నెల పూట
ఏకాంతం ప్రసాదించిన తొలి 'సాంగత్యపు అనుభూతి '
వారి పెదవులపై మౌన ముద్రలు వేసింది
మౌనాన్ని ఛేదిస్తూ ఆమె అడుగులు తోటలోకి పడ్డాయి
ఆతని అడుగులు ఆమెను అనుసరిస్తూ...

సన్నగా వీస్తూ తాకిన చల్ల గాలి ఆమె పరిమళాన్ని మోస్తూ
ఆతన్ని ఆమె పక్కకి రప్పించింది
చేతులు పలకరించుకున్నాయి.
ఒక్కసారిగా అడుగులు తడబడ్డాయి - ఆపై ముందుకు సాగాయి
వెచ్చదనం మౌనాన్ని కరిగిస్తూ ఉంది...

మత్తెక్కిస్తున్న సంపెంగ ఆమెను ఆహ్వానించింది
కను రెప్పలు వాల్చి ఆఘ్రాణ ముద్రలో ఆమె -ఆమెని చూసి మైమరచిపోయిన ఆతడు
ఆమె ముందుకు సాగింది,
తేరుకున్న ఆతను సెంపెంగతో ఆమె కురులని అలంకరించాడు
ఆమె పెదవులపై నవ్వుల పువ్వులు విరిసాయి - దోసెట్లో పట్టే ప్రయత్నంలో ఆతడు!
మరిన్ని పూలు అడుగులకి తివాచీ పరచాయి
చిటికెన వ్రేళ్ళు ఊసులాడుకుంటున్నాయి...

చెట్ల చాటు తొలగిన పండు జాబిల్లిని చూస్తూ నిశ్చలంగా ఆమె
ఆ కన్నుల్లో వెలుగుని చూస్తూ ఆతడు
చేతులు పెనవేసుకున్నాయి, మనో నేత్రాల చూపులు కలిసాయి
ప్రేమైక స్పర్శతో పండిన ఆమె చేతి ఎరుపుని చూసి
చిన్నబోయింది తోటలోని గోరింటాకు!
మనసులు మౌనంగానే మాట్లాడుకుంటున్నాయి...

Tuesday, August 12, 2008

నీ సమక్షంలో...

స్నానం చేసి బాల్కనిలోకొచ్చాను
అమాంతంగా చిరు గాలి హత్తుకుని మత్తెక్కిస్తుంది
ఆ మత్తు ఎక్కేలోగా కవ్విస్తూ దూరంగా జారుకుంది...

అప్రయత్నంగా నా పాదాలు పార్క్ వైపుకి కదిలాయి

రెండు రోజుల క్రితం వాన కురిసి ప్రకృతి చల్లబడింది
తేమను విడిపించుకున్న గాలి అప్పుడే రెక్కలు విచ్చుకున్న
సీతాకోక చిలకలా పొడి పొడిగా వడి వడిగా ప్రవహిస్తూ మైమరిపిస్తుంది

ఆశ్చర్యంగా...,
ఫ్లెడ్ లైట్కి దూరంగా ఆకాశంలో...
మీగడ 'మబ్బు చుట్టు ' మధ్యలో జాబిల్లి మెరిసిపోతుంది...
నా కళ్ళూ మెరుస్తున్నాయి... నిశ్చలంగా నేను!

అసూయ చిరుగాలిని తాకినట్టుంది, అది నా వీపు చరిచింది

నా పాదాలు కదిలాయి

ఈ ఏకాంతం నాకొక తోడుని ఆహ్వానిస్తుంది...

ప్రియా...

నువ్వు నా దరిదాపుల్లోనే ఉన్నావనే స్పృహలో
ఈ రేయి... ఈ ప్రకృతిని అనుభవించాలని ఉంది...

Monday, July 28, 2008

సాగే స్రవంతి...

పార్క్లో ఫ్లెడ్ లైట్లకి, అలవాటు పడిపోయాను
ఇప్పుడు ప్రతీ రేయీ పగలే
వెన్నెల ఒక గతం. దాని అవసరమూ లేదు

నేను నడుస్తున్నాను-నా ముందు నా నీడ.

ఎదురుగా ఒక తాత
అడుగులో అడుగేసుకుంటూ, బాధ్యతలు తీరినా
ఆ భుజాలు ఇంకా ఏదో బరువు మోస్తున్నట్టు నడుస్తున్నాడు

ఇంతటి వెలుగులోనూ అతని కళ్ళు మెరవడం లేదు
మా చూపులు కలిసాయి..
నీళ్ళు లేని బావిలా నా చూపుని చీకట్లో కలిపేస్తున్నట్టు
ఆతని కళ్ళు నన్ను లోతెంతో తెలియని ఏవో ప్రశ్నలు సంధిస్తున్నట్లున్నాయి..
మా చూపులు విడిపోయాయి...

