ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...

వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...
Showing posts with label ఊహ. Show all posts
Showing posts with label ఊహ. Show all posts

Thursday, December 8, 2011

వెన్నెల బంతి



గోదావరీ తీరం
శరత్ నాటి
సాయంత్రం
మబ్బులేని నింగిలో తెరలు తెరలుగా వెన్నెల పంచుతున్న నిండు చందమామ
వెన్నెల వెలుగుకి చిన్నబోయి తారలు నింగినొదిలి 
ఈ తీరంలో చేరి పసిడిలా మెరుస్తున్నాయా అన్నట్టు ఇసుక దొంతరలు
ఒడ్డున వెన్నెలని భారంగా మోస్తూ దట్టమైన చెట్లు
చిక్కగా మెరుస్తున్న పచ్చని ఆకులు
అటు గోదారి మీద అలల బోయలు వెలుగుని ఏ లోకానికో రవాణా చేస్తున్నట్లు 
అలలని తాకి తీరమంతా విహారం చేస్తున్న సమీరాలు


తన సమక్షంలోనే నన్ను గెలవాలని ప్రకృతి పదనిసలు
నేను మాత్రం తన మరపులోనే

వినిపిస్తూ తను పిల్లల మధ్య

ఏదైనా ఆట ఆడుకుందాం అక్కా!  పిల్లల అరుపులు..
ఏ ఆట చెప్మా! ఉల్లాసంగా ఆరా తీస్తూ తను
గాల్లో చిటికెలు వేస్తూ అంది.. హా.. వెన్నెల బంతి!
ఏయ్ ఏయ్ వెన్నెల బంతి! వెన్నెల బంతి! పిల్లల కేరింతల గానం


చకచకా చిత్తు కాయితాలు ఆకులతో తన చేతుల్లో బంతి తయారు
పైకి  ఎగరేస్తూ  అంది.. ఎవరు  పట్టుకుంటే  వాళ్ళదే  గెలుపు  అని 
నన్నూ  చేరమని  గాలిలోనే  గేలం  విసిరింది  ఉత్సాహంగా  

నేనూ  వాళ్ళ  మధ్య ..
బంతి  గాలికి  ఊరిస్తూ  దొరకనంటుంది

మది  చిలిపి  రాగం  అందుకుంది
తనలో  చక్కిలిగింతలు పలికించింది 
పడబోతూ తను  నా  చేతుల్లో..
మరు క్షణం ఇసుక పాన్పు మీద


పిల్లల్లో  ఎవరో  గెలిచారు 

ఏయ్  ఆగు!
నను  వెంటాడుతూ  నా గెలుపు..
నిండా  నా  కన్నుల్లో  నా  వెన్నెలబంతి!





*తను చిన్నప్పుడు వెన్నెల్లో ఆడుకున్న ఆట 'వెన్నెల బంతి'
*చిత్రం గీసినది వెన్నెల కిరణ్! :-)

Thursday, March 6, 2008

ఏదీ నా చుక్క?!!!



అద్దాల కిటికీ నుండి నిశీధిని నిశితంగా చూస్తూ
ఏముంది? ఈ రేయి రంగు కలిసిన నింగిలో..
నా కళ్ళని కవ్వించే దాని విశాలత్వమేమో
అప్పటి వరకు గందరగోళమై అంతా ఆవరించిన ఆలోచనలు చిన్నవై ఎటోపోతాయి
మనసుకి చల్లని ప్రశాంతతని పంచుతుంది

కానీ ఇంతలో ఒక తలపు పెద్దదై అంతా ఆవరిస్తుంది
ఏదీ నా చుక్కని?

చమక్కుమంటూ ఒక చుక్క, నన్ను చూసావా అంటున్నట్టు
ఆ చూసాను... అదిగో ఇంకో చుక్క

ఇలా ఎన్ని చుక్కలని లెక్కపెట్టలేదు ఇప్పటికి?
కానీ ఎప్పుడైనా అలసిపోయానా...?

