ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...

వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...

Saturday, May 1, 2010

ఏ కాంతపు దిలీప్?


ఎక్కడో వాన వెలిసింది
తెమ్మెర తెరలు తెరలుగా తాకి పోతుంది
ఏ లోకాన్నో ఏగుతున్న నను ఈ లోకానికి లాగుతూ
కాలగతి ఎరుగని నిరీక్షణ స్పృహ కోల్పోతుందేమో
మనసు ఈ లోకాన్నే మరచిపోతుంది
ఎంతసేపట్నుంచి ఇక్కడ?
ఎంత ఎదురు చూసినా జాబిల్లి మబ్బు చాటు దాటి బయటకి రానంటుంది
అలుసా?
ఇదంతా నేను అలుపెరుగని వరకే తెలుసా?
ఎదురుగా ఏకాంతంలో ప్రియుని భుజంపై వాలి ప్రియురాలు
వీళ్లెప్పుడు వచ్చారూ ఇక్కడికి!
మరి, ఏ కాంత వరిస్తుందో నా ఏకాంతాన్ని...
అదిగో మేఘ సందేశం కనిపిస్తూ వినిపిస్తూ
ఇంకాసేపట్లో నా నిరీక్షణ ఫలిస్తుంది...
ఏ కాంత మరిపిస్తుందో ఆ జాబిల్లిని?

7 comments:

రాధిక said...

ఏలోకాన్నో ఏగుతున్నానంటే ఏ కాంత ఊహలతోనో అనుకున్నాను.మళ్ళా చివర ఏకాంత వరిస్తుందో ఏ కాంతాన్ని అంటారేమొటీ? :) శీర్షిక భలే వుంది.కవిత బావుంది.

Avineni N Bhaskar said...

చదువుతుంటే అలా అలా మయమరిపించేస్తుంది నీ ఏకాంత భావాలు. నీ నిరీక్షణ నీకు బాధే అయినా మాకు మాత్రం నీ నిరీక్షణ ఎంత కొనసాగితే అన్ని కవితానందాలు.

ఏకాంతపు దిలీప్ said...

@ రాధిక గారు
అక్కడ కాంత లేదండి. :) జాబిల్లి కోసం నా నిరీక్షణ స్పృహ కోల్పోయి, మనసు తనని తాను మరచిపోయి ఏదో ఆలోచిస్తుంది. ఏంటో కూడా గుర్తులేదు. చల్ల గాలి తాకి తేరుకుంటే నా నిరీక్షణ కి స్పృహ వచ్చింది. ఆ తరవాత కాంత వచ్చింది :)

@ భాస్కర్ గారు
:) :(

మోహన said...

బావుంది.

Sree said...

hmmm.. ekanta maripistundo chooddam :).. good one.

పద్మ said...

"చల్ల గాలి తాకి తేరుకుంటే నా నిరీక్షణ కి స్పృహ వచ్చింది. ఆ తరవాత కాంత వచ్చింది :) "
మొత్తానికి కాంత వచ్చిందన్నమాట. :)

"అలుసా?
ఇదంతా నేను అలుపెరుగని వరకే తెలుసా?"
ఈ లైన్స్ చదవగానే రెండు భావాలు మదిలో మెదిలాయి. అచ్చం చిన్నపిల్లాడు బిక్కమొహం వేసుకుని రోషంతో నువ్విలా చేస్తే నేను మాట్లాడనంతే అంటూ బెదిరిస్తున్నట్టు అనిపిస్తే, నీకింత అలుసయ్యేది నేను అలుపెరగకుండా ప్రయత్నించినంత వరకే సుమా అని హెచ్చరిస్తున్నట్టూ ఉంది.

"కాలగతి ఎరుగని నిరీక్షణ స్పృహ కోల్పోతుందేమో"
ఈ వాక్యం నిజంగా ఊహించలేదు సుమా. :) నిజమే కదా. నిరీక్షణ కాలం ఎరగదు. కాలం ఎటు పయనించినా సఖుల కలయిక జరిగే వరకు నిరీక్షణ ఆగదు. కానీ, ఇష్టుల కోసం వేచే సమయం భరించరానిదిగా ఉన్నప్పటికీ తియ్యగానూ ఉంటుంది. విరహము కూడా సుఖమే కాదా, నిరతము చింతన మధురము కాదా అని పెద్దలు ఊరికే అనలేదేమో.

"మనసు ఈ లోకాన్నే మరచిపోతుంది"
మరి నిరీక్షణలో ఉండే గమ్మత్తు అదేనేమో. :)

"ఎదురుగా ఏకాంతంలో ప్రియుని భుజంపై వాలి ప్రియురాలు
వీళ్లెప్పుడు వచ్చారూ ఇక్కడికి!"
మొదట చదవగానే తారా చంద్రులు అనుకున్నాను ఈ ప్రియుడు, ప్రియురాలు. కానీ ఇంకా అప్పటికి మీ నిరీక్షణ ఫలించలేదు అని తర్వాత అర్థం అయింది. మరి వీళ్ళిద్దరెవరబ్బా? ఇంక ఎదురుగా వీళ్ళిద్దరూ ఉంటే వారు ఏకాంతంలో ఎలా ఉన్నట్టు? మీ ఏకాంతం ఏమైనట్టు? :p

మీ ఏకాంతాన్ని కాదు మిమ్మల్ని వరించి మీ ఏకాంతాన్ని మరిపించే కాంత మీ సొంతం అవ్వాలని కోరుకుంటున్నాను. :)

ఏకాంతపు దిలీప్ said...

@పద్మ గారు
వాళ్ళిద్దరూ వాళ్ళ ఏకాంతంలో ఉన్నారండి. ఇష్టమైన వాళ్ళు పక్కన ఉన్నప్పుడు మన ఏకాంతం ఇంకా ఇష్టమవుతుంది కదా... వాళ్ళిద్దరూ వాళ్ళ ఏకాంతంలో ఉన్నారు :) నా ఏకాంతానికి వాళ్ళేమీ చెయ్యలేరు :) థాంక్ యూ :)