ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...

వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...

Wednesday, July 16, 2008

కాలపు కడలి కెరటాలు: స్నేహ మాధుర్యం




మెల్లగా ఊరంతా అలవాటైపోయింది. శివాలయం అరుగుల మీద మొద్దబ్బాయి, ఇక్కడ ఈ స్కూల్లో నాల్గో తరగతికొచ్చేసరికి ఫస్ట్ రాంకర్ అయిపోయాడు. క్లాస్ అంతా స్నేహితులైపోయారు. మేము ఆరుగురం క్లోజ్గా ఉండేవాళ్ళము. ఒకే బెంచ్ మీద కుర్చునేవాళ్ళము. మా ముందు అమ్మాయిల బెంచ్లు ఉండేవి. అప్పుడప్పుడు మేము కాళ్ళు అమ్మాయిల బెంచ్ మీద పెట్టుకునేవాళ్ళము. వాళ్ళని ఏడ్పించడానికి కాదు.అలా పెట్టుకుంటే మాకు సౌఖ్యంగా ఉండేది. అమ్మాయిలు మాత్రం కాలు పెట్టినప్పుడల్లా కోపంగా వెనక్కి చూసేవాళ్ళు.ఒక్కోసారి ఆ చూపులకే తీసేసేవాళ్ళము, ఒక్కోసారి చెప్పించుకునేవాళ్ళము. కానీ నా ముందు కుర్చున్న అమ్మాయి... పేరు వాసవి,వాళ్ళ నాన్న గారు గవర్నమెంట్ స్కూల్లో టీచర్... నేను కాలు తీసేస్తే, వెనక్కి తిరిగి పెట్టుకో అనేది... :-) మా వాళ్ళు కుళ్ళుకునేవారు...

ఆడుతూ పాడుతూ ఐదో తరగతికి వచ్చేసాము. క్వార్టర్లీ ఎగ్జాంస్ అయిపోయాయి అప్పుడు... ఇంట్లో అమ్మ, నాన్న అన్నీ ఆలోచించి ఊళ్ళో ఉండటం కన్నా సిటీలో ఉంటే మా ఇద్దరి భవిష్యత్తు బాగుంటుంది అని నిర్ణయించుకున్నారు. హాఫ్ ఇయర్లీ అయ్యేసరి అమ్మ,నాన్న,తమ్ముడు సిటీ కి వెళ్ళిపోయారు. నన్ను అమ్మమ్మ దగ్గర వదిలేసి.ఒక మిశ్రమ అనుభూతి అది.. అమ్మమ్మ దగ్గర ఉంటానని ఆనందంగా ఉన్నా, ఏంటో అమ్మ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోతున్నారు, నేను కూడా తరవాత అక్కడికి వెళ్ళాలి అన్న ఆలోచన నాకు ఇబ్బందిగా ఉండేది...

నేను రోజు రిక్షా ఎక్కి స్కూల్కెళ్ళేవాడిని. ఒక్కోసారి పెంటయ్య రిక్షా, ఒక్కోసారి పెద్ద మీసాల చంద్రయ్య రిక్షా ఎక్కాల్సి వచ్చేది. ఇప్పటికీ వీళ్ళు రిక్షా నడుపుతున్నారు...

ఐదో తరగతి అయిపోవడానికి ఎన్నో రోజులు లేవు. నాకు చివరి పరీక్షల ముందు చికన్ పాక్స్ వచ్చింది. ఒక నెల రోజులు ఇంట్లోనే ఉండి చదువుకున్నా. అమ్మమ్మ నాకు లెక్కలు కూడా చెప్పేది. ఇప్పుడు చదివే స్కూల్లో ఐదో తరగతి వరకే ఉంది. ఆ తరవాత ఏంటీ అని ఒకరోజు మేమంతా మాట్లాడుకోవడం మొదలుపెట్టాము... మా వాళ్ళంతా దగ్గర టౌన్లోని స్కూల్లో గానీ, గవర్నమెంట్ స్కూల్లో గానీ చేరతామని చెప్పారు. నేనేమో వీళ్ళందరిని వదిలేసి ఇంకెక్కడికో దూరంగా వెళ్ళాలి...అదే చెప్పాను వాళ్ళతోటి... ఒక్కసారి వాతావారణం నిశ్శబ్ధంగా అయిపోయింది... మరలా మనం కలుస్తామా లేదా అన్నట్టు. ప్రతి ఒక్కరు ఆలోచించుకుంటున్నాం... మొత్తం మీద ఆ నిశ్శబ్ధంలో నుండి మాటలు మొదలయ్యాయి. అందరం ఒక్కసారి చేతులు కలుపుకున్నాము... ఎవరు ఏ స్కూల్లో చేరినా వేసవి సెలవల్లో కలుసుకోవాలని... ఎక్కడికెళ్ళినా మనమంతా కలిసే ఉండాలని... ప్రతిజ్ఞ చేసుకున్నాము... ఆ క్షణంలో ఉవ్వెత్తున లేసిన కెరటంలా అందరం ఒకేరకమైన అనుభూతికి గురయ్యాము...