అదిగదిగో దూరంగా పట్టించుకుంటే గాని పట్టలేని పాలపుంత
ఎన్ని పుంతలు తొక్కలేదు... నీ కోసం వెతుక్కుంటూ...

హైవే మీద కేశినేని బస్సులో వెనక హాయిగా ఉయ్యాలూపినట్టుంది
నా కనురెప్పలు వాలుతూ తేలుతున్నాయి..
ఇది అలుపు కాదు తెలుసా?
అసంకల్పిత ప్రతీకార చర్య
కళ్ళుమూసుకుంటే తను చేరువవుతుందేమోనని చిన్ని ఆశ
కలలోనైనా...

ఏదీ నా చుక్క?!!!

Thursday, January 3, 2008

కల-కాలం

వర్ష నా ముందు నగ్నంగ ప్రత్యక్షమైంది
తను నా కళ్ళలోకి సూటిగా చూస్తుంది
ఆ చూపులో...
అచంచలమైన ప్రేమ, తరగని సానుభూతి,
అంతులేని ఔదార్యం, చెరగని నమ్మకం కనుగొన్నాను...
నేను తప్పించుకోలేకపోయాను ఆ చూపు నుండి, నిస్సహాయుడిలా

నిశ్శబ్ధాన్ని చేధిస్తూ,తనకు చీర కట్టమంది
నేను నిచ్చేష్టుడిలా ఉండిపోయాను తన మాటలు వింటు...
తనకి 12 కుచ్చిళ్ళు కావాలని, 12 రంగుల్లొ ఉండాలని అంటు
నా చేతిలో ఒక తెల్ల చీర పెట్టింది...

నేను కుచ్చిళ్ళు పేర్చుతూ, ఒక్కొ పేటకి రంగు అద్దడానికి ప్రయత్నిస్తున్నాను...
రంగులద్దుతుంటే, ఒక్కో రంగుకు నా చేత
ఆత్మ విశ్వాసంతో,
క్రమ శిక్షణతో,
దీక్షతో,
సత్సంకల్పంతో,
సాటివారిపై నమ్మకంతో,
నిజాయితితో,
ప్రణాళికతో,
ఆరోగ్యంపై శ్రద్ధతో,
ఉత్సాహంతో,
సానుకూల దృక్పధంతో,
నిత్యం జాగురూకతతో,
చిరు నవ్వుతో
తనని ఎదుర్కుంటానని ప్రమాణం చేయించుకుంది, నా నుదుటి మీద చెయ్యి వేసి...
నేను కుచ్చిళ్ళను ఒద్ది పెట్టి, లేచి తనకు పైట కప్పడానికి ఎదురునిలిచాను...
ఆ చూపుని తప్పించుకోలేకపోయాను...
ఆ కళ్ళలో అదే ప్రేమ,సానుభూతి,ఔదార్యం,నమ్మకం

తను నా చెయ్యి పట్టుకుని
పన్నెండు రంగుల కుచ్చిళ్ళను తన్నుతూ ముందుకు సాగింది...
నా పాదాలకి తన నడక విదిల్చిన రంగులు అద్దుతుంటే,
తన అడుగులని అనుసరించాను...

తను ఉదయిస్తున్న సూర్యుడికి ఎదురువెళ్తు అదృశ్యమైంది!
నేను నా పాదాలకి, చేతులకి పన్నెండు రంగులతో
తనకి చేసిన ప్రమాణాలతో ఏకాకిలా..

నిద్రలొ అటు ఇటు కదులుతున్న నన్ను
నా స్నేహితుడు హెచ్చరించాడు,కదలకుండ నిద్రపొమ్మని...
కళ్ళు తెరిచి చూసాను....
నా చేతులకి, పాదాలకి రంగులు లేవు,
ప్రమాణాలు మాత్రం లీలగా గుర్తు వస్తున్నాయి...
ఆ స్పృహతో నేను కొత్త వర్షానికి ఎదురు నిలిచాను చిరు నవ్వుతో...



స్నేహితులకి నూతన సంవత్సర శుభాకాంక్షలతో...