ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...

వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...

Friday, July 11, 2008

కాలపు కడలి కెరటాలు: మొద్దబ్బాయి



నేను మూడో తరగతి వరకు గుర్తింపు ఉన్న బడిలో చదవలేదు. శివాలయపు గుడి అరుగుల మీద ఇద్దరు పంతులమ్మలు పాఠాలు చెప్పేవాళ్ళు. అందులొ ఒకరు కమలావతి గారు. మా ఇంటికొస్తారు. మా అమ్మమ్మకి బాగా పరిచయం. ఇంకొకరు పాప. ఒక అరుగు మీద కమలావతి గారు కొన్ని, ఇంకో అరుగు మీద పాప గారు కొన్ని పాఠాలు చెప్పేవాళ్ళు.

నేను సరిగ్గా చదవడం లేదని నన్ను తిడతారని, కొడతారని పాప గారంటే నాకు కోపం. కమలావతి గారు అలా కాదు. బుజ్జగిస్తూ, ప్రేమగా ఏదైనా చెప్తారు. అందుకే ఆవిడంటే నాకిష్టం. పాప గారి మీద కోపంతోనే తరవాత అసలు నేను బడికి వెళ్ళనని, నాకు ఇష్టం లేకపోయినా మా అమ్మ దగ్గరకెళ్ళాల్సివచ్చింది.

ఎక్కడ కూర్చోమంటే అక్కడ బాసీ పెట్టె వేసుకుని కూర్చోవడం తప్పితే మనకి చెప్పింది రాయడం, చదవడం వచ్చేది కాదు. :-) ఒకసారి పరీక్షలప్పుడు మా కమలావతి టీచర్ గారి కుర్చీ పక్కనే కుర్చోపెట్టుకుని ప్రశ్నా పత్రం ఇచ్చి పరీక్ష రాయమన్నారు... మనకి ఏమిచెయ్యాలో కూడా తెలియలేదు... అలా నోరు వదిలేసి కదలకుండా కూర్చున్నా.... కొంచెం సేపాగి ఆవిడ చూస్తే ఒక్క ముక్క కూడా రాయలేదు.. ఈలోగా మా క్లాస్లో అందరికన్నా బాగా చదివే అమ్మాయి గోపి మొత్తం రాసేసి పేపర్ ఇచ్చేసింది... ఏమనుకున్నారో, నాకు ఆ గోపిది ఆన్సేర్ పేపర్ ఇచ్చి చూసి రాయమన్నారు మా కమలావతి టీచర్ గారు. :-) ఇంక చూసి రాస్తూ పండగ చేసుకున్నాను అనుకున్నారా?! అయితే... మీరు ముద్ద పప్పులో కాలేసినట్టే... :-) మనకి చూసి కూడా రాయడం రాలేదు... :-D

తరవాత పెద్ద స్కూల్లో చదువుకుంటున్నప్పుడు నేను బెంచి లీడరు, క్లాస్ లీడర్ని... తన పక్కనున్న వాళ్ళు బాగా చదివే భాధ్యత బెంచి లీడర్ది కూడా... వాళ్ళకి అర్ధం కాకపోతే మొదట బెంచ్ లీడర్ చేత చెప్పించుకోవాలి... మా క్లాస్ ఫస్ట్ నేనే కాబట్టి అందరికన్నా వెనకబడ్డవాళ్ళని నా పక్కన కూర్చోబెట్టారు.. అలా నా పక్కనున్న వాళ్ళకి చెప్పేటప్పుడు ఒక్కోసారి ఓపిక నశించేది... కానీ అప్పుడు చిన్నప్పుడు మనం మొద్దబ్బాయి అనే విషయం గుర్తొచ్చి మరలా ఓపిక తెచ్చుకుని వాళ్ళకి చెప్పేవాడిని... వాళ్ళెప్పుడు నన్ను అభిమానంతో చూసేవాళ్ళు.. :-) వాళ్ళు పరీక్షల్లో పాస్ అయినప్పుడు తెగ ఆనందపడిపోయేవాడిని... :-)

