ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...

వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...

Thursday, November 18, 2010

ఆదర్శం- స్వార్ధం

నాకు తెలిసిన ప్రపంచం ఎప్పుడూ ఆదర్శాల కోసం జీవించడం లేదు... ఆదర్శాలు కూడా స్వార్ధంలో నుండి పుట్టుకొచ్చిన కోరికలే. మనకిష్టమైన వాటిని( అవి ఏవైనా) కుటుంబమో, సమాజమో, ప్రభుత్వమో ఏవో చెప్పి దూరం చేసే ప్రయత్నం చేసినప్పుడు ఒక ఆదర్శం పుట్టుకొస్తుంది... (లేకపోతే అప్పటివరకు పట్టించుకోని ఆదర్శాలని ఆశ్రయిస్తారు) అది ఒక్కోసారి వెంటనే అందరి అంగీకారం పొంది మార్పుకి దోహదం చేస్తుంది. ఒక్కోసారి వెంటనే అంగీకారం పొందదు. మార్పు మెల్లగా వస్తుంది.ఒక్కోసారి అలా కొందరి స్వార్ధంలో నుండి పుట్టిన కోరికలు అందరి అంగీకారం పొందవు, అవి అందరికీ ఆదర్శాల్లా కనిపించవు... ఒక్కోసారి కొన్ని ఏళ్ళ తరవాత అలా వచ్చిన మార్పు మంచికోసమొచ్చిందా, చేడూ కోసం వచ్చిందా అనే మీమాంశ కూడా జరుగుతుంది. చాలాసార్లు, ఆ ఆదర్శాలు వాళ్ళ కోరికలు తీరేవరకే, తీరిన తరవాత వాటితోనే జీవిస్తున్నారా లేదా అనేది అప్రస్తుతం అయిపోతుంది...



ఈలోగా ఆ ఆదర్శాలని అనుభవించిన తరానికి కొత్త కోరికలు పుట్టుకొస్తాయి... మరలా కొత్త ఆదర్శాలు, కొత్త ఆశయాలు...


అందుకే ఆదర్శానికి మూలాలు ఆ ఆదర్శాన్ని ప్రకటించే వారి స్వార్ధం లోనే ఉంటాయి. దాన్ని నిస్స్వార్ధంగా, దాని వల్ల తనకి ఉపయోగం లేకపోయినా, కేవలం ఆదర్శం కోసమే బతికే వాళ్ళు లక్షల్లో ఒకళ్ళు ఉంటారు...


ఎప్పుడైతే నేను అది తెలుసుకున్నానో, ఆదర్శాలని వెక్కిరించే వాళ్ళని అసహ్యించుకోవడం మానేసాను... ఎవరి స్వార్ధం వారిది అని మనసులో అనుకుని :-) ఎప్పుడో ఒకసారి వాళ్ళ స్వార్ధం కోసం ఆదర్శాన్ని ఆశ్రయిస్తారు, లేకపోతే స్వార్ధం కోసం ఆదర్శాన్ని వదిలేస్తారు...

ఆదర్శాలు నమ్మేవాళ్ళూ, నమ్మని వాళ్ళు ఒకరికొకరు హాని తలపెట్టుకోనంతవరకు నాకూ ఓకె.నేను పట్టించుకోను... నా స్వార్ధం నాది, నా ఆదర్శం నాది. వాళ్ళ స్వార్ధం వాళ్ళది, వాళ్ళ ఆదర్శాలు వాళ్ళవి...

Friday, November 12, 2010

ఒక చిన్న మాట

ఎదురు చూసిన పున్నమి రానే వచ్చింది
ఎన్నాళ్ళయ్యింది ఆకాశం కేసి చూసి?

పిల్ల గాలీ ఒక్కసారిగా పలకరిస్తున్నట్టుంది
ఏమైపోయింది ఇప్పటి వరకూ?

తారలన్నీ నన్నే చూస్తున్నట్టున్నాయి
వాటి తళుకులు నా కన్నుల్లో!

