ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...

వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...

Sunday, December 16, 2007

విరహం


ఇప్పుడే కురిసిన వాన జల్లు పరిసరాలని పులకరింప చేసింది
చెలి కలయికని తెలిపే ఊహలు నా మనసుకి కలిగించే పులకరింత లాగా...

వాన జల్లుకు తడిసన మట్టి వాసన గమ్మత్తుగ ఉంది
చెలి చేరువలో వెళ్తున్నప్పుడు గాలి వాసన కలిగించే మత్తులాగా...

చల్ల గాలులు, కారు మబ్బులు
లేని వెచ్చదనాన్ని, రాని వెన్నెలని గుర్తు చేస్తున్నాయి...

చెలి దూరంగా వుంది
తన కలవరింత ప్రకృతి ఆస్వాదనని దూరం చేస్తుంది...

చెలీ రావే,వరాలీవే,
వెతికా నిన్ను వీచే గాలుల్లో
కన్నా నిన్ను కారు మబ్బుల్లో...
వెచ్చదనం ఏదని? వెన్నెల రాదే అని?
చెలీ రావే,వరాలీవే...

Saturday, December 1, 2007

నాలోనే ఉన్నావు...


నీ తలపుల తారలెన్నో
నా హృదయాకాశం లో...

నా ఆశల కిరణాలెన్నో
నీకై చూసే చూపుల దారులలొ...

రగిలే జ్వాలలెన్నో
నీ ఊహల విరహంలో...

నిన్ను నాకు దగ్గర చేసిన దూరాన్ని అడుగు...
నీ కలలతో పగలు రేయి ఒకటైపోయిన కాలాన్ని అడుగు...

భాధ కూడా తియ్యగా ఉంటుందని తెలిపే
ఈ దూరాన్ని, కాలాన్ని ఈక్షణాన స్తంభించిపోని...

నీ కలలతో, తలపులతో, విరహంతో
ఈ క్షణం నిలిచిపోని...

కానీ ఎంత వరకు?
చెలీ ఎంత వరకు...? నీ రాకకై...

Friday, November 23, 2007

గౌతమీ తీరాన...


గౌతమీ తీరాన, ఏకాంత సమయాన..
విరహ వేదనతో నేను,
వీచే గాలుల్లా, సాగే ప్రవాహంలా..
తేలే ఊహల్లో నేను,

గూటికి చేరే పక్షులు,విహరించే చేపలు,
నా ఒంటరితనాన్ని ప్రశ్నిస్తూ ఉంటే...
చెలి రాదే అని, చెంత చేరదే అని..?
వెన్నెల్లో వెచ్చదనాన్ని వెతుక్కుంటున్నాను...
చంద్రుల్లో చెలి ముఖారవిందాన్ని చూసుకుంటున్నాను...
చుక్కల్లో తన చూపుల్ని అన్వేషిస్తున్నాను...

కిన్నెరసాని పాపి కొండల్ని పోటెక్కించినట్టు,
తలచే తలపుల, కలచే కలవరింతల స్రవంతి
నా గుండెల్ని...!

Sunday, November 18, 2007

నేను నా ఊరు వెళ్తున్నాను...


గోరు ముద్దలు తిన్న
చిన్న 'అంచు పళ్ళెం',
అమ్మమ్మ పక్కలో ఆరు బయట
పడుకున్న నులక మంచం,
ఇప్పటికి మూడు తరాలని
ఊపిన ఉయ్యాల,
పెరటి చివరన ఊరి కాలవ ఒడ్డున
తుమ్మ చెట్లకి వేలాడే పిచ్చుక గుళ్ళు,
ఆ చెట్లపై అటు ఇటుతిరిగే గుఱ్ఱాలు,
ఓనమాలు దిద్దిన శివాలయపుగుడి అరుగులు,
బస్ స్తాండ్ ఎదురి రామాలయం,

నా కోసం ఎదురుచూస్తుంటే..,
దీపావళికి నేను నా ఊరు వెళ్తున్నాను...

Wednesday, November 7, 2007

ప్రకృతి నీతో మమేకమవుతుంటే...
సంధ్యా పవనం -
నీ కురులని సుతారంగా కదిలిస్తున్నప్పుడు...

వేకువ చలి -
నీ చేతులతో నిన్ను నువ్వు చుట్టుకునేట్టు చేస్తున్నప్పుడు...

ఉదయించే సూరీడు -
నీ నుదుటి బొట్టుని చూసి,
తన ప్రతిబింబమని మురిసిపోతున్నప్పుడు...