ఇప్పుడు మాత్రం అది గుర్తొచ్చినప్పుడు పెదాలపై నవ్వు పలికించి జ్ఞాపకంగానే వెళ్ళిపోతుంది... స్కూల్లో బెంచ్ లీడర్గా ఉన్నప్పుడు ప్రేరేపించినట్టు ఇప్పుడు ప్రేరేపించడంలేదు.... బహుశా మన ప్రతి జ్ఞాపకానికి భవిష్యత్తులో మన ద్వారా నెరవేర్చాల్సిన భాధ్యత ఏదోకటి ఉంటుందేమో! అందుకే అట్టడుగునుండి ఎగసిపడే కడలి కెరటంలా పదే పదే పైకొచ్చి మనల్ని పలకరిస్తుందేమో... ఈ జ్ఞాపకం తన పని పూర్తి చేసుకుని, ఇప్పుడు నాకు నవ్వుని మాత్రమే ఇస్తుందేమో... ఇంకా ముందు ముందు ఏదైనా చెప్పుతుందేమో నాకు...

23 comments:

Purnima said...

హే... బెంచీ లీడర్ కాంసెప్ట్ మీ బడిలో కూడా ఉందా?? మా దగ్గరే పరిమితం అనుకున్నా. నేనూ ఆ లీడర్ల గుంపులో ఉన్నాను మరి :-)

ఏ విషయాన్ని అయినా మీరంతలా విశీదకరించి ఎలా చెప్పగలరో ఇప్పుడు అర్ధమైయ్యింది నాకు.

జ్ఞాపకాలు ఇలా వ్యాసంగా రాయడమేం?? నేనో కవిత కోసం ఎదురు చూస్తూ ఉన్నా!! :-(

Kathi Mahesh Kumar said...

బాగుంది. మీకవిత్వంలో ఉన్న సున్నితత్వపు "ఝలక్" ఇందులోకూడా కాస్త తళుక్కు మనిపించింది.

మోహన said...

>>మన ప్రతి జ్ఞాపకానికి భవిష్యత్తులో మన ద్వారా నెరవేర్చాల్సిన భాధ్యత ఏదోకటి ఉంటుందేమో!

100%.

మా తాతగారు ఇంటర్మీడియట్ విధ్యార్థులకు గణితం బోధించేవారు. నా చిన్నప్పుడు ఆయనని చూడటానికి ఎక్కడి నుంచో వచ్చే వారి విధ్యార్థులను చూసి, "ఎన్నో సంవత్సరాల తరువాత కూడా వారు అంత అభిమానం చూపిస్తున్నారంటే తాతగారు వారికేదో చాలా విలువైనదే అందించి ఉండాలి" అనిపించేది. కనీ ఎప్పుడూ అర్థమవ్వలేదు.

నాకు పాఠాలు చెప్పటం అంటే సరదా. ఎంత అంటే...నేను ఇంజినీరింగ్ చదివే రోజుల్లో నన్ను డౌట్లు అదిగిన వారికి, పరీక్షకి ఒక గంట ముందైనా సరే టైం లేదని కానీ, నాకు రాదు అని కాని ఎప్పుడు చెప్పలేదు. నాకు తెలియకపోతే నేర్చుకుని మరీ చెప్పేదాన్ని. అలా నాకు తెలిసింది వారికి చెప్పేటప్పుడు చాలా బాగా అనిపించేది. ఇంకా మా జూనియర్లు అప్పుడప్పుడు వచ్చి కొన్ని టాపిక్స్ చెప్పించుకునేవారు. అందులో చాలా మంది నాకు అసలు పరిచయం లేని వారు కావటం నాకు ఇప్పటికీ ఆశ్చర్యంగా ఉంటుంది. ఎవరొచ్చినా తిరిగి వెళ్ళేప్పుడు సంతృప్తి గా వెళ్తూ అది నాకు కూడా పంచేవారు. ఇక రోజంతా అది చూసుకుంటూ మురిసిపోయేదాన్ని. వారికి మార్కులు బాగా వస్తే ఆ ఆనందం ఎలాంటిదో నేను మీకు కొత్తగా చెప్పనక్కర్లెదు కదండి దీపు గారూ...

కళ్ళు లేని విధ్యార్థినులకు, పాఠాలు చెప్పిన రోజున కాని నాకు అర్థం కాలేదు నాకు నా జీవితం లో ఆ సంఘటనల ప్రాముఖ్యత. మీ ఈ టపా చదివితే గాని తెలియలేదు ఆ జ్ఞాపకాల విలువ.