ఏది నా జాబిల్లి?
అదిగో!
ఒక చిన్న మాట ఇవ్వవా?
తనని నా దరికి చేరుస్తానని

Thursday, November 11, 2010

కవిత-వర్ణన-భావుకత-వచనం

ఏమైనా, హృద్యమైన భావోద్రేకాలని సూటిగా చెప్పాలి అంటే నేను రాయడాన్ని ఆశ్రయించను. కవితా మార్గాన్ని అసలు ఎంచుకోను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని నా చేత చెప్పించుకోవాలి అంటే, ముందు తను నాకేంటో అనేది నేను చెప్తుంటే వినాల్సిందే.. :) అలా చెప్పడం మొదలుపెట్టిన తరవాత, తను ఎంత ఎదురు చూసినా అసలు తనని ప్రేమిస్తునానని కూడా చెప్పకపోవచ్చు. కానీ, నా మాటలని తను వెతుక్కుంటే అంత కన్నా బరువైన, విలువైన భావాలని తను ఏరుకోవచ్చు. అసలు ఆ మాటలకోసమే ఎదురు చూసి, ఈ సుత్తంతా ఎందుకు అంటే, తనకి నా భావోద్రేకాలు అర్ధం కానట్టే! అప్పుడు అసలు తను నన్ను అర్ధం చేసుకున్నట్టేనా? ప్రేమించినట్టేనా? కానీ నేను తనని ప్రేమిస్తున్నాను అని నా ప్రతి వర్ణనలోనూ చెప్తున్నానే... నా వర్ణనలకి, నాలో భావావేశానికి ఆమే మీద ప్రేమే ప్రేరణే... కానీ కేవలం నా భావాన్నే వ్యక్తపరచాలి అంటే, నాలో భావావేశాన్ని నేను ఎవరితో పంచుకోను...

తనని చూడగానే పరుగున చెంత చేరి హత్తుకుని నువ్వంటే నాకిష్టం అంటే, అది చెప్పడానికి ఇలా పరుగుపెట్టి హత్తుకోవాలా? అక్కడ ఉండే చెప్పొచ్చు కదా అంటే..?! నా భావావేశం ఏం కానూ? దాన్ని ఎవరితో పంచుకోనూ?

అలంకారాలూ, అతిశయాలు లేని కవితను నేను అన్ని కాలాల్లో ఆస్వాదించలేను. నా వర్ణనని, భావావేశాన్ని పంచుకోలేని తను నా ప్రేమనీ ఆస్వాదించలేదు,నేను కూడా...

ఇంతకీ ఏది కవిత? ఏది వర్ణన? ఏది భావుకత? ఏది వచనం?

Wednesday, November 10, 2010

ఆలోచనలు

ఒకో క్షణం,
నన్ను ప్రశ్నిస్తాయి
నా అసహాయతని నిలదీస్తాయి
ఈ విశాల ప్రపంచంలో,
నా అస్థిత్వాన్ని శోధించమంటాయి
నేనేంటో తెలియని నన్ను నిర్దాక్షిణ్యంగా ఒంటరిని చేస్తాయి

చంచలత్వంతో మోసం చేస్తాయి
నా నమ్మకాన్ని వెక్కిరిస్తాయి
వాటిని పంచుకున్న పదిమందిలో
నన్ను అల్పుడుని చేస్తాయి

అనుక్షణం వెంటాడుతూ
నాతో పోరాడతాయి
నే పోరాడలేనని ఎదిరిస్తే
నాకు దూరమై శిక్షిస్తాయి...

Tuesday, November 2, 2010

ఆరాటాల పోరాటాలు

ఎడారి దాటి అలసిన నాకు సముద్రమే ఎదురైంది



అలలా కవ్విస్తూ నను తాకావు నీవు



నేను ఆరాటపడ్డాను
నీ మనసు తెలుసుకోవాలని
నీతో మనసు విప్పి మాట్లాడాలనుకున్నాను
నీ మనసులో చోటు సంపాదించాలని
నా ఆరాటాన్ని ఆరాధించావు
నువ్వూ నా కోసం ఆరాటపడ్డావు


నీ మనసు విప్పే ప్రయత్నం చేస్తావు
ఆశగా అమాంతం లోనికి చొరబడాలని చూస్తాను
లోన ఇంకెవరో ఉంటారు
వాకిట నుండే వెనుదిరుగుతాను
నే వెళ్ళిపోతుంటే నను ప్రేమగా చూస్తావు
నాకు తెలుసు నువ్వు నన్ను అలా చూస్తావని
అందుకే వీడ్కోలు చెప్పకుండానే వెళ్ళిపోతాను
కన్నీళ్ళకి సిగ్గూ లేదు, ధైర్యమూ లేదు



ఎప్పుడు ఆరుతుందో ఈ ఆరాటం
ఎందుకు పుడుతుందో తీరం వదిలే ఆ కెరటం?