కూసే పక్షులు -
నువ్వు చలిలో వణుకుతూ చేసే
ప్రార్ధనా గుస-గుసలు విని
ఎవరీ కొత్త పక్షి అని
ఆశ్చర్యంతోఅన్నీ నీ వైపు చూస్తున్నప్పుడు...

తొలి మంచు -
నువ్వు గుడి చుట్టు ప్రదక్షిన చేస్తుండగ,
నీ చెంప వాలున జారే
చెమట బొట్టు మీద కిరణాలు పడి మెరిసిపోతుంటే,
అది చూసి అసూయ పడుతున్నప్ప్పుడు...

నేను ఆ ప్రకృతిని మిస్స్ అవుతున్నాను...
నా చెలీ... నిన్ను మిస్స్ అవుతున్నాను...

Thursday, November 1, 2007

పిపాసిప్రేమ సౌధం కుప్పకూలి...,
గూడు కట్టుకున్న ఆశలు చెల్లా చెదురై,దిక్కు తోచక
హఠాత్తుగా ఆవరించిన శూన్యతకి ఒంటరైనమనసుతో... ఒక నేస్తం...

పచ్చ నోట్లు పలచనై,
బతుకు బండి భారమై,
అలసిన వదనంతో... ఒక నేస్తం...

సంసార సాగరం ఈదుతూ,
గజిబిజి నడకలతొ బిజీ-బిజీగా సతమతమవుతూ... ఒక నేస్తం...

కాల ప్రవాహంలొ కొట్టుకుపోతూ...
నిన్నటి జాడ మరచి, తోడు విడిచి...
కొత్త స్నేహాలతో వర్తమానంలొనే గడిపే... ఒక నేస్తం...

ఒకరితో కాలాన్ని పంచుకోలేక...
ఒకరితో పంచుకుని...
బరువెక్కిన హృదయంతో నేను...

ఎంతమంది నేస్తాలున్నా...
ఒంటరైన ఈ క్షణాన,నా మనసు...
కొత్త నేస్తాన్ని కోరుకుంటుంది...

నాతో కబుర్లు చెప్పాలని...
నన్ను అలరించాలని...
బరువైన ఈ క్షణాన్ని తేలిక చేయాలని...


Saturday, October 27, 2007

మైమరపుఇప్పటి వరకూ వాన...
ఇప్పుడే మేడ మీదకి వచ్చాను...
గంట క్రితం ఒళ్ళంతా మేఘాల ముసుగేసుకున్నట్టున్న ఆకాశం,
ఇప్పుడు కోటి కళ్ళతో ఒంటి నిండా వెన్నెల పూసుకుని నగ్నంగా నా కోసం ఎదురుచూస్తున్నట్టుంది...
ఇది చూసి తేరుకుని మళ్ళీ ఆకాశం వైపు చూస్తే..,
చంద్రుడు నాకేమీ తెలియదు,నేనేమీ చూడలేదు అన్నట్టు కొబ్బరాకుల చాటున దాక్కుంటున్నాడు...
నా నుండి ఎంత దాగినా అద్దంలాంటి తడిచిన నేలకి దొరికిపోయాడు...
వీచే చల్ల గాలి తాకీ తాకనట్టు నా చూపుని మరల్చడానికా అన్నట్టు కొంటెగా నన్ను అల్లరి చేస్తుంది...
గూటికి చేరే పక్షులు నా చూపుల దారికి అడ్డంగా వెళ్తూ ఇక చూసింది చాలు అన్నట్టు నన్ను ఆట పట్టిస్తున్నాయి...
ఇంతకీ నేను ఏంచూసాను..?
దేనికీ ఈ మైమరపు?!!!

మూడేళ్ళుగా ఆహ్లాదకరమైన ఇలాంటి ప్రకృతికి దూరంగా ఉన్నాను...
కానీ ఈ మైమరపు నన్ను వెంటాడుతూనే ఉంది...