ఈ వెలుగులో పురుగులు కూడా పెరిగాయి.
చిందర వందరగ గాల్లో నాకు అడ్డంపడుతున్నాయి
వీటికీ అలవాటు పడుతున్నాను.

ఇంతకీ ఆ ప్రశ్నలు -
నాకా?
నా తరానికా?

నేను నడుస్తూనే ఉన్నాను...

ఈ ఫ్లెడ్ లైట్లకి అలవాటు పడిపోయాను
వెన్నెల ఒక గతం. దాని అవసరమూ లేదు..

కానీ కరెంట్ పోతేనో?!

Tuesday, July 22, 2008

కాలపు కడలి కెరటాలు: జ్ఞాపకాలు

ఏంటి! నే ఎక్కడికెళ్తే అక్కడికొస్తున్నావు? అని
చందమామని ప్రశ్నిస్తూ కోప్పడ్డాను
ఆ అమాయకత్వం ఒక జ్ఞాపకం

గాల్లో గెంతుతూ ఎగురుతూ కిందపడి
తగిలించుకున్న గాయాన్ని భరించలేకపోయాను
ఆ నొప్పి ఒక జ్ఞాపకం

ఊహల్లో ఊరేగుతూ ఏగుతూ ఒక్కసారిగా
నిజాన్ని ఢీకొట్టి నిలవలేకపోయాను
ఆ అదురు ఒక జ్ఞాపకం

పంచుకుని పెంచుకున్న బంధం స్నేహంగా
వికసించినప్పుడు పులకించిపోయాను
ఆ పరవశం ఒక జ్ఞాపకం

దగ్గర తీసుకున్న స్నేహం నా విశ్వాసాన్ని
వెక్కిరించినప్పుడు తట్టుకోలేకపోయాను
ఆ నిర్వేదం ఒక జ్ఞాపకం

సాధించి ముందడుగు వేసి అందరి మన్ననలు
పొందుతున్నప్పుడు ఉబ్బిపోయాను
ఆ విజయగర్వం ఒక జ్ఞాపకం

ఒక్కో అనుభవం నన్ను నాకు పరిచయం చేస్తూ
జ్ఞాపకాలుగా నిక్షిప్తమవుతున్నాయి
గుర్తొచ్చిన ప్రతీ సారీ నాకు ఏదొకటి బోధిస్తున్నాయి
అవి గుర్తొచ్చిన ఈసారి...
నన్ను ప్రశ్నించే క్షణంతో అనుబంధం అవివేకమని
ఆ క్షణాన్ని ప్రశ్నించకుండా సాగిపోనివ్వాలని
ఆ క్షణం నాలో పలికే రాగమే నా జీవనపు సంగీతం కాదని... చెప్తున్నాయి...

Wednesday, July 16, 2008

కాలపు కడలి కెరటాలు: స్నేహ మాధుర్యం




మెల్లగా ఊరంతా అలవాటైపోయింది. శివాలయం అరుగుల మీద మొద్దబ్బాయి, ఇక్కడ ఈ స్కూల్లో నాల్గో తరగతికొచ్చేసరికి ఫస్ట్ రాంకర్ అయిపోయాడు. క్లాస్ అంతా స్నేహితులైపోయారు. మేము ఆరుగురం క్లోజ్గా ఉండేవాళ్ళము. ఒకే బెంచ్ మీద కుర్చునేవాళ్ళము. మా ముందు అమ్మాయిల బెంచ్లు ఉండేవి. అప్పుడప్పుడు మేము కాళ్ళు అమ్మాయిల బెంచ్ మీద పెట్టుకునేవాళ్ళము. వాళ్ళని ఏడ్పించడానికి కాదు.అలా పెట్టుకుంటే మాకు సౌఖ్యంగా ఉండేది. అమ్మాయిలు మాత్రం కాలు పెట్టినప్పుడల్లా కోపంగా వెనక్కి చూసేవాళ్ళు.ఒక్కోసారి ఆ చూపులకే తీసేసేవాళ్ళము, ఒక్కోసారి చెప్పించుకునేవాళ్ళము. కానీ నా ముందు కుర్చున్న అమ్మాయి... పేరు వాసవి,వాళ్ళ నాన్న గారు గవర్నమెంట్ స్కూల్లో టీచర్... నేను కాలు తీసేస్తే, వెనక్కి తిరిగి పెట్టుకో అనేది... :-) మా వాళ్ళు కుళ్ళుకునేవారు...

