ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...

వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...

Sunday, August 29, 2010

నీ బదులు { గీతాంజలి ~ 15 }

నీవు పలుకకపోతే నీ మౌనాన్నే నా హృదయం నిండా నింపుకుని ఓర్చుకుంటాను

నేను కదలకుండా రాత్రిలా నక్షత్రాలనే కళ్ళుగా చేసుకుని జాగురుకతతో

తలవంచుకుని సహనంతో ఎదురుచూస్తాను

తప్పకుండా తెలవారుతుంది, అంధకారం అంతర్ధానమవుతుంది

అపుడు నీ స్వరం దివ్యమైన తరంగిణిలా నింగిని చేధించుకుని జాలు వారుతుంది

నీ మాటలు నా ప్రతి పక్షి గూటి నుండి పాటల్లా రెక్కలు విచ్చుకుంటాయి

నీ రాగాలు నా వనాల్లో పువ్వుల్లా వెల్లువిరుస్తాయి



చావా కిరణ్ అనువాదం ఇక్కడ


If thou speakest not I will fill my heart with thy silence and endure it.
I will keep still and wait like the night with starry vigil
and its head bent low with patience.
The morning will surely come, the darkness will vanish,
and thy voice pour down in golden streams breaking through the sky.
Then thy words will take wing in songs from every one of my birds' nests,
and thy melodies will break forth in flowers in all my forest groves.

Friday, August 27, 2010

నీ తిరస్కృతి { గీతాంజలి ~ 14 }

నా కోరికలు అనేకం, నా మొర దైన్యం

కానీ నిత్యమూ నన్ను నీ నిండు తిరస్కారాలతో కాపాడుతూనే ఉన్నావు;

ప్రబలమైన నీ కరుణతో నా జీవితమంతా రూపుదిద్దావు

దిన దినము నువ్వు నన్ను సాధు యోగ్యుడిగా చేయుచున్నావు

నన్ను అతివిస్తారమైన కోరికల అపాయాల నుండి కాపాడుతున్నావు.

అడగకుండానే నువ్వు నాకు ప్రసాదించిన శ్రేష్టమైన కానుకలు

ఈ నింగీ, వెలుగు, ఈ దేహము, ప్రాణము ఇంకనూ బుద్ధి.

కొన్ని సమయాల్లో నేను నిస్త్రాణంగా నిలిచి ఉన్నాను

మరి కొన్ని సార్లు మేలుకొని నా లక్ష్యం కోసం ఆతురతతో వెతికాను;

కానీ నువ్వు మాత్రం నిర్దయగా నా కంట పడక దాగి ఉన్నావు

దిన దినమూ నువ్వు నన్ను నీ పూర్తి అంగీకారానికి యోగ్యుడిగా చేయుచున్నావు

నన్ను పదేపదే తిరస్కరిస్తూ, దుర్గుణాల అపాయాల నుండి, చంచలమైన కోరికల నుండి కాపాడుతూ...



చావా కిరణ్ అనువాదం ఇక్కడ


My desires are many and my cry is pitiful,
but ever didst thou save me by hard refusals;
and this strong mercy has been wrought into my life through and through.
Day by day thou art making me worthy of the simple,
great gifts that thou gavest to me unasked---this sky and the light, this body and the
life and the mind---saving me from perils of overmuch desire.
There are times when I languidly linger
and times when I awaken and hurry in search of my goal;
but cruelly thou hidest thyself from before me.
Day by day thou art making me worthy of thy full acceptance by
refusing me ever and anon, saving me from perils of weak, uncertain desire.

దివ్య దర్శనం { గీతాంజలి ~ 13 }

ఏ పాట అయితే పాడటానికి వచ్చానో అది నేటికీ పాడలేదు

నా కాలాన్నంతా నా వాయిద్యానికి తంతులు వేయడంలోను తీయడంలోను గడిపేసాను

సమయం ఇంకా రాలేదు, పదాల పొందికా కుదరలేదు

నా హృదయంలో వేదనాభరిత కోరిక మాత్రం మిగిలి ఉంది

ఇంకా మొగ్గ విచ్చుకోలేదు; గాలి మాత్రం భారంగా కదులుతుంది

నేను అతని రూపమూ ఎరుగను, అతని స్వరమూ ఎరుగను

నేను విన్నది నా వాకిట ముంగిట ఆతని మృదువైన అడుగుల జాడ మాత్రమే

పగలంతా నేల మీద అతని పీఠం పరచడంలోనే గడిచిపోయింది

కానీ దీపం వెలిగించలేదు అందుకే అతన్ని లోపలకి ఆహ్వానించలేను

అతనిని కలుసుకోవాలనే ఆశతో బతుకుతున్నాను; కానీ దర్శనం ఇంకా జరగలేదు.





The song that I came to sing remains unsung to this day.
I have spent my days in stringing and in unstringing my instrument.
The time has not come true, the words have not been rightly set;
only there is the agony of wishing in my heart.
The blossom has not opened; only the wind is sighing by.
I have not seen his face, nor have I listened to his voice;
only I have heard his gentle footsteps from the road before my house.
The livelong day has passed in spreading his seat on the floor;
but the lamp has not been lit and I cannot ask him into my house.
I live in the hope of meeting with him; but this meeting is not yet.

