ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...

వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...

Thursday, December 8, 2011

వెన్నెల బంతి



గోదావరీ తీరం
శరత్ నాటి
సాయంత్రం
మబ్బులేని నింగిలో తెరలు తెరలుగా వెన్నెల పంచుతున్న నిండు చందమామ
వెన్నెల వెలుగుకి చిన్నబోయి తారలు నింగినొదిలి 
ఈ తీరంలో చేరి పసిడిలా మెరుస్తున్నాయా అన్నట్టు ఇసుక దొంతరలు
ఒడ్డున వెన్నెలని భారంగా మోస్తూ దట్టమైన చెట్లు
చిక్కగా మెరుస్తున్న పచ్చని ఆకులు
అటు గోదారి మీద అలల బోయలు వెలుగుని ఏ లోకానికో రవాణా చేస్తున్నట్లు 
అలలని తాకి తీరమంతా విహారం చేస్తున్న సమీరాలు


తన సమక్షంలోనే నన్ను గెలవాలని ప్రకృతి పదనిసలు
నేను మాత్రం తన మరపులోనే

వినిపిస్తూ తను పిల్లల మధ్య

ఏదైనా ఆట ఆడుకుందాం అక్కా!  పిల్లల అరుపులు..
ఏ ఆట చెప్మా! ఉల్లాసంగా ఆరా తీస్తూ తను
గాల్లో చిటికెలు వేస్తూ అంది.. హా.. వెన్నెల బంతి!
ఏయ్ ఏయ్ వెన్నెల బంతి! వెన్నెల బంతి! పిల్లల కేరింతల గానం


చకచకా చిత్తు కాయితాలు ఆకులతో తన చేతుల్లో బంతి తయారు
పైకి  ఎగరేస్తూ  అంది.. ఎవరు  పట్టుకుంటే  వాళ్ళదే  గెలుపు  అని 
నన్నూ  చేరమని  గాలిలోనే  గేలం  విసిరింది  ఉత్సాహంగా  

నేనూ  వాళ్ళ  మధ్య ..
బంతి  గాలికి  ఊరిస్తూ  దొరకనంటుంది

మది  చిలిపి  రాగం  అందుకుంది
తనలో  చక్కిలిగింతలు పలికించింది 
పడబోతూ తను  నా  చేతుల్లో..
మరు క్షణం ఇసుక పాన్పు మీద


పిల్లల్లో  ఎవరో  గెలిచారు 

ఏయ్  ఆగు!
నను  వెంటాడుతూ  నా గెలుపు..
నిండా  నా  కన్నుల్లో  నా  వెన్నెలబంతి!





*తను చిన్నప్పుడు వెన్నెల్లో ఆడుకున్న ఆట 'వెన్నెల బంతి'
*చిత్రం గీసినది వెన్నెల కిరణ్! :-)

Wednesday, November 23, 2011

మనసైంది…




మాటలతో మొదలైన బంధం చూపులతో రూపు దిద్దుకుంది
చూపుల్లోనే బయట పడ్డ మనసులు బలంగా పెనవేసుకుంటున్నాయి...

మన కలయిక నీ పలుకుల్లో వ్యక్తమవుతున్నపుడు
నా కలలకి నువ్వు భాష్యం చెప్తున్నట్టుంటుంది

నీ చిలిపి విసురుల్లో
నీ వెవ్వెవ్వేల... ఆ ఆ ఆ కారాల
గారాల నయగారాల్లో పులకించిపోతున్నాను

యధేచ్చగా నువ్వు నన్ను నీలో కలుపుకుంటుంటే
నన్ను నేను మరిచిపోతున్నాను

చుట్టూ ఏమవుతున్నా, కాలం ఎరుగక
మనసు ప్రశాంతంగా ఉంది
రేపటి మన మనుగడని ఆవిష్కరించుకుంటుంది..



పంచభూతాలు నాకు సరి కొత్తగా ప్రస్ఫుటమవుతున్నాయి

Friday, November 4, 2011

ఏ(ఈ) కాంతపు దిలీప్!

