ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...

వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...

Monday, May 12, 2008

అమ్మా!నేనదృష్టవంతుణ్ణి



పల్లెటూరు సుఖాలని వదిలిపెట్టి మా మంచి కోసమని పట్నం వచ్చి
నువ్వే చాకలివై,పని మనిషివై,పాలేరువై,కుట్టు మనిషివై బండ చాకిరీ చేసావు

నీకు ఎదైనా నొప్పి వచ్చిందని తెలిసినప్పుడు
నాలో ఏదో అలజడి నన్ను దహించివేస్తుంది
ఈ రెక్కల గూడు ఎమైపోతుందో అని....

ఎవరైన నీ కష్టాన్ని చూసి నిన్ను మెచ్చుకుంటుంటే
నా కుటుంబం కోసం చేస్తున్నాను,నాకు అది ఇచ్చే సంతృప్తి చాలు అని కొట్టిపారేస్తావు...
పిచ్చి అమ్మా...! నువ్వేమి చేస్తున్నావో నీకు తెలియదేమొ
సంతృప్తి కోసం నువ్వు చేసే త్యాగాలు అన్నా ఇన్నా!
బయటి ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు నీకు కొడుకుగా
పుట్టడం నిజంగా నా అదృష్టం అనిపిస్తుంది...

మా అందమైన భవిష్యత్తు కోసం నువ్వు కనే చిన్న చిన్న కలలే నిన్ను నడిపిస్తాయి
ఆ కలలని నువ్వు నాతో పంచుకుంటున్నప్పుడు నీతో రెట్టించి మాట్లాడతాను అన్ని కలలు ఉండకూడదని
నువ్వూ అంతే గట్టిగా వాదిస్తావు
వాదనలో మసకబారే నీ కళ్ళని చూడలేక నేను అక్కడి నుండి వెళ్ళిపోతాను...
కానీ అమ్మా నీ కలలు గొంతెమ్మ కొర్కెలని కాదు.. అవి చాలా చిన్నవే..
కానీ ఆ చిన్న చిన్న కోరికలు కూడా తీరకపొతే వాటి మీదే బతుకుతున్న నువ్వు తట్టుకోలేకపోతావని నాకు భయం...
ఇప్పటికే నీకు దూరంగ ఉంటున్నాను...భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియదు...
అందుకే అంటాను నీకంటూ ఒక వ్యక్తిగతం ఉండాలి... నీకంటూ ఒక ప్రపంచం ఉండాలి అని...

నీకెవరైనా కష్టం చేస్తే క్షమించు, సహనంతో ఉండు, ప్రేమతో మాత్రమే ఎదుటివాళ్ళని గెలవగలవు
అని నువ్వు చెప్పే మాటలని పాటించాలని ప్రయత్నిస్తున్నప్పుడు ఒక్కోసారి నాకు నేను బలహీనుడిగా కనపడతాను
కానీ నీ జీవితాన్ని తరచి చూస్తే నాకు ధైర్యం వస్తుంది... నువ్వు చెప్పినట్టే ఉంటాను...

నాకు "మీ అమ్మంటే ఇష్టం" అని చెప్పే స్నేహితులూ ఉన్నారు తెలుసా?
అలా విన్నప్పుడు నాకు ఎంత గర్వంగా ఉంటుందో తెలుసా!

ఈ బాబుని ఇంతకుముందు ఎక్కడో చూసినట్టుంది... నీతో నాకు ఇంతకుముందే పరిచయమున్నట్టుంది
అని చాలా మంది అంటుంటే నువ్వు నాకు పంచిన ప్రేమ శక్తే అందరిని నాలో పోలికలు వెతుక్కునేట్టు చేస్తుందనుకుంటాను...

అస్తవ్యస్థంగా నడిచే భారత దేశం, అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఈ దేశం
ఎంతోకొంత సవ్యంగా ముందుకెళ్తుంది అంటే అది నీలాంటి అమ్మల వల్లే అని నాకనిపిస్తుంది...

కష్టాలు కడగండ్లకు
అణువణువునా నీ కాయం కుదేలైపోతుంటేను
చిరునవ్వుతో మమ్మల్ని నీ దరికి తీసుకున్నావు
ఆ నవ్వు వెన్నెల్లో నీ ఒడిలో మేము సేదతీరుతుంటేను
నీ భాధనే మరిచావు
మా బంగరు భవిష్యత్తుకై కలలు కన్నావు
ఆ కలల స్థైర్యంతో రేపటికి ఎదురు నిలిచావు
నన్ను కన్న నా అమ్మ ఏంచేసి
నీ కన్న నీ ౠణం తీర్చుకోగలడు?

