ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...

వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...

Friday, May 13, 2011

వెన్నెల నీడలు

గది ఐమూలన కిటికీ వెనక చందమామ ఎదుగుతుంది
పడక మీద కంబళి చాటున దేహం ముడుచుకుపోతుంది
మొహమంతా వెన్నెల పరుచుకుంటుంది

ఏదో తెలియని శక్తి లోలో యుగాల నిర్లిప్తతని బుజ్జగించి నను బయటకు లాగింది

బయటేమో రెపరెపల గాలి..
రెప్పలని విప్పారనీయడం లేదు
అది మోసుకొస్తున్న చలి నిలువనీయడం లేదు
చూపులకీ చందమామ చిక్కడం లేదు

నిలువలేక నిదుర రాక పడక మీద అటు ఇటు అవుతూ నేను
వెన్నెల కన్నులలో  వెలిగిపోతుంది
మనసేమో ఏదో ఆనవాల జాడని శోధిస్తుంది

వెన్నెల ఆచూకి ఈనాటిదా...


పొలం నుండి వస్తూ పందెమాడిన చందమామ
చిరుగాలికి కొబ్బరాకులు చీరేసిన చందమామ
చింతల చీకట్లో దారి చూపిన వెలుగుల చందమామ
భయాలను భ్రమింప చేసిన వేపాకు చుక్కల చందమామ
వెన్నెల స్నానాల్లో అలల మీద నలిగిపోయిన చందమామ
అరచేత పండిన చందమామ
ఏకాంతంలో తోడైన చందమామ
ఆటుపోట్ల అలజడితో ఎండమావులు చూపించిన చందమామ
వెన్నెలే వెలివేసిన ఒంటరి చందమామ
పున్నమే నిందించిన పున్నమి చందమామ
ఎన్నో కథలు విన్న చందమామ
అబ్బురాల అంతరిక్ష చందమామ


వరసగా మనసు తెర మీద ఛాయాచిత్రాలు


జాడ తెలియని వేళల్లో ఆ ఆనవాళ్ళే ఆసరా అవుతాయి
వచ్చిపోయే పున్నములయినా అవి పంచే వెన్నెల
వెంటే నిలిచే నీడలవుతాయి
చిత్రం 'విశాల ప్రపంచం'  సౌజన్యంతో