ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...

వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...

Wednesday, June 18, 2008

మోసం


పార్క్లో కొత్తగా వచ్చిన మెరిసే దీపం
నన్ను ఈ రాత్రి దిగ్భ్రాంతికి గురిచేస్తుంది
వెన్నెల పట్ల నా విశ్వాసాన్ని వెకిలిగా ప్రశ్నిస్తుంది
ఏ పున్నమి రాత్రి కోసం ఎదురుచూస్తానో
ఆ రాత్రిని నేను కనుగోలేకపోయానని..!

మరోసారి నా కళ్ళు నన్ను మోసం చేసాయి...

అట్టడుగున ఉన్న ప్రశ్నలు ఉబికి పైకి వస్తున్నాయి

కనిపించేదంతా అందం కాదు అని నమ్మిన నా కళ్ళు
కనిపించే అందాన్ని ఎందుకు ఆరాధిస్తున్నాయో
నాకర్ధం కావటం లేదు

ఆప్తుని జ్ఞాపకాలతో తడిసిన నా కళ్ళు
తను శాశ్వతంగా దూరమైనప్పుడు ఎందుకు తడవలేదో
నాకర్ధం కావటం లేదు

నా కళ్ళు నన్ను మోసం చేస్తున్నాయి

ఈ క్షణంలో నాకు కళ్ళు మూసుకోవాలని ఉంది
నా పండు చందమామని,నిండు వెన్నెలని చూడాలని ఉంది
నిజమైన అందాన్ని శోధించాలని ఉంది
తడి లేని ఏడుపు ఏడవాలని ఉంది.