10 comments:

రాధిక said...

మదర్స్ డే సందర్భంగా మీ నివాళి బాగుంది.ఇలాంటివాటిలో భావం తప్పించి ఇంకేమి చూడకూడదు.భావ పరం గా చాలా బాగుంది.

ఏకాంతపు దిలీప్ said...

@రాధిక గారు

థాంక్స్ అండి.. రాద్దామని కూర్చుని వచ్చిన ఆలోచనలన్నీ ఒక చోట పెట్టేసాను..

నిషిగంధ said...

దీపూ, ఎలాంటి గజిబిజి భావాలు లేకుండా చాలా చక్కగా చెప్పారు.. చదువుతుంటే 'మా అమ్మ గురించి నేను కూడా అచ్చు ఇలానే అనుకుంటాను కదా' అనిపిస్తుంది!! అమ్మ మాటెత్తితే ఎన్నో చెప్పాలనిపిస్తుంది.. ఎంతో వర్ణించాలనిపిస్తుంది.. ఎక్కడ మొదలుపెట్టాలో, ఎక్కడ ఆపాలో తెలీదు.. మీ ప్రయత్నం మాత్రం అద్భుతం!!

జాన్‌హైడ్ కనుమూరి said...

good

Anonymous said...

too many emotions at one place .......I think this goes even with Mother India ....so ..sweetheart ...:)

Bolloju Baba said...

దీపు గారికి
చాలా చాలా ధన్యవాదాలు.
అమ్మ పై ఎంతచదివినా అదొక దివ్యమైన అనభవంలానే ఉంటుంది. అది రాసే వాని గొప్పతనమా లేక అమ్మ ఔన్నత్యమో ఒకోసారి అర్ధంకాదు. చాలా బాగా వ్రాసారు. మరొక సారి అభినందనలు.

బొల్లోజు బాబా

Anonymous said...

Simplega chaala baaga raasaaru..telugulo blog chaala baavundi

ఏకాంతపు దిలీప్ said...

@ నిషిగంధ గారు
అవునండి... ఎంత రాసినా తక్కువే.. థాంక్యూ..

@ జాన్ హైడ్ గారు
థాంక్స్ అండి.. నా బ్లాగ్ మొదట్లో ప్రోత్సహించారు... మరల ఇప్పుడే... మీరు బిజీగా ఉంటున్నారా? కూడలిలో కూడా కనపడటం లేదు?

@ నిషీధి గారు
థాంక్స్ ఫర్ యూర్ స్వీట్ కామెంట్ :-)

@ బాబా గారు
థాంక్స్ అండి.. అది అమ్మ ఔన్నత్యమే... రాయించేది అమ్మే..

@కీర్తి గారు
థాంక్ యు... మరి మీరు కూడా తెలుగులొ మొదలుపెట్టొచ్చు కదా? :-)

saisahithi said...

దిలీపు గారికి
ధన్యవాదములు,
మొక్కలు మొలవకుండానే.. కవితలో ముద్రారాక్షసాన్ని గుర్తించి తెలియచేసినందుకు చాలా ధన్యవాదములు.
అమ్మ గురించి ఎంత చదివినా ఇంకా ఎంతో ఉందనే అని పిస్తుంది. ఎంత వ్రాసినా ఇంకా అవ్యక్తంగా కొంత మిగిలి పోతూనే ఉంటుంది. అంతేకాదు అమ్మ ఒక్కొక్కరికి ఒకోలా కనిపిస్తుంది...అని పిస్తుంది.ఒక్కొక్కరిది ఒక్కొక్క భావన.మీ కవిత చాలా బాగుంది.
saisahithi

రవి చంద్ర వారణాసి. said...

అయ్యబాబోయ్! మా అమ్మ మీకు తెలుసా? ఖచ్చితంగా తెలిసే ఉండాలి! ఎంత చక్కగా రాశారండీ! ప్రపంచంలో అందరూ ఏకీభవించే ఒకే ఒక్క అమ్మతనం గురించి అధ్బుతంగా ఆవిష్కరించారు. ఎప్పటికీ ఫ్రెష్ గా ఉండే ఈ పోస్ట్ కి ఆలస్యంగా రెప్లయ్ ఇస్తున్నందుకు క్షమించగలరు.