ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...

వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...

Sunday, December 16, 2007

విరహం


ఇప్పుడే కురిసిన వాన జల్లు పరిసరాలని పులకరింప చేసింది
చెలి కలయికని తెలిపే ఊహలు నా మనసుకి కలిగించే పులకరింత లాగా...

వాన జల్లుకు తడిసన మట్టి వాసన గమ్మత్తుగ ఉంది
చెలి చేరువలో వెళ్తున్నప్పుడు గాలి వాసన కలిగించే మత్తులాగా...

చల్ల గాలులు, కారు మబ్బులు
లేని వెచ్చదనాన్ని, రాని వెన్నెలని గుర్తు చేస్తున్నాయి...

చెలి దూరంగా వుంది
తన కలవరింత ప్రకృతి ఆస్వాదనని దూరం చేస్తుంది...

చెలీ రావే,వరాలీవే,
వెతికా నిన్ను వీచే గాలుల్లో
కన్నా నిన్ను కారు మబ్బుల్లో...
వెచ్చదనం ఏదని? వెన్నెల రాదే అని?
చెలీ రావే,వరాలీవే...

Saturday, December 1, 2007

నాలోనే ఉన్నావు...


నీ తలపుల తారలెన్నో
నా హృదయాకాశం లో...

నా ఆశల కిరణాలెన్నో
నీకై చూసే చూపుల దారులలొ...

రగిలే జ్వాలలెన్నో
నీ ఊహల విరహంలో...

నిన్ను నాకు దగ్గర చేసిన దూరాన్ని అడుగు...
నీ కలలతో పగలు రేయి ఒకటైపోయిన కాలాన్ని అడుగు...

భాధ కూడా తియ్యగా ఉంటుందని తెలిపే
ఈ దూరాన్ని, కాలాన్ని ఈక్షణాన స్తంభించిపోని...

నీ కలలతో, తలపులతో, విరహంతో
ఈ క్షణం నిలిచిపోని...

కానీ ఎంత వరకు?
చెలీ ఎంత వరకు...? నీ రాకకై...