Tuesday, August 24, 2010

దివ్య ధామము ... { గీతాంజలి ~ 12 }

నా యాత్ర తీసుకునే సమయమూ దాని దారీ నిడుపాటి

నేను తొలి కిరణాల వెలుగు రథం మీద బయలుదేరి లోకాల అరణ్యాల గుండా నా యానాన్ని కొనసాగించాను, నక్షత్రాలపై గ్రహాలపై నా జాడ వదలి

అది నిను సమీపించగలిగే సుదూరమైన మార్గము, క్లిష్టమైన ఆ తర్ఫీదు శుద్ధ ఏకరాగ ముగ్ధతని పరిచయం చేస్తుంది

యాత్రికుడు తన వాకిలి చేరడానికి ప్రతి అన్య వాకిలిని తట్టాల్సిందే, మరి అన్ని బాహ్య లోకాలని తిరగాల్సిందే చివరకి లోపలి కోవెల చేరడానికి

నా నయనాలు దశదిశలా శోధించాయి, వాటిని మూసి "ఇక్కడే ఉన్నావు ప్రభూ" అని చెప్పే ముందు

"ఎక్కడ ఉన్నావు ప్రభూ?" అనే నా ప్రశ్నా రోదనలు, "ఇదిగో నేను" అనే వెల్లువెత్తే హామీతో, వేన ప్రవాహాల కన్నీళ్ళలా కరిగి ఈ లోకాన్ని ప్రళయంలో ముంచెత్తుతాయి






The time that my journey takes is long and the way of it long.

I came out on the chariot of the first gleam of light, and pursued my voyage through the wildernesses of worlds leaving my track on many a star and planet.

It is the most distant course that comes nearest to thyself, and that training is the most intricate which leads to the utter simplicity of a tune.

The traveller has to knock at every alien door to come to his own, and one has to wander through all the outer worlds to reach the innermost shrine at the end.

My eyes strayed far and wide before I shut them and said `Here art thou!'

The question and the cry `Oh, where?' melt into tears of a thousand streams and deluge the world with the flood of the assurance `I am!'

Thursday, August 19, 2010

మానస గిరి





చిందరవందరగా మనసు
ఒక రూపు రాని అదుపు లేని ఆలోచనలు ఎన్నో
మదిస్తాయి మరిపిస్తాయి మొరపెడతాయి
అపుడపుడూ ఆశ్చర్యంగా ఒకదానితో ఒకటి అల్లుకుంటాయి
అందమైన కవితలవుతాయి
అక్కడక్కడా వ్రేళ్ళూనుకుని నిటారుగా నిలబడి
ఆ కొండ ఏటవాలుని వెక్కిరిస్తున్న సరుగుడు చెట్లలా
నా మనసుని వెక్కిరిస్తాయి
చూడడానికి అన్ని చెట్లూ ఒకేలా ఉంటాయి
అయితే అవ్వనీ కొండ నిండుగా ఉన్నాయి
కొండని కొలవాలనుకునే వాళ్ళకి ప్రతి చెట్టూ కొలువే
ప్రతి చెట్టూ కొండని అధిరోహించడానికి స్పూర్తే
కొండ ఎదుగుతుందట తెలుసా
ఎంత ఎదుగుతుంటే అన్ని చెట్లు
ఎవరు అధిరోహిస్తారో ఆ కొండని?
ఆక్రమించి చదును చేస్తే బాగుండు..

Tuesday, August 10, 2010

మనసు మాట వినదు

నీరెండలో చలి కాచుకుంటూ ఉంటాను
ఏ చిలిపి మేఘమో సూరుడికి అడ్డం పడుతుంది
ఒక్కసారిగా వణికిపోతాను

మండుటెండలో పొలంలోని కొలనులో బట్టలిప్పి స్నానానికి దిగుతాను
ఇంతలో దట్టమైన మేఘాలు అల్లుకుంటాయి
బట్టలు తడిపేస్తాయి

అటుగా ఏదో అందం కదులుతుంటుంది చూడబోతాను
గాలి వీస్తుంది అది జారుకునేంత వరకూ
కళ్ళల్లో దుమ్ముని చూస్తాను

ఎండా వానా ఒకేసారి కాపు కాస్తాయి
ఎవరో ఎవరితోనో కలుస్తారు
అయోమయాతిశయంలో నేను

నడిచి నడిచి అలసి ఆగిపోతాను దాహంతో
దూరంగా తడి కనపడి పరుగులుతీస్తాను
నా నిట్టూర్పులు ఎండమావుల్లో కలిసిపొతాయి

ఏకాంత వనం లో ఎద ఏదో రాగం ఆలపిస్తూ ఉంటుంది
ఇంతలో ఆలోచనలు సీతాకోకచిలుకలైపోతాయి
పట్ట బుద్ధీ కావు ఒక్క చోటా నిలవవూ
.
.
.

ప్రకృతి లీలలు అంతుబట్టవు
మనసేమో మాట వినదు...