ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...

వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...

Friday, November 23, 2007

గౌతమీ తీరాన...


గౌతమీ తీరాన, ఏకాంత సమయాన..
విరహ వేదనతో నేను,
వీచే గాలుల్లా, సాగే ప్రవాహంలా..
తేలే ఊహల్లో నేను,

గూటికి చేరే పక్షులు,విహరించే చేపలు,
నా ఒంటరితనాన్ని ప్రశ్నిస్తూ ఉంటే...
చెలి రాదే అని, చెంత చేరదే అని..?
వెన్నెల్లో వెచ్చదనాన్ని వెతుక్కుంటున్నాను...
చంద్రుల్లో చెలి ముఖారవిందాన్ని చూసుకుంటున్నాను...
చుక్కల్లో తన చూపుల్ని అన్వేషిస్తున్నాను...

కిన్నెరసాని పాపి కొండల్ని పోటెక్కించినట్టు,
తలచే తలపుల, కలచే కలవరింతల స్రవంతి
నా గుండెల్ని...!

Sunday, November 18, 2007

నేను నా ఊరు వెళ్తున్నాను...


గోరు ముద్దలు తిన్న
చిన్న 'అంచు పళ్ళెం',
అమ్మమ్మ పక్కలో ఆరు బయట
పడుకున్న నులక మంచం,
ఇప్పటికి మూడు తరాలని
ఊపిన ఉయ్యాల,
పెరటి చివరన ఊరి కాలవ ఒడ్డున
తుమ్మ చెట్లకి వేలాడే పిచ్చుక గుళ్ళు,
ఆ చెట్లపై అటు ఇటుతిరిగే గుఱ్ఱాలు,
ఓనమాలు దిద్దిన శివాలయపుగుడి అరుగులు,
బస్ స్తాండ్ ఎదురి రామాలయం,

నా కోసం ఎదురుచూస్తుంటే..,
దీపావళికి నేను నా ఊరు వెళ్తున్నాను...

Wednesday, November 7, 2007

ప్రకృతి నీతో మమేకమవుతుంటే...
సంధ్యా పవనం -
నీ కురులని సుతారంగా కదిలిస్తున్నప్పుడు...

వేకువ చలి -
నీ చేతులతో నిన్ను నువ్వు చుట్టుకునేట్టు చేస్తున్నప్పుడు...

ఉదయించే సూరీడు -
నీ నుదుటి బొట్టుని చూసి,
తన ప్రతిబింబమని మురిసిపోతున్నప్పుడు...

కూసే పక్షులు -
నువ్వు చలిలో వణుకుతూ చేసే
ప్రార్ధనా గుస-గుసలు విని
ఎవరీ కొత్త పక్షి అని
ఆశ్చర్యంతోఅన్నీ నీ వైపు చూస్తున్నప్పుడు...

తొలి మంచు -
నువ్వు గుడి చుట్టు ప్రదక్షిన చేస్తుండగ,
నీ చెంప వాలున జారే
చెమట బొట్టు మీద కిరణాలు పడి మెరిసిపోతుంటే,
అది చూసి అసూయ పడుతున్నప్ప్పుడు...

నేను ఆ ప్రకృతిని మిస్స్ అవుతున్నాను...
నా చెలీ... నిన్ను మిస్స్ అవుతున్నాను...

Thursday, November 1, 2007

పిపాసిప్రేమ సౌధం కుప్పకూలి...,
గూడు కట్టుకున్న ఆశలు చెల్లా చెదురై,దిక్కు తోచక
హఠాత్తుగా ఆవరించిన శూన్యతకి ఒంటరైనమనసుతో... ఒక నేస్తం...

పచ్చ నోట్లు పలచనై,
బతుకు బండి భారమై,
అలసిన వదనంతో... ఒక నేస్తం...

సంసార సాగరం ఈదుతూ,
గజిబిజి నడకలతొ బిజీ-బిజీగా సతమతమవుతూ... ఒక నేస్తం...

కాల ప్రవాహంలొ కొట్టుకుపోతూ...
నిన్నటి జాడ మరచి, తోడు విడిచి...
కొత్త స్నేహాలతో వర్తమానంలొనే గడిపే... ఒక నేస్తం...

ఒకరితో కాలాన్ని పంచుకోలేక...
ఒకరితో పంచుకుని...
బరువెక్కిన హృదయంతో నేను...

ఎంతమంది నేస్తాలున్నా...
ఒంటరైన ఈ క్షణాన,నా మనసు...
కొత్త నేస్తాన్ని కోరుకుంటుంది...

నాతో కబుర్లు చెప్పాలని...
నన్ను అలరించాలని...
బరువైన ఈ క్షణాన్ని తేలిక చేయాలని...