ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...

వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...

Tuesday, May 20, 2008

నింగీ నేలా కలిసేనా..?
చిరుగాలల్లే వస్తావు
స్నేహ మాధుర్యాన్ని రుచి చూపిస్తావు
పెనుగాలై పోతావు
నాలో అలజడినే రేకిత్తిస్తావు
వానల్లే వస్తావు
మోడైన నాలో చిగురాశలొలికిస్తావు
ఉప్పెనై పోతావు
నాలో వరదై పోటెక్కిస్తావు
వెలుగల్లే వస్తావు
నాలో రంగుల్నే నింపుతావు
పగలల్లే వస్తావు
నీ వైపు నడిపిస్తావు
ఇంతలో... చీకట్లో వదిలేస్తావు!
కవ్వించే నా చెలీ!
నా సహనానికి ఈ చెట్టు, ఆ పిట్ట, ఈ గట్టు, ఆ గోదారే సాక్ష్యం!
నేను నిన్ను కలిసేనా?!


ఇది పృధ్వి గారి చిత్రానికి రాసింది... ఆయన మది దోచుకుంది అన్నారు!
ఇక్కడ పృధ్వి గారి చిత్రానికి వచ్చిన స్పందనలు చూడొచ్చు...
http://pruthviart.blogspot.com/2008/04/blog-post_30.html

Friday, May 16, 2008

అలజడి


దూరంగా బస్సు ఘోరంగా అరుస్తూ పోతుంది
ఈ పార్క్లోనే కూర్చుంటానే... నాకెప్పుడూ అలా వినిపించలేదే
అది వింటుంటే గుండెల్లో రంపంపెట్టి కోస్తున్నట్టుంది
అల్లరి చేస్తూ ఆడుకునే ఆ పిల్లల్ని భరించలేకపోతున్నాను
ఊగుతున్న ఆ ఉయ్యాలని చూస్తుంటే నా కళ్ళుతిరుగుతున్నాయి
ఎప్పుడూ ఇలా అనిపించలేదే
విశాలమైన ఆ ఆకాశాన్ని, ఎదుగుతున్న ఆ చంద్రుడుని
నేను చూడలేకపోతున్నాను...అవి నన్ను చిన్నచూపు చూస్తున్నట్టుంది
నేను చూడను.నేను ఇలానే కూర్చుంటాను
తల దించుకుని.చేతుల్లో నా మొహం

Monday, May 12, 2008

అమ్మా!నేనదృష్టవంతుణ్ణిపల్లెటూరు సుఖాలని వదిలిపెట్టి మా మంచి కోసమని పట్నం వచ్చి
నువ్వే చాకలివై,పని మనిషివై,పాలేరువై,కుట్టు మనిషివై బండ చాకిరీ చేసావు

నీకు ఎదైనా నొప్పి వచ్చిందని తెలిసినప్పుడు
నాలో ఏదో అలజడి నన్ను దహించివేస్తుంది
ఈ రెక్కల గూడు ఎమైపోతుందో అని....

ఎవరైన నీ కష్టాన్ని చూసి నిన్ను మెచ్చుకుంటుంటే
నా కుటుంబం కోసం చేస్తున్నాను,నాకు అది ఇచ్చే సంతృప్తి చాలు అని కొట్టిపారేస్తావు...
పిచ్చి అమ్మా...! నువ్వేమి చేస్తున్నావో నీకు తెలియదేమొ
సంతృప్తి కోసం నువ్వు చేసే త్యాగాలు అన్నా ఇన్నా!
బయటి ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు నీకు కొడుకుగా
పుట్టడం నిజంగా నా అదృష్టం అనిపిస్తుంది...

మా అందమైన భవిష్యత్తు కోసం నువ్వు కనే చిన్న చిన్న కలలే నిన్ను నడిపిస్తాయి
ఆ కలలని నువ్వు నాతో పంచుకుంటున్నప్పుడు నీతో రెట్టించి మాట్లాడతాను అన్ని కలలు ఉండకూడదని
నువ్వూ అంతే గట్టిగా వాదిస్తావు
వాదనలో మసకబారే నీ కళ్ళని చూడలేక నేను అక్కడి నుండి వెళ్ళిపోతాను...
కానీ అమ్మా నీ కలలు గొంతెమ్మ కొర్కెలని కాదు.. అవి చాలా చిన్నవే..
కానీ ఆ చిన్న చిన్న కోరికలు కూడా తీరకపొతే వాటి మీదే బతుకుతున్న నువ్వు తట్టుకోలేకపోతావని నాకు భయం...
ఇప్పటికే నీకు దూరంగ ఉంటున్నాను...భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు...
అందుకే అంటాను నీకంటూ ఒక వ్యక్తిగతం ఉండాలి... నీకంటూ ఒక ప్రపంచం ఉండాలి అని...