ఇప్పుడు మీకు అర్థమయ్యిందా, మీ ఈ జ్ఞాపకం నెరవేర్చిన బాధ్యత ? :)

ధన్యవాదాలు దీపూ గారూ..

Srividya said...

చివరలో పదాలు మనసుని ఒక్కసారి కుదిపేసాయండి. నిజమే ప్రతీ జ్ఞాపకం వెనక నిర్వర్తించాల్సిన కర్తవ్యం ఒకటి వుంటుందేమో...

వేణూశ్రీకాంత్ said...

టపా చాలా బావుంది దీపూ...మీ కవి హృదయం కనపడుతుంది...

"బహుశా మన ప్రతి జ్ఞాపకానికి భవిష్యత్తులో మన ద్వారా నెరవేర్చాల్సిన భాధ్యత ఏదోకటి ఉంటుందేమో!.."

నిజమే చాలా బాగా చెప్పారు.

ఏకాంతపు దిలీప్ said...

@ పూర్ణిమ
నువ్వు కూడానా? :-)

@ మహేష్ గారు
నెనర్లు

ఏకాంతపు దిలీప్ said...

@ మోహన

నా జ్ఞాపకాలతో మీ జ్ఞాపకాలని పోల్చుకుంటే, నేను పరిశీలించిన కోణంలో మీరూ చెప్తుంటే నాకు చాలా ఆనందం కలిగింది.. :-)
అవును నా జ్ఞాపకం నా చేత నా క్లాస్మేట్లకి ఉపయోగపడగలిగేట్టు చేసిందనే నేను ఆ పరిశీలనతో ముగించాను... మీరు కూడా అలానే అంటుంటే అది కేవలం నా పరిశీలనే కాదు నిజం అని నమ్మేస్తున్నాను. :-)

ఏకాంతపు దిలీప్ said...

@ శ్రీ విద్య
@ వేణూ శ్రీకాంత్
మీకూ అలానే అనిపించిందా? :-) నెనర్లు...

Anonymous said...

excellent.keep writing

రాధిక said...

చాలా బాగా చెప్పారు .అందరూ చెపుతున్నట్టుగా ఆ మాటలు కట్టిపడేసాయి.నాకు చాలాసార్లు అనిపిస్తూ ఉంటుంది..
నా ఈ మంచితన0్ నిజంగా నాదా లేక
అనుక్షణ0్ వెంటాడే నా జ్నాపకాలదా?
ఈ అర్ధంచేసుకునే గుణ0్ నాదా లేక
ప్రతీ క్షణ0్ ప్రశ్ని0చే నా అనుభవాలదా?
నిజంగా జ్నాపకాలు ఖరీదులేని/కట్టలేని విలువయిన స0పదలు.అలాంటి స0పద నాదగ్గర చాలా ఉంది.:)

Swathi said...

annayya

excellent ivanni na tho kalisi perigina ma annayya ne anipistundi okkasari!...chala chala bavunnayi annayya.....ekkado ekkadiko tesukuvelutunnavu..okka sari...enno enno madura gnapakalu gurthutestunnavu!..thank u so much!!!!!!!!!!

నిషిగంధ said...

I really enjoyed reading it!! మన జ్ఞాపకాలు మన పట్ల నిర్వర్తించే అతి ముఖ్యమైన బాధ్యత మనల్ని ఎప్పటికీ ఒంటరిని చేయకపోవటం.. అవి సదా మనల్ని వెన్నెంటే ఉంటాయి.. నీ శివాలయం స్కూల్ చాలా బావుంది.. మా అమ్మని కూడా పాప టీచర్ అంటారు తెలుసా! కానీ తనెప్పుడూ బెజవాడ శివార్లు దాటెళ్ళలేదు కాబట్టి నీ చెవులు మెలేసిన ఘనత తనదైఉండదు :-)
బెంచ్ లీడరా! ఎంతమంది ఉండేవాళ్ళు మీ స్కూల్లో బెంచ్ కి? 3 or 5?

నిషిగంధ said...

btw, రాధిక కామెంట్ కవితలా చాలా బావుంది!!