ఏదీ నా చుక్కని తారా తీరంలో నే చూడని దిక్కు లేదు
నిరీక్షణలో కాలం పగలు రేయి తేడా కోల్పోయింది
అయినా ఆశ కోల్పోలేదు
అలుపు రానీలేదు

మరి ఏ తారలు ఏ వరసలో చేరాయో!
మనోహరమైన అనుభూతిని పంచే ఓ అందమైన జాబిల్లిని
గౌతమీ తీరంలోనే ప్రత్యక్షం చేసాయి..
నా ఏకాంతాన్ని వరిస్తానన్న ఆ  నా జాబిల్లి...  వర్ధిక!

Thursday, October 13, 2011

ఏకాంతవశం



లాలా    లా  లా ల లలలలా
చిరు గాలి..  ల లా లా.. సరాగాలలా...
వెండి వెన్నెల ల లా లా వెంటాడే ఊహలా...
వాన  న నా నా వెల్లువయి పొంగే వలపులా...
తార  ర రా రా తారాడే నీ తలపులా..
మే...ఘం! మ్ హు హూ నిండు కుండ నా హృదయంలా..
ఎందుకీ
ఎందుకీ
పరవశం?
పరవశం!


Saturday, October 1, 2011

ఎర్ర జాబిలి




చిరుగాలి కవ్వింపుగా కదం తొక్కుతోంది
ఏ కార్యం తలపోసిందో!

ఆతని కోసమేనేమో!

దూరంగా గాలికి విన్యాసాలు చేస్తున్న ఆ కురులు ఆమె ఉనికిని ఇట్టే తెలిపేసాయి!
గుండె కవాటపు వేగంతో ఆతని అడుగులు


ఆతని రాకని గమనించిన ఆమె క్షణాల్లో మొహం చాటుకుంది
ఎదురుచూపులకి ఎరుపెక్కిన ఆమె కళ్ళు
ఆతని చూసిన కోపంతో ఎరుపెక్కిన ఆమె బుగ్గలు
ఇంకాసేపట్లో ప్రళయం అన్నట్లు...

అడుగులు మందగించాయి..

చూపులు కలిపే ఆతని ప్రయత్నం విఫలం
బుజ్జగింపుల నిట్టూర్పులు వ్యర్ధం..


మోకరిల్లిన అతను

మౌనమే మధ్యవర్తిత్వం నెరపుతుంది


చేయి కలిపిన అతను
ఆమె స్పందనే తెలియనట్లు!




చొరవ చేసి చూపుని బంధించే ప్రయత్నంలో
నిండుగా ఆతని రెండు చేతుల్లో ఆమె బింబం

చూపు కలవక, రెప్ప నిలవక
కనులలోన కొలనులాయెను

 
ఎర్ర జాబిలి ఎరుపు పోయెను
కోపమేమో కౌగిలాయెనే!









మనసు మాటలు మౌ.....న..మే!




Tuesday, July 26, 2011

ఏమీ కాని వాడిని



అభిరుచులో, అభిమానాలో మన జీవితాలని పెనవేస్తాయి.. సమాంతరంగా..
మరేవో కారణాలు వాటిని అదుపులో ఉంచుతాయి

మన మధ్య దగ్గరితనం తెలుసుకోవాలంటే దూరాన్ని తెలుసుకోవాల్సిందే

నిన్ను నువ్వు కోల్పోబోతున్నప్పుడు  నేను నీకే తెలియని నీ బందీని
నన్ను నీలో కలుపుకోబోతున్నప్పుడు నువ్వు అందుకోలేని దిగంతాల దూరాన్ని

నీ చుట్టూనే ఉండే ఏమీ కాని వాడిని  
నా పరిధిలోనే బతికే పరాయివాడిని

నేస్తం! నేను కేవలం నీ నేస్తాన్ని!

Sunday, June 19, 2011

మేఘాల నీడల్లో



ఎటు నుండి వస్తాయో..
అనుకోని వేళల్లో గొడుగు పడతాయి
ఎండల్లో సేదతీరుస్తాయి
వెన్నెల్లో అలరిస్తాయి

కరిగి కదిలిస్తాయి
కదిలి కరిగిస్తాయి

వాటి ఉనికిని కోల్పోయి నా ఉనికిని ప్రశ్నిస్తాయి
కాని నా ఉనికిని ఇష్టంగా చూసేది వాటి నీడల్లోనే

ఎటు నుండి వస్తాయో... ఎటెళ్తాయో..

మేఘాలు ఆడవే అన్నాను కదూ!