నీకెవరైనా కష్టం చేస్తే క్షమించు, సహనంతో ఉండు, ప్రేమతో మాత్రమే ఎదుటివాళ్ళని గెలవగలవు
అని నువ్వు చెప్పే మాటలని పాటించాలని ప్రయత్నిస్తున్నప్పుడు ఒక్కోసారి నాకు నేను బలహీనుడిగా కనపడతాను
కానీ నీ జీవితాన్ని తరచి చూస్తే నాకు ధైర్యం వస్తుంది... నువ్వు చెప్పినట్టే ఉంటాను...

నాకు "మీ అమ్మంటే ఇష్టం" అని చెప్పే స్నేహితులూ ఉన్నారు తెలుసా?
అలా విన్నప్పుడు నాకు ఎంత గర్వంగా ఉంటుందో తెలుసా!

ఈ బాబుని ఇంతకుముందు ఎక్కడో చూసినట్టుంది... నీతో నాకు ఇంతకుముందే పరిచయమున్నట్టుంది
అని చాలా మంది అంటుంటే నువ్వు నాకు పంచిన ప్రేమ శక్తే అందరిని నాలో పోలికలు వెతుక్కునేట్టు చేస్తుందనుకుంటాను...

అస్తవ్యస్థంగా నడిచే భారత దేశం, అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఈ దేశం
ఎంతోకొంత సవ్యంగా ముందుకెళ్తుంది అంటే అది నీలాంటి అమ్మల వల్లే అని నాకనిపిస్తుంది...

కష్టాలు కడగండ్లకు
అణువణువునా నీ కాయం కుదేలైపోతుంటేను
చిరునవ్వుతో మమ్మల్ని నీ దరికి తీసుకున్నావు
ఆ నవ్వు వెన్నెల్లో నీ ఒడిలో మేము సేదతీరుతుంటేను
నీ భాధనే మరిచావు
మా బంగరు భవిష్యత్తుకై కలలు కన్నావు
ఆ కలల స్థైర్యంతో రేపటికి ఎదురు నిలిచావు
నన్ను కన్న నా అమ్మ ఏంచేసి
నీ కన్న నీ ౠణం తీర్చుకోగలడు?

Thursday, May 1, 2008

నల్లని చందమామ
చీకటినంతా తనలో దాచేసుకున్నట్టు
వెన్నెలనంతా ఆకాశం నిండా నింపేసినట్టు
తెల్లటి ఆ ఆకాశంలొ నల్లని ఆ చందమామ చల్లగా మెరిసిపోతుంది
ఆ అందాన్ని కనులారా చూద్దామని ప్రయత్నిస్తుంటే,
ప్రకృతి లోని సరిగమలకి,
అటు ఇటు ఊగుతూ చందమామ నాతో దోబూచులాడుతుంది...

నీ మాటకి భావానికి అనుగుణంగా
కదులుతున్న నీ కళ్ళని బంధించాలని నా కళ్ళు నన్ను మరిచిపోతున్నాయి
నీ కనుపాపల నలుపులో నాకు దాగిపోవాలనుంది
ఆ కన్ను గిలుపుల్లో నా ఉనికిని చాటుకోవాలనుంది
రెప్ప పాటైనా నీ కలల్లో నిలవాలనుంది

అందమైన ఆ కళ్ళని ఎంతసేపు చూసినా తనివి తీరడంలేదు
ఆడే ఆ కన్నులని నేననుసరించలేకపోతున్నాను
ఒకసారి నా కళ్ళల్లోకి చూడవా?
అలసిన నేను చల్లని నీ చూపుల నిండు వెన్నెల్లో సేదతీరతాను
ఆ వెన్నెల మొత్తాన్ని నాలోనే నింపుకుంటాను...