ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...

వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...

Wednesday, April 21, 2010

అల్లుకున్న పువ్వుఏ తోటమాలి అంటుకట్టాడో ఆ తీగని
హుందాగా కాస్తుంది నిండుగా విచ్చుకుంటున్న ఆ పూవుని
గాలికి నాట్యమాడిస్తుంది కానీ పడనీయదు
నేలని ముద్దాడిస్తుంది కానీ మట్టి అంటనీయదు
తీగకి పువ్వు ఎప్పుడూ ముద్దే కదా
తన ఒడిని వదులుతుందని తెలిసీ సాకుతుంది!
వదిలి ఎటు చేరుతుందో?

తీగ ఏం చేస్తున్నా
పువ్వుకి ప్రోది చేస్తూనే ఉంటుంది
పువ్వు విధిగా పరిమళాలని వెదజల్లుతుంది

ఇంతకీ ఇక్కడికి ఎప్పుడు చేరాను
ఆ హిమ బిందువే కదా! పువ్వుపై చేరి తెలి కిరణాల మెరుపుతో
నన్నిక్కడికి రప్పించింది.

ఇదిగో! పరిమళాల పరవశపు మైమరపులో నేను

చేరువ కాగలనే కానీ చేరువ చేసుకోలేనే
తీగ నుండి వేరు చెయ్యలేనే

ఆ తీగనే అడగనా?
ఆ పందిరిని అడగనా?
పోనీ, ఆ తోటమాలినే అడగనా?
ఈ పువ్వుకో గమ్యం ఉంటే
అది నా హృదయపు లోగిలి కావాలని

Saturday, April 17, 2010

నెలవంక


నేల వంక చూపులు
నిట్టూర్పుకి ఆనవాలు

జీవన సాగరంలో
ఆశా నిరాశల
ధ్యాస అడియాసల ఆటు పోట్లు
ఏకాంత నౌకని ఓలలాడిస్తుంటాయి
వెన్నెల తీరాలని ఎండమావులు చేస్తూ

పున్నమి సమీపిస్తున్న కొద్దీ
ఆ ఆటు పోట్ల చెలగాటం ఉధృతమవుతుంది
ఏకాంతరంగాల్లో అలజడి తీవ్రమవుతుంది
అయినా ఆశల దిక్సూచి పని చేస్తూనే ఉంటుంది
వెన్నెల తీరాన్ని అన్వేషిస్తూ నౌక సాగుతూనే ఉంటుంది

అవును
నేల వంక చూపులు
నిట్టూర్పుకి ఆనవాలు

ఆశని శ్వాసించుకుని
చూపులు నింగిలోకి
అదిగో నవ్వుతూ నెలవంక

Tuesday, April 13, 2010

తోడు

పార్క్లో
చిలకల జంట
కలిసి తింటున్నాయి

~~~

అతడు ఆమె
అతడామె
ఆమ్యతడు

~~~

అన్నీ
జంట మందారాలే
ఆ మందార మొక్కకు

~~~

కార్లో
ముందు అతను ఆమె
వెనుక నేను

~~~

వర్షం మొదలైంది
చేతిలో టీ కప్పు, బాల్కనీలో బట్టలు
ఏం చెయ్యను?

~~~

ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద
మల్లెపూలు అమ్ముతున్నారు
తీసుకోనా?

~~~

Friday, April 9, 2010

'బజ్' ప్రేరేపితాలు :-)

మబ్బు పట్టిన ఆకాశపు అసలు రంగేంటో?
నాకు తెలిసేదెలా?

~~~~~~~~~~

వయసు మలుపుల్లో
మనసు చెట్టుకు వలపు దెబ్బలు
ఎదురుచూపులకు కళ్ళు కాయలు

~~~~~~~~~~

యాతమేసి తోడినా ఏరు ఎండదు
ఎన్ని బంధాలల్లుకున్నా మనసు పందిరి కూలదు

~~~~~~~~~~


నీకు తెలుసా
చేరువవ్వాలనే చొరవలో ఏకాంతం మన మధ్య తెరలని తెరచిందని
తెలుసుకోవాలనే తపనలో మన మౌనం కూడా ఊసులు పలికిందని

అసలు నీకెమైనా తెలుసా
ఇప్పుడీ ఏకాంతంలో మన మధ్య ఈ తెరలు ఎందుకో? అటూ ఇటూ ఒంటరిగా
మన మౌనం ఎందుకు మూగబోయిందో? అసలు ఊసులే కరువవుతూ

~~~~~~~~~~