ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...

వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...

Saturday, April 2, 2016

టొమాటీయో స్పైసీ గ్రీన్ సాస్



ఇందాకే  లైబ్రరి దాటిపోయింది


అక్కడ రీడర్ స్టాట్యూ, చెట్టు దగ్గర గడిపిన క్షణాలు
మనం నడకతో కొలిచిన సన్నివేల్ రోడ్లు, ఎల్ కెమినొ రియల్
ఇప్పుడు కార్ స్టీరింగ్ వెనుక గతించిపోతున్నాయి


ఆ వేగంలోనూ ఇన్-న్-అవుట్ బర్గర్ కనిపిస్తే ఆగిపోతాను
గ్రిల్డ్ చీజ్ బర్గర్ తింటుంటే... ఎదురుగా నువ్వు..
యెల్లో చిలి పెప్పెర్ కొరుకుతున్నట్టు అనిపిస్తుంది

నీకో విషయం చెప్పాలి


ఈ మధ్య ఫార్మర్స్ మార్కెట్ కి కూరగాయల కోసం వెళ్ళడం మానేసాను
జేబులో డాలర్ బిల్లు లేకపోతే అసలు వెళ్ళడమే మానేసాను
అక్కడ టొమాటీయో స్పైసీ గ్రీన్ సాస్తో హెలపేనో చీజ్ తమాలే తిని
మ్యుజిషన్ కి నీ డాలర్ బిల్లు ఇచ్చి రావడమే నా శనివారం పని


అప్పుడప్పుడూ గమ్యం లేకుండా తిరుగుతుంటానా
దారిలో ఏదైనా పార్క్ కనపడితే ఉదాటున కార్ కర్బ్ సైడ్ పార్క్ అవుతుంది
దట్టమైన చెట్ల నీడల్లోనూ, ఆదమరిచిన నిద్రలోనే నీ మరపు తెలుస్తుంది
ఈ మధ్య, నీ గాఢతని మరింకేవీ నింపలేకపోతున్నాయి



ఇప్పుడు నాకు తెలుసు
ఇక నుండి  ఆ నీడలు, నా నిద్ర నీకు శత్రువులని



Tuesday, February 23, 2016

రావే దేవీ!





గుర్తుందా నీకు?

ముడి  పడక  ముందు 
ఓ సారి చకోరంలా నా దగ్గర వాలావు 
ఆ సాయంత్రం ఆ పార్క్లో చెట్లు ఆకాశానికి మెట్లన్నట్టే  చేసావే!

కొత్తలో పెదమామ ఇంట్లో ఓ సాయంత్రం.. 
టీ  కప్పులు ఇచ్చి వెళ్తూ గడప దగ్గర నువ్వు  ఓరగా విసిరిన నీ వాలుకంటి చూపులు 
ఎంత పని  చేసాయీ!

ఓ సారి పొద్దు వాలాక 
నీ పుట్టింట్లో చిన్న డాబా మీద నీ ఒడిలో
నిన్నూ  చుక్కలని ఎంత నిశ్శబ్ధంగా  చూసానూ! 

ఆ మధ్య బయటకెళ్ళినపుడు 
నా కుడి  భుజం మీద నుండి బొట్టు తీసి ఖాళీగా ఉన్న నీ నుదిటి మీద అద్దినప్పుడు
నీ మొహమెంత  పెద్దదయిందీ!

గుర్తే కదా నీకు?
.
.

  రాత్రి గుప్పుమన్న మన తలపులు 
నీ వలపుని కాచాయే!  
అవునూ  దేవీ? పున్నమీ  వచ్చి  వెళ్ళిపోయింది, నువ్వింకా రాలేదే!