ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...

వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...

Friday, May 16, 2008

అలజడి


దూరంగా బస్సు ఘోరంగా అరుస్తూ పోతుంది
ఈ పార్క్లోనే కూర్చుంటానే... నాకెప్పుడూ అలా వినిపించలేదే
అది వింటుంటే గుండెల్లో రంపంపెట్టి కోస్తున్నట్టుంది
అల్లరి చేస్తూ ఆడుకునే ఆ పిల్లల్ని భరించలేకపోతున్నాను
ఊగుతున్న ఆ ఉయ్యాలని చూస్తుంటే నా కళ్ళుతిరుగుతున్నాయి
ఎప్పుడూ ఇలా అనిపించలేదే
విశాలమైన ఆ ఆకాశాన్ని, ఎదుగుతున్న ఆ చంద్రుడుని
నేను చూడలేకపోతున్నాను...అవి నన్ను చిన్నచూపు చూస్తున్నట్టుంది
నేను చూడను.నేను ఇలానే కూర్చుంటాను
తల దించుకుని.చేతుల్లో నా మొహం

8 comments:

రాధిక said...

విషాదాన్ని బాగా వ్యక్తపరిచారు.
కూడలిలో సగం కవిత చదివేసి ఏ చిత్రం పెట్టి ఉంటారా అని అనుకుంటూ వచ్చాను :) :(

నిషిగంధ said...

విషాదం, నిరాశ జీవితంలో తప్పనిసరి అని తెలిసినా ఒక్కోసారి మనసు అవి భరించడం నా వల్ల కాదని ముడుచుకు పోతుంది.. ఆ వేదనని బాగా చూపించారు!
రాధిక అన్నది నిజమే! బొమ్మేదీ!? :-)

దీపు said...

@ రాధిక గారు, నిషిగంధ గారు

థాంక్స్ అండి.. ఏంపేరు పెట్టాలో తెలియలేదు... అలానే బొమ్మ కూడా.. ఇప్పుడు పెట్టాను చూడండి..

పద్మ said...

హ్మ్మ్మ్. భరించలేని నిరాశ ఎదురైనప్పుడు అప్పటిదాకా ఇష్టంగా అనిపించినవి కూడా మహా కష్టం అనిపిస్తాయి. ఆ నిరాశ బాగా వ్యక్తపరిచారు.

నాకెందుకో మీ భావాలకి ఆ బొమ్మ నప్పలేదనిపిస్తోంది దీపూగారూ. పడి లేచే కడలితరంగం ఆశకి, పట్టుదలకి చిహ్నం. తీరాన్నెప్పటికైనా చేరగలనన్న నమ్మకమే మళ్ళీ మళ్ళీ ఆ అలని గట్టుకి రప్పిస్తుంది. అందులో నిరాశకి చోటుందంటారా?

దీపు said...

@ పద్మ గారు

ఆ భావం నిరాశనొ,విషాదమనో ఏదో ఒకటి అని నేను చెప్పలేను... ప్రశాంతత చెదిరింది.. ప్రశాంతమైన ఎద కడలిలో అలజడి రేగింది... బొమ్మలో దాన్ని మాత్రమే చూస్తున్నాను నేను... ఇంకా ఆ అలజడి పోటెక్కించి అలానే ఉండిపోవచ్చు,తీరం గురించే తెలియకపోవచ్చు...

bolloju ahmad ali baba said...

బ్యూటిఫుల్,
మంచి పదచిత్రాలు. మెలికలు తిప్పె మెలంకలీ ని చక్కగా ఆవిష్కరించారు. ఇలాంటప్పుడే కవికి కవిత్వం అవసరమౌతుంది. తన అనుభవాన్ని సార్వజనీనం చేయటంలోనే కవి ప్రతిభ బయటపడుతుంది. ఈ ప్రక్రియలో అనన్యమైన మీప్రతిభ ద్యోతకమౌతుంది.

మీ భావాలు నేరుగా అస్ఫష్టతకు తావు లేకుండా అందించగలిగారు.

బాగుంది
బొల్లోజు బాబా

దీపు said...

@ బాబా గారు
ధన్యుణ్ణి...

Anonymous said...
This comment has been removed by a blog administrator.