ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...

వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...

Thursday, May 1, 2008

నల్లని చందమామ
చీకటినంతా తనలో దాచేసుకున్నట్టు
వెన్నెలనంతా ఆకాశం నిండా నింపేసినట్టు
తెల్లటి ఆ ఆకాశంలొ నల్లని ఆ చందమామ చల్లగా మెరిసిపోతుంది
ఆ అందాన్ని కనులారా చూద్దామని ప్రయత్నిస్తుంటే,
ప్రకృతి లోని సరిగమలకి,
అటు ఇటు ఊగుతూ చందమామ నాతో దోబూచులాడుతుంది...

నీ మాటకి భావానికి అనుగుణంగా
కదులుతున్న నీ కళ్ళని బంధించాలని నా కళ్ళు నన్ను మరిచిపోతున్నాయి
నీ కనుపాపల నలుపులో నాకు దాగిపోవాలనుంది
ఆ కన్ను గిలుపుల్లో నా ఉనికిని చాటుకోవాలనుంది
రెప్ప పాటైనా నీ కలల్లో నిలవాలనుంది

అందమైన ఆ కళ్ళని ఎంతసేపు చూసినా తనివి తీరడంలేదు
ఆడే ఆ కన్నులని నేననుసరించలేకపోతున్నాను
ఒకసారి నా కళ్ళల్లోకి చూడవా?
అలసిన నేను చల్లని నీ చూపుల నిండు వెన్నెల్లో సేదతీరతాను
ఆ వెన్నెల మొత్తాన్ని నాలోనే నింపుకుంటాను...

11 comments:

రాధిక said...

చిత్రాన్ని చూస్తూ కవిత రాసారా?
చాలా బాగుందండి.నిజమే చూపులో చూపు నిలపడం,నిలిచిపోవడం చాలా కష్టం.బ్రతిమలాడుకోవాల్సిందే.

chandramouli said...

మీ కవిత చాలా బాగుంది అండి.... అస్సలు శీర్షక చూడగానే...అరే ఎలా న్యాయం చేసారా అనుకుంటూ...లోపకి వచ్చాను...
బొమ్మని చూడగానే..అరే ఒక్క బొమ్మతో..భలే చెప్పారే అనుకున్నాను....
తదుపరి... ఊసుపోక ఇలా.....
"నల్ల" నీ చందమామ.... తమిళంలో తీసుకుంటే... అందమయిన నీ చందమామ...మీరు వర్ణిస్తున్న...కళ్ళకు చక్కగా అతుకుతుంది...

దీపు said...

@రాధిక గారు

థాంక్స్ అండి.. లేదండి.. :-) నేను ఇప్పటి వరకు రాసిన వన్నీ రాసిన తరవాత బొమ్మ ఎంపిక చేసుకున్నవే... ఇది కూడ అంతే... నేను కళ్ళని మాత్రమే వర్ణించాను... మెరిసిపొయే నల్లని కనుపాపలో నేను ఎప్పుడూ చూసే చందమామలో వెలుగుల కనిపించింది... చుస్తే కనుపాప మెరిసిపొతూ ఎంత నల్లగా ఉందో, కళ్ళు అంతే తెల్లగా మెరిసిపోతున్నాయి!

నే గీసిన బొమ్మ స్కాన్ చేస్తుంటే కుదరడం లేదు... అందుకని గూగుల్ లో చూస్తే ఇది దొరికింది... కానీ ఇది ముఖమంతా తెల్లగా ఉండే సరికి కన్నులు దాటి వెన్నెల అంతా వ్యాపించినట్టుంది! :-) చదువుతు బొమ్మని చూసి అలానే అనిపించొచ్చు.... చూస్తుంటే బొమ్మ నా కవితని డోమినేట్ చేసేట్టు ఉంది..... తీసేయ్యాలేమో! ;-)

దీపు said...

@చంద్రమౌళి గారు
థాంక్స్ అండి... అయితే నా కవిత న్యాయం చెయ్యలేదంటారా?! :-) రాసేప్పుడు తమిళంలో "నల్ల" అసలు ఆలోచనలో లేదండి...

నిషిగంధ said...

నేనూ కూడా 'నల్లని చందమామా'!?, అట్టెట్టా! అనుకుని వచ్చాను :-)
అందమైన కవితాత్మక భావన!!

'ప్రకృతిలోని సరిగమలకి
అటూ ఇటూ ఊగుతూ నాతో దోబూచులాడుతుంది '.. wonderful expression!!
ఇక ఫోటో విషయంలో మీరూ రాధిక గారితో పోటీ పడుతున్నారుగా! :-)

ravindra said...

Hatsoff dear friend

bolloju ahmad ali baba said...

మీ కవిత అద్భుతం గా ఉందండీ.
నేను ఒక కవితలో కళ్లని రెండు పున్నమిలని వర్ణిస్తే మీరు నల్ల చందమామ అనివర్ణించారు. మంచి భావన. వీలైతే చూడంది నాకవిత తెలుగు మోనాలిసా.

బొల్లోజు బాబా

http://sahitheeyanam.blogspot.com/

దీపు said...

@ నిషిగంధ గారు
థాంక్స్ అండి... నేను పోటీ పడలేను :-) ఆరోజేదో గూగులమ్మ కరుణించినట్టుంది.. బొమ్మ వెతుకుతుంటే అది దొరికేసింది... :-)

@బాబా గారు
థాంక్స్ అండి... మీ కవితలు చూస్తున్నాను..

Purnima said...

మీ కవితలు చదువుతుంటే.. ఒకే ఒక్క అభ్యర్ధన మదిలో మెదులుతుంది:
ప్రేమించే హృదయానికి ప్రణమిల్లవే.. మనసా.. ప్రణమిల్లవే!!

రెప్ప పాటైనా నీ కళ్ళల్లో నిలవాలని ఉంది.. ఈ లైన్ దగ్గరే నా మనుసు మునకలేస్తుంది.

ఏకాంతపు దిలీప్ said...

@ పూర్ణిమ
మీ వ్యాఖ్యతో నేను ఉక్కిరిబిక్కిరైపోయాను...

Paddu said...

తెల్లని ఆకాశంలో నల్లని చందమామ ఏమిటా అనుకున్నాను మొదట్లో ... నీలాల కళ్ళని నల్లని చందమామగ మీరు వర్ణించిన తీరు అద్భుతం దిలీప్ గారు..