ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...

వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...

Tuesday, June 4, 2013

లాలి



చిన్నారీ చిన్నయ్యా చిన్నారీ కన్నయ్యా జో జో.. జో జో
చిన్నారి చిన్నయ్యా చిన్నారి కన్నయ్యా
పగలేమిటి?
రేయేమిటి?
చిన్నారి చిన్నయ్యా చిన్నారి కన్నయ్యా
పగలేమిటి?
రేయేమిటి?
ఆహ? పగలేమిటి?! రేయేమిటి?!
చిన్నారీ చిన్నయ్యా 
నీ మెలకువే నాకు పగలు నీ మెలకువే నాకు పగలు
మా ఇంటా సూరీడువి జో జో.. జో జో
మరి రేయేమిటి? రేయేమిటి?
చిన్నారీ కన్నయ్యా
నీ నిదురే నాకు రేయి నీ నిదురే నాకు రేయి
నా కంటీ జాబిలివి జో జో.. జో జో
చిన్నారీ చిన్నయ్యా జో జో
చిన్నారీ కన్నయ్యా జో జో
మా ఇంటా సూరీడువి జో జో
నా కంటీ జాబిలివి జో జో
జో జో.. జో జో.. జో జో


 చిత్రం indkids.com వారి సౌజన్యంతో

Tuesday, April 10, 2012

దేవీ నీలాల సరాలు ~ 1

వేచి ఉన్న ఏకాంతం వశమై ఆ యుగళం పారవశ్యంతో  ఏకమవుతుంది...

ఏమయిందో...

మళ్లీ ఎదురవబోయే ఎడబాటు ఊహకంది ఆ క్షణంలో చొరబడింది..
ఒక్కసారిగా ఆమె కంపించి ఆతని మీద వాలిపోయింది
చేతులు దండలా ఆతని కంఠాన్ని చుట్టుకున్నాయి
మొహం ఛాతిలో దాగిపోయింది
లాలనగా అతను ముంగురులు సవరించబోతే
చేతుల బంధనం బిగుసుకుంది
ఫాలభాగామేమో ఆతని చుంబనాన్ని నిరాకరిస్తూ గారంగా ఛాతిని దోస్తుంది
కొనతేరిన ఆమె చుబుకం ఛాతి మధ్య గాయం చేస్తుంది
ఆమె నయనాలు ఏదో రచిస్తున్నాయి
అర్ధం చేసుకుంటున్న అతని హృదయం ద్రవిస్తుంది

చేదండని  వదిలించి చుబుకాన్ని అందుకుని మాట కలుపుతూ అతను
ఆమె నయన కావ్యాల్లో ఆతని అనునయ  వాక్యాలు కొట్టుకుపోతున్నాయి

ఏమయిందో...
తనే ఆ క్షణాన్ని వశం చేసుకుంది
ఆతని ఫాలాన్ని చుంబించి దరి చేర్చుకుంది

ఆతని నయనాలూ రచిస్తున్నాయి

Thursday, December 8, 2011

వెన్నెల బంతి



గోదావరీ తీరం
శరత్ నాటి
సాయంత్రం
మబ్బులేని నింగిలో తెరలు తెరలుగా వెన్నెల పంచుతున్న నిండు చందమామ
వెన్నెల వెలుగుకి చిన్నబోయి తారలు నింగినొదిలి 
ఈ తీరంలో చేరి పసిడిలా మెరుస్తున్నాయా అన్నట్టు ఇసుక దొంతరలు
ఒడ్డున వెన్నెలని భారంగా మోస్తూ దట్టమైన చెట్లు
చిక్కగా మెరుస్తున్న పచ్చని ఆకులు
అటు గోదారి మీద అలల బోయలు వెలుగుని ఏ లోకానికో రవాణా చేస్తున్నట్లు 
అలలని తాకి తీరమంతా విహారం చేస్తున్న సమీరాలు


తన సమక్షంలోనే నన్ను గెలవాలని ప్రకృతి పదనిసలు
నేను మాత్రం తన మరపులోనే

వినిపిస్తూ తను పిల్లల మధ్య

ఏదైనా ఆట ఆడుకుందాం అక్కా!  పిల్లల అరుపులు..
ఏ ఆట చెప్మా! ఉల్లాసంగా ఆరా తీస్తూ తను
గాల్లో చిటికెలు వేస్తూ అంది.. హా.. వెన్నెల బంతి!
ఏయ్ ఏయ్ వెన్నెల బంతి! వెన్నెల బంతి! పిల్లల కేరింతల గానం


చకచకా చిత్తు కాయితాలు ఆకులతో తన చేతుల్లో బంతి తయారు
పైకి  ఎగరేస్తూ  అంది.. ఎవరు  పట్టుకుంటే  వాళ్ళదే  గెలుపు  అని 
నన్నూ  చేరమని  గాలిలోనే  గేలం  విసిరింది  ఉత్సాహంగా  

నేనూ  వాళ్ళ  మధ్య ..
బంతి  గాలికి  ఊరిస్తూ  దొరకనంటుంది

మది  చిలిపి  రాగం  అందుకుంది
తనలో  చక్కిలిగింతలు పలికించింది 
పడబోతూ తను  నా  చేతుల్లో..
మరు క్షణం ఇసుక పాన్పు మీద


పిల్లల్లో  ఎవరో  గెలిచారు 

ఏయ్  ఆగు!
నను  వెంటాడుతూ  నా గెలుపు..
నిండా  నా  కన్నుల్లో  నా  వెన్నెలబంతి!