Monday, October 8, 2007

ఏకాంతం
ఢిల్లి వాతావరణం అక్టోబర్-నవంబర్లో ఆహ్లాదకరంగా ఉంటుంది…

ఇప్పుడిప్పుడే చలి కాలం మొదలైనట్టుంది…
నేను ఇంటి ముందు పార్క్లో నడుస్తున్నాను…

ఈ వాతావరణం చూస్తుంటె… నాకు...
ఏజెన్సిలొ నేను టేకూరులో ఉన్నప్పటి సాయంత్రం గుర్తుకొస్తోంది...
అప్పుడు చిన్న పడవ మీద టేకూరు ఒడ్డునుండి గోదావరి మధ్యలో ఉన్న ఇసుకతెన్నుల మీదకెళ్ళాను…

వెన్నెల వచ్చే వరకు…
చుట్టు ఉన్న కొండల ఎత్తుల్ని పోల్చుకుంటూ,
వాటి అంచుల్లొ, మబ్బుల్లొ రూపులు వెతుక్కుంటూ,
గూటికెల్లే పక్షుల వరసలని గమనిస్తూ,
ఎగిరే చేపల్ని లెక్కపెడుతూ,
చాలా దూరంలొ ఉన్న పాపి కొండల్ని చూస్తూ,
ఏకాంతంగా ఉండి పోయాను…

అప్పుడు ఒకటి అనిపించింది…
నా చెలి నా పక్కనుంటె ఎంత బాగుండు అని...
ఇప్పుడు ఇలా ఒంటరిగా నడుస్తున్నప్పుడూ...

Saturday, October 6, 2007

చిరు గాలి

చిరు గాలి,
పిల్ల కాలువ,
వడ గళ్ళు,
ఇవన్నీ చిన్నవే...కానీ మనకి అవి కలిగించే అనుభూతి, మనలో పుట్టించే భావాలు...
జోరు గాలి,
మహా నది,
మంచు కొండలు... కలిగించలేవు... పుట్టించలేవు...

చిన్న పదాలైన,రెండే వాఖ్యాల్లొ మంచి అనుభూతిని కలిగించారు...
ఇంకా సున్నితత్వపు జాడలు ఎరిగిన వాళ్ళు రాధిక గారి మాటల్లొని భావాలు వెతుక్కోగలరు...నేను వెతుక్కున్నాను :-)


స్పందన

ఇది రాధిక గారి బ్లాగ్ మొదటిసారి చూసినప్పుడు రాసింది... ఈ స్పందన ఆవిడకి అంకితం...

మీ రాతల్లొ నా ఊహలు చూసుకుంటున్నాను...
మీ మాటల్లొ నా బాసలు వింటున్నాను...

మీలో నాలాంటి నా చెలిమిని అన్వేషిస్తున్నట్టుంది...
వెన్నెల రాత్రిలో, ప్రకృతి ఒడిలో పొందే సాంత్వన పొందుతున్నట్టుంది...

చిన్నప్పుడు నాన్నమ్మ తినిపించిన ముద్ద రుచి గుర్తొచినప్పుడు...
చిన్ననాటి స్నేహాన్ని గుర్తుపట్టి ఆలింగనం చేసుకుంటున్నప్పుడు...
... కలిగే అనుభూతి కలుగుతుంది...

నా భావుకతకి పదును పెట్టాలనిపిస్తుంది...
నాకు ఒక బ్లాగ్ రాయాలనిపిస్తుంది... :-)

ముందు మాట

ముందుగా, స్నేహమా.బ్లాగ్స్పాట్.కాం గురించి ప్రస్తావించాలి... అది రాధిక గారిది... ఎప్పట్నుంచో నేను ఒక బ్లాగ్ రాయాలి అనుకుంటున్నా, నేను ఒకటి రాయగలను అన్న నమ్మకం ఉన్నా... రాధిక గారి బ్లాగ్ చూసిన తర్వాత మాత్రమే నా కోరిక బలపడింది... ఆవిడ వ్రాతల్లో సున్నితమైన భావాలు నేను కూడా ఒకటి రాసే విధంగా ప్రేరేపించాయి...

జాన్ హైడ్ గారు నేను రాధిక గారు రాసిన ఒక కవితకి కామెంట్ రాస్తే, దాన్ని లేఖిని ఉపయోగించి తెలుగులో రాసి నాతో ఏకీభవిస్తున్నాను అన్నారు... అది తెలుగులో చూసి మురిసిపోయాను.. అంత అనుభవం ఉన్న ఆయన అలా అనడం నాకు ప్రశంస లాగ అనిపించింది...

ఆ ప్రేరణతో, నా మీద నాకు ఉన్న నమ్మకంతో ఈ బ్లాగ్ మొదలుపెడుతున్నాను...

ఈ లేఖిని సాఫ్ట్వేర్ రూపొందించి, ఇంటెర్నెట్లో తెలుగు వ్యాప్తికి కృషి చేస్తున్నవారికి నా అభినందనలు, కృతజ్ఞతలు...

-దీపు