ఈ రాత్రి ఢిల్లీలో జనవరి మాసపు రాత్రిలా లేదు
మా గోదావరి శీతాకాలపు సాయంత్రంలా ఉంది
ఎముకలు కొరికే చలి లేదు
చూపులకు అడ్డం పడే పొగ మంచు పొరలు లేవు
నేను ఈ సమయాన్ని వృధా చేసుకోదలచుకోలేదు
అనాయాసంగా పార్క్ లోకి అడుగులేసాను
నిర్మానుష్యంగా, పార్క్ అంతా నాకోసమే ఎదురుచూస్తున్నట్టుంది
తనివితీరా అడుగులేస్తూ, అంతా కలియ తిరుగుతూ నేను
లేలేత చలి నాలో వెచ్చదనాన్ని పెనవేసుకుంటుంది
ఆస్వాదిస్తూ నేను... నడుస్తూ... నాతో నేను...
అనుభూతి నింపిన ఆర్ధ్రతతో మూసుకున్న నా కళ్ళు ఆకాశం వైపు చూసాయి
దేదీప్యమానంగా మెరుస్తున్న విద్యుద్దీపపు వెలుతురు తెరలు
కళ్ళలోని ఆర్ధ్రతా సాంద్రపు పొరలు నా చూపుల దారిని అడ్డగించలేకపోయాయి
దూరంగా చందమామ.... నా పండు చందమామ!
నిర్మలంగా,ప్రశాంతంగా,హాయిగా...!
ఏ చింతాలేని ఈ క్షణపు నా మనసులాగా...
ఎన్నిరోజులైంది! చిరుగాలికి ఆడే కొమ్మల చాటున దోబూచులాడే చంద్రాన్ని కనుగొని!
చాలాసార్లు ప్రకృతి నా స్థితిని అద్దం పడుతూ నాకు చూపిస్తుంది,
ఆ అద్దంలో నన్ను నేను కనుగొంటాను...
18 comments:
చాలా బాగుంది."కళ్ళలోని ఆర్ధ్రతా సాంద్రపు పొరలు నా చూపుల దారిని అడ్డగించలేకపోయాయి"ఈ లైనైతే మరీను.నిజమే చాలాసార్లు ప్రకృతి మన మూడ్ మీద ప్రభావం చూపినట్టే మన మూడ్ కి తగ్గట్టు ప్రకృతి కూడా ముస్తాబవుతుంది.మీరిలాంటి మంచి కవితలు రాస్తాను అంటే ఎప్పుడో అప్పుడు ఆ చందమామని లాక్కొచ్చి మీ ముందు పెట్టేస్తాను.
బాగుంది.
రాధిక గారు,
మీరు దిలీప్ గారికి ఇచ్చే చందమామ లో కొంత భాగం నాకు కూడా ఇవ్వరూ. :)
ఇన్నాళ్ళకు తీరికయ్యిందన్నమాట "నా చందమామను" చూడటానికి. హు. (ఇక్కడ మూతి మూడు వంకర్లు) :-))
మీ కవత బాగుందండీ.
నేను... నడుస్తూ... నాతో నేను... బాగుంది.
బొల్లోజు బాబా
:)
దిలీప్ గారు చలా చక్కని పదాలతో చందమామ లా ఆహ్లాదం గా ఉంది :)
చాలా బావుంది.... :)
No words to say.... As usual really Great... Keep it up seet heart... I think U have so many fans.. Hmm!!! Donga...!!! :)
రాధిక గారు :-) నెనర్లు... ఇంతకీ ఏ చందమామని? :-)
అరుణ గారు, నెనర్లు.. :-) మీరు అరుణ పప్పు గారేనా? మీ కథ చదివాను బాగుందండి.. మొదటి కథే అయితే చలా ప్రశంస్నీయం!
బాబా గారు, :-) నెనర్లు.. అవునండి ఇన్నళ్ళకి తీరికైంది... నాకెప్పుడూ ఆశ్చర్యమే! మీరు అంత ప్రొలిఫిక్ గా ఎలా రాయగలుగుతారా అని!
నేస్తం, నాకు ఆనందంగా ఉంది... నా రాతలు చదివి "ఆహ్లాదం"గా ఉంది అంటే నేను బ్లాగులో పెట్టినదానికి సార్ధకత పొందినట్టే! నెనర్లు.
శ్రీ విద్య :-)
మోహన :-)
దిలీప్ గారు, నాకు నిన్న రాత్రి ఇంచు మించు ఇదే అనుభవం మావూరి చందమామతో. తెలుగు కాలేండర్లేదు కనుక పెరుగుతున్నాడో, తరుగుతున్నాడో చెప్పలేను కానీ, సగమే వున్నాడు, కానీ మంచుతో -30F వుండి వూరిని వణికించేస్తున్న చలి కన్నా చల్లగా, మోడుల్ని సైతం వూపేస్తున్న గాలిని గేలిచేస్తున్నట్లు మెల్లగా వచ్చాడు. ఎంత కాంతో,ఇంతకు మునుపెవరి కళ్ళలోనూ చూడలేదు. తను కురిపించిన కాంతులు, ఉప్పు గుట్టల్లా పోగేసిన మంచు తిన్నెల్ని స్ఫటికపు మెరుపులతో నింపేసాయ్. "సగం చంద్రుడు నిండు కాంతులని" అని ఒక కవితా భావవీచిక మదిలోకి వచ్చింది, ఇంతలోకి మీ కవిత చూడటం తటస్థించింది. ఇంత బాగా మీరు వ్యక్తం చేసాక ఇక నాకేమీ వ్రాయాలని లేదు.
ఉషా గారు,
మీకు భావుకత వెన్నతో పెట్టిన విద్యలా ఉంది... మాటల మూటలని ఎప్పుడంటే అప్పుడు విప్పి చూపగలిగే నేర్పు మీలో ఉంది... నేను రాసినదానిలో కొంచెం మాత్రమే వర్ణించాను, మిగిలినది నా అనుభూతి... మీ వర్ణన చాలా బాగుంది...
annaya chala rojula tharvatha nee blog chusa ..... chala bagundi .... alochana bagundi .... adara koduthunnav ... abhimanulu perigaru .... eka orderla kosam eduruchudachu
keep going ....
చలిలో వెన్నెల ముసుగేసుకుని
వెచ్చగా నవ్వుతున్నాడా అక్కడ ఆ చందమామ ?
అది సంగతి, మాపెరటి మామిడి కొమ్మ మీద,
ఉండేవాడు. మా మల్లెచెట్టుకు పూసిన వెన్నెలేదబ్బా
అని ఆలోచిస్తున్నాను. నొక్కేశాడన్నమాట !
హమ్మయ్య దొంగను పట్టేశారుగా.
ఆ మల్లెముసుగులు ఇటు పంపిద్దురూ...
ఆత్రేయ గారూ :-) మీ రాకతో నా బ్లాగు ధన్యమైంది...
దిలీప్ గారూ ! రాధిక గారు చందమామ నిచ్చేస్తానన్నారు , ఉష గారు మరువపు పరిమళాలిచ్చేశారు , ఆత్రేయ గారూ ...ఇంకా మహామహులంతా ముత్యాల మాటలు మూటగట్టి ఇచ్చేశారు .మరి నాకేం మిగిల్చారు ? అభినందనలండీ .
awesome thought :)
చాలా బాగుంది పండు చందమామ బాగుంది పదం
Post a Comment