ఏకాంతపు దిలీప్ said...

@ రాధిక గారు
:-) నెనర్లు... మీ వ్యాఖ్య బాగుంది... నిజమే...మనం ఈ క్షణంలో ఇలానే ఎందుకు ప్రవర్తిస్తాము అంటే, కొన్ని జ్ఞాపకాలు మనల్ని వెన్నంటి ఉండటం వల్లేమో అని నేను కూడా అనుకుంటాను...

ఏకాంతపు దిలీప్ said...

@ స్వాతి
థాంక్స్ రా.. ఇంకా రాస్తాను... చూస్తూ ఉండు :-)

ఏకాంతపు దిలీప్ said...

@ నిషిగంధ గారు
జ్ఞాపకాల ఒక భాధ్యతని గుర్తుచేసినందుకు చాలా నెనర్లు
"మన జ్ఞాపకాలు మన పట్ల నిర్వర్తించే అతి ముఖ్యమైన బాధ్యత మనల్ని ఎప్పటికీ ఒంటరిని చేయకపోవటం..."
అవును కదా... ఇంకేమి చేసినా చెయ్యకపోయినా జ్ఞాపకాలు మనల్ని పలకరిస్తూ, మన ఒంటరితనాన్ని దూరం చేస్తాయి..
మా క్లాస్లో 20 బెంచీలు, బెంచ్ కి ముగ్గురు.. నేను మధ్యలో నాకు అటు ఇటు కృష్ణ కిషోర్, వెంకటేశ్వర రావు కూర్చునేవాళ్ళు...

మోహన said...

దిలీప్ గారూ..

ఇలా అంటున్నానని మరోలా అనుకోవద్దు...
ప్రతి నాణానికి రెండు వైపులున్నట్టు జ్ఞాపకాలకి కూడా మరో కోణం ఉంది.వాటిని భద్రంగా దాచుకునే వారికి తీపి తో పాటు చేదు అనుభవాలూ గుండెల్లో మెదులుతూ ఉంటాయి. గుంపులో ఉన్నా గోడ కట్టి ఒంటరిని చేసేస్తాయి. అలాంటి చేదు జ్ఞాపకం కూడ ఒక బాధ్యతను మనకు అందించటనికే అంటరా?
తీపి ఎంత అందమో, చేదు అంతే అవసరం. ఏమంటారు ?

Purnima said...

మోహనా.. మీరు దిలీప్ గారినే అడిగినా.. ఆ సమాధానం నాకు చెప్పాలని ఉంది. చేదునే మిగిల్చినా జ్ఞాపకానికి బాధ్యత ఉంటుంది. అది ఎలా అంటే.. నా స్వగతం చెప్పాలి. అది రాద్దామా వద్దా అని చాలా ఆలోచించాను.. ఇప్పుడు మీ ప్రశ్నకోసమైనా నేను చెప్పాల్సిందే!!

ఏకాంతపు దిలీప్ said...

@ మోహనా
బాధ్యత ఉంటుంది... నాకూ చెప్పాలనిపిస్తుంది... :-)

మీనాక్షి said...

ఆన్నయ్య..మీరు..ఇలా ఎప్పటి నుండి రాస్తున్నారు..
అబ్బో ఈ మార్పేంటో...!!!!
మొత్తానికి చాలా బాగున్నాయి మీ gyapakaalu.
చివరి లైన్స్ చాలా బాగా రాసారు.........

మంచిబాలుడు-మేడిన్ ఇన్ వైజాగ్. said...

మంచి టపా... మనసులో దాగి ఉన్నా భావాలు కవిత్వం లో ప్రస్ఫుటితంగా కనిపిస్తున్నాయి.

మంచిబాలుడు-మేడిన్ ఇన్ వైజాగ్. said...

మంచి టపా... మనసులో దాగి ఉన్నా భావాలు కవిత్వం లో ప్రస్ఫుటితంగా కనిపిస్తున్నాయి.

Anonymous said...

Hi Dilip garu,
mee jnapakam bagundi,
dani gurinchi raasina vaakyalu inka bagunnayi. nigoodhamyna tatvikata kanpinchindi.
Thanks for Sharing them.
Aruna