*తను చిన్నప్పుడు వెన్నెల్లో ఆడుకున్న ఆట 'వెన్నెల బంతి'
*చిత్రం గీసినది వెన్నెల కిరణ్! :-)

Wednesday, November 23, 2011

మనసైంది…




మాటలతో మొదలైన బంధం చూపులతో రూపు దిద్దుకుంది
చూపుల్లోనే బయట పడ్డ మనసులు బలంగా పెనవేసుకుంటున్నాయి...

మన కలయిక నీ పలుకుల్లో వ్యక్తమవుతున్నపుడు
నా కలలకి నువ్వు భాష్యం చెప్తున్నట్టుంటుంది

నీ చిలిపి విసురుల్లో
నీ వెవ్వెవ్వేల... ఆ ఆ ఆ కారాల
గారాల నయగారాల్లో పులకించిపోతున్నాను

యధేచ్చగా నువ్వు నన్ను నీలో కలుపుకుంటుంటే
నన్ను నేను మరిచిపోతున్నాను

చుట్టూ ఏమవుతున్నా, కాలం ఎరుగక
మనసు ప్రశాంతంగా ఉంది
రేపటి మన మనుగడని ఆవిష్కరించుకుంటుంది..



పంచభూతాలు నాకు సరి కొత్తగా ప్రస్ఫుటమవుతున్నాయి

Friday, November 4, 2011

ఏ(ఈ) కాంతపు దిలీప్!

ఏదీ నా చుక్కని తారా తీరంలో నే చూడని దిక్కు లేదు
నిరీక్షణలో కాలం పగలు రేయి తేడా కోల్పోయింది
అయినా ఆశ కోల్పోలేదు
అలుపు రానీలేదు

మరి ఏ తారలు ఏ వరసలో చేరాయో!
మనోహరమైన అనుభూతిని పంచే ఓ అందమైన జాబిల్లిని
గౌతమీ తీరంలోనే ప్రత్యక్షం చేసాయి..
నా ఏకాంతాన్ని వరిస్తానన్న ఆ  నా జాబిల్లి...  వర్ధిక!

Thursday, October 13, 2011

ఏకాంతవశం



లాలా    లా  లా ల లలలలా
చిరు గాలి..  ల లా లా.. సరాగాలలా...
వెండి వెన్నెల ల లా లా వెంటాడే ఊహలా...
వాన  న నా నా వెల్లువయి పొంగే వలపులా...
తార  ర రా రా తారాడే నీ తలపులా..
మే...ఘం! మ్ హు హూ నిండు కుండ నా హృదయంలా..
ఎందుకీ
ఎందుకీ
పరవశం?
పరవశం!


Saturday, October 1, 2011

ఎర్ర జాబిలి




చిరుగాలి కవ్వింపుగా కదం తొక్కుతోంది
ఏ కార్యం తలపోసిందో!

ఆతని కోసమేనేమో!

దూరంగా గాలికి విన్యాసాలు చేస్తున్న ఆ కురులు ఆమె ఉనికిని ఇట్టే తెలిపేసాయి!
గుండె కవాటపు వేగంతో ఆతని అడుగులు


ఆతని రాకని గమనించిన ఆమె క్షణాల్లో మొహం చాటుకుంది
ఎదురుచూపులకి ఎరుపెక్కిన ఆమె కళ్ళు
ఆతని చూసిన కోపంతో ఎరుపెక్కిన ఆమె బుగ్గలు
ఇంకాసేపట్లో ప్రళయం అన్నట్లు...

అడుగులు మందగించాయి..

చూపులు కలిపే ఆతని ప్రయత్నం విఫలం
బుజ్జగింపుల నిట్టూర్పులు వ్యర్ధం..


మోకరిల్లిన అతను

మౌనమే మధ్యవర్తిత్వం నెరపుతుంది


చేయి కలిపిన అతను
ఆమె స్పందనే తెలియనట్లు!




చొరవ చేసి చూపుని బంధించే ప్రయత్నంలో
నిండుగా ఆతని రెండు చేతుల్లో ఆమె బింబం

చూపు కలవక, రెప్ప నిలవక
కనులలోన కొలనులాయెను

 
ఎర్ర జాబిలి ఎరుపు పోయెను
కోపమేమో కౌగిలాయెనే!









మనసు మాటలు మౌ.....న..మే!