స్నేహాలకి సంబందించిన జ్ఞాపకాల్లో నాకు బాగా గుర్తుండిపోయే పాత తాజా జ్ఞాపకం... నాకైతే అప్పుడే స్నేహ మాధుర్యాన్ని తొలి సారి రుచి చూసినట్టనిపిస్తుంది...

మీరు మీ స్నేహితులు అలా మీ స్నేహాన్ని బయటపెట్టుకున్న జ్ఞాపకాలున్నాయా?

5 comments:

వేణూశ్రీకాంత్ said...

బావుందండీ, నేను ఆరో తరగతి తర్వాత స్కూల్ మారాల్సి వచ్చింది మొదటి సారి అప్పుడు మేమూ అలా కలుసు కోవాలి అని అనుకున్నాం కానీ మాళ్ళీ అప్పటి మిత్రులలో ఎవ్వరిని మళ్ళీ కలుసు కోడం కుదర్లేదు.

ప్రతాప్ said...

చదువుల రీత్యా అ ఊరు, ఈ ఊరు తీరగానే కానీ చిన్నప్పటి స్నేహితులని మాత్రం కోల్పోలేదు. మా ఊర్లో వాళ్ళని ఇప్పటికి కలుస్తూఉంటాను. అందరం కలిస్తే సందడే సందడి.
మీ టపా చదువుతుంటే యండమూరి వారి "మంచు పర్వతం" జ్ఞాపకం వచ్చిందండి.

సుజాత వేల్పూరి said...

మరి ఇప్పటికీ అలా కలుసుకుంటున్నారా లేదా?

ఏకాంతపు దిలీప్ said...

@ వేణూ గారు
నెనర్లు... తరవాత కొన్ని సంవత్సరాలు కలిసాము... ఇప్పుడు ఒక్కడే తచ్లో ఉన్నాడు...

@ ప్రతాప్ గారు
ఊళ్ళో ఇంకా ఉంటున్న నా క్లామేట్స్లోని చుట్టాలని ఇప్పటికీ కలుస్తాను ఊరెళ్ళినప్పుడల్లా... ఆ "మంచు పర్వతం" నేను చదవలేదండి.. మనం తెలుగులొ నవలలు చదివింది తక్కువే... తక్కువే అని కూడా అనకూడదేమో... చదివింది ఒక్కటే కాబట్టి :-)

@సుజాత గారు
ఆ తరవాత సంవత్సరం వేసవి సెలవల్లో, నేను సైకిలు వేసుకుని చుట్టూ నాలుగు ఊళ్ళూ వెళ్ళి వాళ్ళని కలిసివచ్చాను... ఆ తర్వాత సంవత్సరం, ఒకడు ఇంటికి వెళ్తే లేడు.... ఇంకొకడు వాళ్ళ నాన్న గారు ఎక్కడికో బదిలీ అయ్యారు... ఇంకొకడు అప్పటి వరకు అమ్మమ్మ దగ్గర చదువుకున్న వాడు, వాళ్ళ ఊరు వెళ్ళిపొయాడు,... ఇంకో ఇద్దరిని మాత్రం కొన్నేళ్ళు కలిసాను... చివరకి ఒక్కడిని మాత్రమే, వెళ్ళిన ప్రతీసారీ, ఇప్పటికీ కలవడం కుదురుతుంది... ఇద్దరు చదువు మానేసి వాళ్ళ ఊళ్ళల్లోనే ఉంటున్నా, పెద్దయ్యేకొద్దీ పట్టించుకోవడం మానేసారు... అంటే నాకు అనిపించినట్టు వాళ్ళకి అనిపించడంలేదేమో అనిపించింది... బదిలీ అయి వెళ్ళిపోయిన స్నేహితుడూ, ఒక్కసారిగా నేను చేరిన ఇంటర్ కాలేజీ లోనే ఎదురయ్యాడు.. అలా మరలా కలవడం మొదలయ్యింది...

sriram velamuri said...

good,dileep..baagumdi