ఆడుతూ పాడుతూ ఐదో తరగతికి వచ్చేసాము. క్వార్టర్లీ ఎగ్జాంస్ అయిపోయాయి అప్పుడు... ఇంట్లో అమ్మ, నాన్న అన్నీ ఆలోచించి ఊళ్ళో ఉండటం కన్నా సిటీలో ఉంటే మా ఇద్దరి భవిష్యత్తు బాగుంటుంది అని నిర్ణయించుకున్నారు. హాఫ్ ఇయర్లీ అయ్యేసరి అమ్మ,నాన్న,తమ్ముడు సిటీ కి వెళ్ళిపోయారు. నన్ను అమ్మమ్మ దగ్గర వదిలేసి.ఒక మిశ్రమ అనుభూతి అది.. అమ్మమ్మ దగ్గర ఉంటానని ఆనందంగా ఉన్నా, ఏంటో అమ్మ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతున్నారు, నేను కూడా తరవాత అక్కడికి వెళ్ళాలి అన్న ఆలోచన నాకు ఇబ్బందిగా ఉండేది...

నేను రోజు రిక్షా ఎక్కి స్కూల్కెళ్ళేవాడిని. ఒక్కోసారి పెంటయ్య రిక్షా, ఒక్కోసారి పెద్ద మీసాల చంద్రయ్య రిక్షా ఎక్కాల్సి వచ్చేది. ఇప్పటికీ వీళ్ళు రిక్షా నడుపుతున్నారు...

ఐదో తరగతి అయిపోవడానికి ఎన్నో రోజులు లేవు. నాకు చివరి పరీక్షల ముందు చికన్ పాక్స్ వచ్చింది. ఒక నెల రోజులు ఇంట్లోనే ఉండి చదువుకున్నా. అమ్మమ్మ నాకు లెక్కలు కూడా చెప్పేది. ఇప్పుడు చదివే స్కూల్లో ఐదో తరగతి వరకే ఉంది. ఆ తరవాత ఏంటీ అని ఒకరోజు మేమంతా మాట్లాడుకోవడం మొదలుపెట్టాము... మా వాళ్ళంతా దగ్గర టౌన్లోని స్కూల్లో గానీ, గవర్నమెంట్ స్కూల్లో గానీ చేరతామని చెప్పారు. నేనేమో వీళ్ళందరిని వదిలేసి ఇంకెక్కడికో దూరంగా వెళ్ళాలి...అదే చెప్పాను వాళ్ళతోటి... ఒక్కసారి వాతావారణం నిశ్శబ్ధంగా అయిపోయింది... మరలా మనం కలుస్తామా లేదా అన్నట్టు. ప్రతి ఒక్కరు ఆలోచించుకుంటున్నాం... మొత్తం మీద ఆ నిశ్శబ్ధంలో నుండి మాటలు మొదలయ్యాయి. అందరం ఒక్కసారి చేతులు కలుపుకున్నాము... ఎవరు ఏ స్కూల్లో చేరినా వేసవి సెలవల్లో కలుసుకోవాలని... ఎక్కడికెళ్ళినా మనమంతా కలిసే ఉండాలని... ప్రతిజ్ఞ చేసుకున్నాము... ఆ క్షణంలో ఉవ్వెత్తున లేసిన కెరటంలా అందరం ఒకేరకమైన అనుభూతికి గురయ్యాము...

స్నేహాలకి సంబందించిన జ్ఞాపకాల్లో నాకు బాగా గుర్తుండిపోయే పాత తాజా జ్ఞాపకం... నాకైతే అప్పుడే స్నేహ మాధుర్యాన్ని తొలి సారి రుచి చూసినట్టనిపిస్తుంది...

మీరు మీ స్నేహితులు అలా మీ స్నేహాన్ని బయటపెట్టుకున్న జ్ఞాపకాలున్నాయా?

