ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...

వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...

Sunday, May 9, 2010

స్తబ్ధత

ఆకు ఆకు మధ్య ఎడం
స్పష్టంగా కనపడుతుంది
చూపుల దారికి చుక్కల పందిరికి మధ్య
మబ్బు గోడలు అడ్డు పెట్టేసాయి
చిరు గాలీ ఇటు రావాలోసారి
ఆ ఎడబాటుని ఎడం చేయాలి
కుండపోత కావాలి ఇపుడు
జాబిల్లిని నా కన్నుల్లో ప్రతిష్టించాలిపుడు
చుక్కల సాక్షిగా
కుండపోత కావాలి నాకు
రెప్పపాటు చాలు

Friday, May 7, 2010

జాబిల్లి


జాబిల్లిని చూస్తున్నాను
ఏంటి అలా చూస్తున్నావని అడుగుతుంది
నీ దరి ఎలా చేరాలా అని ఆలోచిస్తున్నానన్నాను
నవ్వుతూ అది అంత తేలిక కాదంటుంది
ఎందుకు కాదు అని నేను
ఎందుకు చేరాలనుకుంటున్నావని తను

నీ వెన్నెల ఒడిలో సేద తీరాలని ఉంది
ఆ చల్లని వెలుగులో ప్రపంచాన్ని శోధించాలని ఉంది
అని నేను
ఆ వెలుగు నాది కాదు
నేనేమీ ప్రత్యేకం కాదు
అని తను
నా ప్రపంచం లో నీ వెన్నలనే చూడగలుగుతున్నానని నేను
ఈ వెన్నెల లేకపోతె ఏం చేస్తావని తను
ఒకసారి దగ్గర చేసుకున్నాక దూరం కానని నేను
మౌనంగా తను
ముని లా నేను

ఎవరు పాడతారు నాకు
చందమామ రావే జాబిల్లి రావే అని
ఎవరు చేరుస్తారు తనని నా దరికి
నా నీడని తనలో చూసుకునేంత దగ్గరకి

Saturday, May 1, 2010

ఏ కాంతపు దిలీప్?


ఎక్కడో వాన వెలిసింది
తెమ్మెర తెరలు తెరలుగా తాకి పోతుంది
ఏ లోకాన్నో ఏగుతున్న నను ఈ లోకానికి లాగుతూ
కాలగతి ఎరుగని నిరీక్షణ స్పృహ కోల్పోతుందేమో
మనసు ఈ లోకాన్నే మరచిపోతుంది
ఎంతసేపట్నుంచి ఇక్కడ?
ఎంత ఎదురు చూసినా జాబిల్లి మబ్బు చాటు దాటి బయటకి రానంటుంది
అలుసా?
ఇదంతా నేను అలుపెరుగని వరకే తెలుసా?
ఎదురుగా ఏకాంతంలో ప్రియుని భుజంపై వాలి ప్రియురాలు
వీళ్లెప్పుడు వచ్చారూ ఇక్కడికి!
మరి, ఏ కాంత వరిస్తుందో నా ఏకాంతాన్ని...
అదిగో మేఘ సందేశం కనిపిస్తూ వినిపిస్తూ
ఇంకాసేపట్లో నా నిరీక్షణ ఫలిస్తుంది...
ఏ కాంత మరిపిస్తుందో ఆ జాబిల్లిని?