ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...

వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...

Monday, February 28, 2011

ఆకాశం దాటి వస్తావా?





ఏనాడు కనుగున్నానో నిను



చీకటిని అందంగా చూపే నీ వెలుగులో చుక్కలని తిరిగి లెక్కబెట్టాను
కవ్వించే నీ ఉనికితో నువ్వు పుట్టించిన ప్రశ్నలెన్ని!
ఆ ప్రశ్నల్లో సమాధానాలుగా నే జీవిస్తున్నపుడు ఎంత సంబరం!
గడిచే ప్రతీ క్షణం క్షణపు విలువని తిరగరాసింది
ఇది ఎందాకానో తెలియని నేను నిను అందుకోబోయాను
ఆకాశమంత దూరంగా నువ్వు..

నీ దగ్గరితనపు దూరం కనుగునే ప్రయత్నం నేనాపలేదు


నా నీడే నిను అలుముకుందో
మరి ఏ నీడ నిన్ను కమ్ముక్కుందో
నానాటికీ చిక్కిపోయావు
ఓ నాడు నా కన్నులకి చిక్కకుండాపోయావు
చిన్నబోయిన అవి నిన్ను వెతకడం మానేసాయి
వెలుగునే కనుగొనడం ఆపేసాయి




కాలం ఏ మాయ చేసిందో..
నా చూపుల దారిని మళ్ళించింది
ఇక నే ఎప్పటికీ కనుగోలేనేమొ అనుకున్న నువ్వు
అది నువ్వే - ఎన్నడూ చూడనంత నిండుగా!

పెల్లుబికే ప్రశ్నలు నీ సమాధానాల్లో జీవించమన్నాయి
ఈ క్షణపు విలువ ఎంత అంటూ,
నీ దూరం ఎంత దగ్గర అంటూ..
ఏదో తెలియని భావం కన్నుల్లో ముసురుకుంది
మసక మసకగా నువ్వు






చిత్రం 'విశాల ప్రపంచం' సౌజన్యంతో :)