Tuesday, July 15, 2008

కాలపు కడలి కెరటాలు: భయం

ఇంకా నాకు మా ఊరు కొత్తగానే ఉంది. తమ్ముడు నాకు తెలియని వాళ్ళని పరిచయం చేస్తూ ఉండేవాడు. ఈలోగా నా పుట్టిన రోజు వచ్చింది. అమ్మమ్మ దగ్గర పుట్టినరోజు అంటే, గుడిలో పూజ చేయించుకుని క్లాస్ అంతా చాక్లెట్లు, పెన్సిల్లు, ఎరేజర్లు పంచిపెట్టడం. ఇక్కడ పుట్టినరోజు ఎలా చేస్తారో తెలియదు. ఊహ తెలిసాక అమ్మ దగ్గర మొదటి పుట్టినరోజు. అమ్మ వాళ్ళ హడావుడి చూస్తుంటే ఎదో భారీగానె సిద్ధం చేస్తున్నారు అనిపించింది... ఊళ్ళో చూట్టాలంతా వస్తున్నారంట...

ఇంకా క్లాస్లో ఎవరూ ఫ్రెండ్స్ అవ్వలేదు... పుట్టినరోజు అయితే అందరికీ చాక్లేట్లు ఇచ్చేసి ఫ్రెండ్స్ చేసుకోవచ్చు కదా... ఇవన్నీ నన్ను ఆ రోజు కోసం ఎదురు చూసేట్టు చేసాయి...

రేపే పుట్టినరోజు...

అమ్మ వాళ్ళ పిన్ని కూతురు ముందే వచ్చేసింది... ఆ పెద్దమ్మ చేస్తున్న హడావుడి చూసి భలే ఆనందం వేసింది... రేపు ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి అని వాళ్ళు మాట్లాడుకుంటుంటే కేక్ సంగతి నా చెవిలో పడింది... ఇంక నా ఆనందానికి అవధుల్లేవు... అలా ముందు రోజు పెద్దమ్మ కబుర్లు, చుట్టూ ఉన్న చూట్టాల కబుర్లతో పండగ వాతావరణంలా ఉంది.. అదంతా నా కోసమే అని ఉబ్బి తబ్బిబ్బయిపోయాను...

ఆనందంలో అలిసిపోయి రాత్రికి రేపటి గురించి ఆలోచిస్తూ నిద్రపోయాను...

తొందరగానే నిద్రపట్టేసింది....

నిద్రలో...

పట్ట పగలు... పక్కగా ఉన్న వంట గదిలో అమ్మ వంట చేసుకుంటుంది... అమ్మకి కనపడకుండా హాల్ లో నుండి బేడ్ రూంలోకి నాకు తెలియని ఒక వ్యక్తి, ముసుగుతో అడుగుపెట్టేసాడు... నేను గమనించలేదు... ఇంకో వైపు తిరిగి ఏదో చేస్తున్నాను... శబ్ధం అయి వెనక్కి తిరిగి చూస్తే అతను నాకు దగ్గరగా వచ్చేస్తున్నాడు... నాకు భయం వేసింది... తను ఇంకా దగ్గరకొచ్చేస్తున్నాడు... నేను భయంలో అరవలేకపోయాను... నేను అతనినుండి వెనక్కి జరుగుతున్నాను... తను ఇంకా దగ్గరకి వచ్చేస్తున్నాడు.. నేను ఇంకా వెనక్కి జరుగుతున్నాను... నా వైపు చేయివెయ్యబోతే ఇంక వేగంగా వెనక్కి జరిగాను... అలా జరుగుతుంటే నా తలకి ఎదో బలంగా తగిలింది.... అంతే ఏడుస్తూ నిద్ర లేచాను....

ఏం జరిగిందంటే... నేను కలలో వెనక్కి జరుగుతు, బెడ్ మీద కూడా వెనక్కి వెనక్కి జరిగి తలగడని దాటేసి డబుల్ కాట్ అంచుకు,దానికి ఆనుకున్న గోడకి బలంగా నా తలని గుద్దుకున్నాను....

ఆ తలనొప్పితో తరవాత నిద్ర పట్టలేదు... తరవాత రోజంతా కూడా తలనొప్పి తగ్గలేదు...

అందరు హడావుడి చేస్తుంటే నేను మాత్రం ఎంజాయ్ చెయ్యలేకపోయాను.... :(

సాధారణంగా నాకు కలలు గుర్తు ఉండవు ఎక్కువ రోజులు... కానీ ఈ ఒక్క కల మాత్రం అప్పటి నుండి ఇప్పటి వరకు మరచిపోలేదు...

నిజంగా నిజ జీవితంలో కూడా భయాన్ని అంత భయంకరంగా చూడలేదు....

మీకు వెంటాడే జ్ఞాపకాల్లో ఏమైనా కలలు ఉన్నాయా??