.

Friday, May 13, 2011

వెన్నెల నీడలు





గది ఐమూలన కిటికీ వెనక చందమామ ఎదుగుతుంది
పడక మీద కంబళి చాటున దేహం ముడుచుకుపోతుంది
మొహమంతా వెన్నెల పరుచుకుంటుంది

ఏదో తెలియని శక్తి లోలో యుగాల నిర్లిప్తతని బుజ్జగించి నను బయటకు లాగింది

బయటేమో రెపరెపల గాలి..
రెప్పలని విప్పారనీయడం లేదు
అది మోసుకొస్తున్న చలి నిలువనీయడం లేదు
చూపులకీ చందమామ చిక్కడం లేదు

నిలువలేక నిదుర రాక పడక మీద అటు ఇటు అవుతూ నేను
వెన్నెల కన్నులలో  వెలిగిపోతుంది
మనసేమో ఏదో ఆనవాల జాడని శోధిస్తుంది

వెన్నెల ఆచూకి ఈనాటిదా...


పొలం నుండి వస్తూ పందెమాడిన చందమామ
చిరుగాలికి కొబ్బరాకులు చీరేసిన చందమామ
చింతల చీకట్లో దారి చూపిన వెలుగుల చందమామ
భయాలను భ్రమింప చేసిన వేపాకు చుక్కల చందమామ
వెన్నెల స్నానాల్లో అలల మీద నలిగిపోయిన చందమామ
అరచేత పండిన చందమామ
ఏకాంతంలో తోడైన చందమామ
ఆటుపోట్ల అలజడితో ఎండమావులు చూపించిన చందమామ
వెన్నెలే వెలివేసిన ఒంటరి చందమామ
పున్నమే నిందించిన పున్నమి చందమామ
ఎన్నో కథలు విన్న చందమామ
అబ్బురాల అంతరిక్ష చందమామ


వరసగా మనసు తెర మీద ఛాయాచిత్రాలు


జాడ తెలియని వేళల్లో ఆ ఆనవాళ్ళే ఆసరా అవుతాయి
వచ్చిపోయే పున్నములయినా అవి పంచే వెన్నెల
వెంటే నిలిచే నీడలవుతాయి




చిత్రం 'విశాల ప్రపంచం'  సౌజన్యంతో

Monday, February 28, 2011

ఆకాశం దాటి వస్తావా?





ఏనాడు కనుగున్నానో నిను



చీకటిని అందంగా చూపే నీ వెలుగులో చుక్కలని తిరిగి లెక్కబెట్టాను
కవ్వించే నీ ఉనికితో నువ్వు పుట్టించిన ప్రశ్నలెన్ని!
ఆ ప్రశ్నల్లో సమాధానాలుగా నే జీవిస్తున్నపుడు ఎంత సంబరం!
గడిచే ప్రతీ క్షణం క్షణపు విలువని తిరగరాసింది
ఇది ఎందాకానో తెలియని నేను నిను అందుకోబోయాను
ఆకాశమంత దూరంగా నువ్వు..

నీ దగ్గరితనపు దూరం కనుగునే ప్రయత్నం నేనాపలేదు


నా నీడే నిను అలుముకుందో
మరి ఏ నీడ నిన్ను కమ్ముక్కుందో
నానాటికీ చిక్కిపోయావు
ఓ నాడు నా కన్నులకి చిక్కకుండాపోయావు
చిన్నబోయిన అవి నిన్ను వెతకడం మానేసాయి
వెలుగునే కనుగొనడం ఆపేసాయి




కాలం ఏ మాయ చేసిందో..
నా చూపుల దారిని మళ్ళించింది
ఇక నే ఎప్పటికీ కనుగోలేనేమొ అనుకున్న నువ్వు
అది నువ్వే - ఎన్నడూ చూడనంత నిండుగా!

పెల్లుబికే ప్రశ్నలు నీ సమాధానాల్లో జీవించమన్నాయి
ఈ క్షణపు విలువ ఎంత అంటూ,
నీ దూరం ఎంత దగ్గర అంటూ..
ఏదో తెలియని భావం కన్నుల్లో ముసురుకుంది
మసక మసకగా నువ్వు






చిత్రం 'విశాల ప్రపంచం' సౌజన్యంతో :)