ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...

వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...

Thursday, December 8, 2011

వెన్నెల బంతి



గోదావరీ తీరం
శరత్ నాటి
సాయంత్రం
మబ్బులేని నింగిలో తెరలు తెరలుగా వెన్నెల పంచుతున్న నిండు చందమామ
వెన్నెల వెలుగుకి చిన్నబోయి తారలు నింగినొదిలి 
ఈ తీరంలో చేరి పసిడిలా మెరుస్తున్నాయా అన్నట్టు ఇసుక దొంతరలు
ఒడ్డున వెన్నెలని భారంగా మోస్తూ దట్టమైన చెట్లు
చిక్కగా మెరుస్తున్న పచ్చని ఆకులు
అటు గోదారి మీద అలల బోయలు వెలుగుని ఏ లోకానికో రవాణా చేస్తున్నట్లు 
అలలని తాకి తీరమంతా విహారం చేస్తున్న సమీరాలు


తన సమక్షంలోనే నన్ను గెలవాలని ప్రకృతి పదనిసలు
నేను మాత్రం తన మరపులోనే

వినిపిస్తూ తను పిల్లల మధ్య

ఏదైనా ఆట ఆడుకుందాం అక్కా!  పిల్లల అరుపులు..
ఏ ఆట చెప్మా! ఉల్లాసంగా ఆరా తీస్తూ తను
గాల్లో చిటికెలు వేస్తూ అంది.. హా.. వెన్నెల బంతి!
ఏయ్ ఏయ్ వెన్నెల బంతి! వెన్నెల బంతి! పిల్లల కేరింతల గానం


చకచకా చిత్తు కాయితాలు ఆకులతో తన చేతుల్లో బంతి తయారు
పైకి  ఎగరేస్తూ  అంది.. ఎవరు  పట్టుకుంటే  వాళ్ళదే  గెలుపు  అని 
నన్నూ  చేరమని  గాలిలోనే  గేలం  విసిరింది  ఉత్సాహంగా  

నేనూ  వాళ్ళ  మధ్య ..
బంతి  గాలికి  ఊరిస్తూ  దొరకనంటుంది

మది  చిలిపి  రాగం  అందుకుంది
తనలో  చక్కిలిగింతలు పలికించింది 
పడబోతూ తను  నా  చేతుల్లో..
మరు క్షణం ఇసుక పాన్పు మీద


పిల్లల్లో  ఎవరో  గెలిచారు 

ఏయ్  ఆగు!
నను  వెంటాడుతూ  నా గెలుపు..
నిండా  నా  కన్నుల్లో  నా  వెన్నెలబంతి!





*తను చిన్నప్పుడు వెన్నెల్లో ఆడుకున్న ఆట 'వెన్నెల బంతి'
*చిత్రం గీసినది వెన్నెల కిరణ్! :-)