ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...

వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...

Friday, January 18, 2008

ముత్యాల ముగ్గు


తీరైన తన నడకతొ లయబద్ధంగా సవ్వడి చేస్తున్న పట్టీలు
నా చూపుని తన వైపు మరల్చాయి...
సింధూరం, పసుపు పచ్చల పట్టు పరికిణీని మునివేళ్ళతో
కొంచెం పైకి లాగి తను కలియతిరుగుతుంది వాకిట దేని కోసమో వెతుకుతూ...
ఏదో కనుగున్నట్టు ఇంట్లోకి పరుగెట్టింది...

నేను తనకోసం ఎదురుచూడకుండా ఉండలేకపోయాను...

ముగ్గు గిన్నెతో తను బయటకొచ్చింది
పైటను నడుముకు చుట్టుకుని, పరికిణీ సర్దుకుని
ఒంటి కాలిపై భారం మోపి, కూర్చుంది ముగ్గుపెట్టటానికి...
నేను అలానే చూస్తున్నాను...
తన వేళ్ళు ఏదో మాయం చేస్తున్నట్టు
చక చకా చుక్కలు పెట్టుకుంటూ వెళ్తున్నాయి
ఆ వేగంతో చుక్కలని అనుసరించడానికి ప్రయత్నించిన నా కళ్ళు తిరిగాయి...

ఒకసారి పైకి చూసాను
నింగిలో చుక్కలు నేలపై ఆమె వేలు జారిన చుక్క చుక్కలో
పోలికలు వెతుక్కుంటు మురిసిపోతున్నాయి ఎంచక్కా...
అదే పనిగా... చంద్రుడు లేడని గుసగుసలాడుతున్నాయి
అది విని నెలరాజు మోము చిన్నబోయింది,
రోజు తనతో ఊసులాడే చిన్నది తనని ఈరోజు మరచిపోయిందని...

నేను తేరుకుని తనవైపు చూసాను
ముంగురులను పైకి పోగు చేసుకుంటూ తను పైకి లేచింది
ఒక్కసారి తనివితీర కిందకిచూసింది
తన చూపుల్ని నా చూపులు అనుసరించాయి
ఆహా... ఎంతటి అందమైన ముగ్గు...!
చంద్రుడు చిన్నబోవటంలో అర్ధం వుందనిపించింది...

ముగ్గుని చూసుకున్న ఆనందంతో తన కళ్ళు మెరిసాయి
పెదవులపై నవ్వులు విరిసాయి
ఆ నవ్వులో తడిసిన ముగ్గు ముత్యాల ముగ్గయ్యింది
ఆ ముంగిట వెలుగులు నింపింది...

Thursday, January 3, 2008

కల-కాలం

వర్ష నా ముందు నగ్నంగ ప్రత్యక్షమైంది
తను నా కళ్ళలోకి సూటిగా చూస్తుంది
ఆ చూపులో...
అచంచలమైన ప్రేమ, తరగని సానుభూతి,
అంతులేని ఔదార్యం, చెరగని నమ్మకం కనుగొన్నాను...
నేను తప్పించుకోలేకపోయాను ఆ చూపు నుండి, నిస్సహాయుడిలా

నిశ్శబ్ధాన్ని చేధిస్తూ,తనకు చీర కట్టమంది
నేను నిచ్చేష్టుడిలా ఉండిపోయాను తన మాటలు వింటు...
తనకి 12 కుచ్చిళ్ళు కావాలని, 12 రంగుల్లొ ఉండాలని అంటు
నా చేతిలో ఒక తెల్ల చీర పెట్టింది...

నేను కుచ్చిళ్ళు పేర్చుతూ, ఒక్కొ పేటకి రంగు అద్దడానికి ప్రయత్నిస్తున్నాను...
రంగులద్దుతుంటే, ఒక్కో రంగుకు నా చేత
ఆత్మ విశ్వాసంతో,
క్రమ శిక్షణతో,
దీక్షతో,
సత్సంకల్పంతో,
సాటివారిపై నమ్మకంతో,
నిజాయితితో,
ప్రణాళికతో,
ఆరోగ్యంపై శ్రద్ధతో,
ఉత్సాహంతో,
సానుకూల దృక్పధంతో,
నిత్యం జాగురూకతతో,
చిరు నవ్వుతో
తనని ఎదుర్కుంటానని ప్రమాణం చేయించుకుంది, నా నుదుటి మీద చెయ్యి వేసి...
నేను కుచ్చిళ్ళను ఒద్ది పెట్టి, లేచి తనకు పైట కప్పడానికి ఎదురునిలిచాను...
ఆ చూపుని తప్పించుకోలేకపోయాను...
ఆ కళ్ళలో అదే ప్రేమ,సానుభూతి,ఔదార్యం,నమ్మకం

తను నా చెయ్యి పట్టుకుని
పన్నెండు రంగుల కుచ్చిళ్ళను తన్నుతూ ముందుకు సాగింది...
నా పాదాలకి తన నడక విదిల్చిన రంగులు అద్దుతుంటే,
తన అడుగులని అనుసరించాను...

తను ఉదయిస్తున్న సూర్యుడికి ఎదురువెళ్తు అదృశ్యమైంది!
నేను నా పాదాలకి, చేతులకి పన్నెండు రంగులతో
తనకి చేసిన ప్రమాణాలతో ఏకాకిలా..

నిద్రలొ అటు ఇటు కదులుతున్న నన్ను
నా స్నేహితుడు హెచ్చరించాడు,కదలకుండ నిద్రపొమ్మని...
కళ్ళు తెరిచి చూసాను....
నా చేతులకి, పాదాలకి రంగులు లేవు,
ప్రమాణాలు మాత్రం లీలగా గుర్తు వస్తున్నాయి...
ఆ స్పృహతో నేను కొత్త వర్షానికి ఎదురు నిలిచాను చిరు నవ్వుతో...స్నేహితులకి నూతన సంవత్సర శుభాకాంక్షలతో...