సూర్యుని ప్రతాపం చీకటి పడినా ఇంకా వీస్తున్న గాలిలో కనిపిస్తుంది
రాత్రి తన ప్రయత్నం తను చేస్తూ చల్లదనాన్ని మోసుకొస్తుంది...
తీరిక తెచ్చుకున్న నేను అడుగులేస్తున్నాను
ఏకాంత పథంలో...
.
.
ఒక్కరినే కన్న తల్లి ఊగుడు బల్లకి ఒక వైపుండి
తన బిడ్డకి తోబుట్టువు లోటుని భర్తీ చేయడానికి ప్రయత్నిస్తుంది....
.
తలపండిన ఇద్దరు పెద్దవాళ్ళు కాలాన్ని వెళ్ళదీస్తున్నారు,
ఒకరు రెండేళ్ళ మనవడిని ఉయ్యాలెక్కించి ఊపుతున్నారు...
మా ఊళ్ళో అయితే ఆ వయసువాళ్ళకి ముని మనవళ్ళు నడవడానికి ఊతంగా వస్తారు
.
ఒక అమ్మాయి, ఒక అబ్బాయి
వాళ్ళ స్కూలు స్నేహితుల గురించి మాట్లాడుకుంటున్నారు
ఈ స్నేహాన్ని ఎప్పటి వరకు నిలుపుకుంటారో...?
.
ఒక జంట... నడుస్తున్నారు...
ఎప్పుడూ చీరలో కనపడే ఆవిడ ఈరోజు చుడిదార్లో ఉంది
... ఆవిడ నడుస్తూ కబుర్లు చెప్పేస్తుంది...
ఆయన ఊ కొడుతున్నాడు... వాళ్ళిద్దరూ మేమిద్దరం ఒక జట్టు అన్నట్టుంటారు...
ఆఫీసు నుండి రాగానే వాళ్ళు చేసే మొదటి పని నడక,నడుస్తూ కబుర్లు
పని ఒత్తిడికి మంచి ఉపాయం కదా...!
.
నాలుగేళ్ళున్న ఇద్దరు పాపలు...
ఒక పాప జారుడు బల్ల దిగి, ఎవరు గెలుస్తారో చూద్దాము అంటూ పరుగెడుతుంది
ఇంకో పాప పరుగందుకోలేకపోతే, వెనక్కెళ్ళి చేయి పట్టుకుని తనతో పాటు పరుగెట్టిస్తుంది...
.
ఇద్దరు ఆరుపదులు దాటిన ఆడవాళ్ళు
పిల్లలు కనడం గురించి మాట్లాడుకుంటున్నారు...
ఇప్పటికి ఎంత జీవితాన్ని చూసుంటారో... అయినా కొత్త విషయం లానే! అంతే ఆసక్తితో!
.
ఇంకో పెద్దాయన,
వంగీ వంగలేక వాటర్ ట్యూబుని ఎత్తబోతున్నాడు ఇంకో పక్క తడపడానికి
అసంకల్పితంగానే ఆ ట్యూబుని ఎత్తి పక్కన పెట్టాను
.
నడచి అలసిన "ఆ జట్టు" బెంచి మీద కుర్చుంది...
ఇప్పుడు ఆయన కూడా కబుర్లు చెప్తున్నాడు
ఆవిడ కూడా ఊ కొడుతుంది
వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళ పాప
.
ఎంత నడిచినా నా కాళ్ళు అలసిపోవు
నడిచీ నడిచీ నా మనసు అలసిపోతుంది
అది అలసిన మరు క్షణం, ఒక్క అడుగూ ముందుకు పడదు...
నడుస్తూ...
.
.
.
దూరంగా ప్రతి పది నిమిషాలకి పైపైకి ఎదుగుతున్న పెద్ద చందమామ
పచ్చగా జ్వరం వచ్చినట్టు... నాలా ఒంటరిగా...
.
.
.
అమ్మ ఫోన్ చేసింది...
ఎంత సేపు మాట్లాడాను? 54 నిముషాలు...
.
నడుస్తూనే ఉన్నాను
.
దూరంగా చందమామ... ఇంకా పైన...చిన్నగా
ఇప్పుడు తెల్లగా మెరుస్తూ!