
చీకటితో స్నేహం కుదిరింది
చెట్టపట్టాలేసుకుని సావాసం చేస్తున్నాను...
ఒకసారి పగలు నిన్ను చూడాలనిపిస్తే ఎలా అని అడిగినప్పుడు,
నీ కళ్ళు మూసుకో నీ చెంతే ఉంటాను అని చెప్పింది
పున్నమి వెన్నెల అలా ఉంటుందంట ఇలా ఉంటుందంట అని నేను చెప్పే కబుర్లు
చక్కగా వింటుంది నన్ను తన ఒడిలో పడుకోబెట్టుకుని..
ఒక రాత్రి నాకు పున్నమి వెన్నెల కావాలన్నాను.., అప్పుడు
నా తల నిమురుతూ నన్ను నిద్రపుచ్చింది
నాకు నేస్తం చెప్పనే లేదు
ఒక సాయంత్రం నా కబుర్లలోని వెన్నెలలాంటి వెన్నెల కురవడం మొదలుపెట్టింది...
నేను ఆనందాతిశయంతో అలానే చూస్తుండిపోయాను...
అది చెప్దామని చీకటిని పలకరించబోతే తను ఆందోళనతో
నా వైపు చూస్తూ దూరంగా వెళ్ళిపోతుంది...
నాకు భయం వేసింది
ఆ క్షణంలో ఏంచెయ్యాలో తెలియక...,
రెప్పలు మూసుకుని నా కన్నుల్లో చీకటికి చోటిచ్చాను...
అప్పటికే కన్నుల్లో నెలకొన్న గాఢార్ద్రత
నా చీకటి నేస్తాన్ని చిమ్మ చీకటిగా ఆవిష్కరించింది
నా నేస్తాన్ని అలా చూసి భరించలేకపోయాను
కానీ తను ఎక్కడ దూరమవుతుందేమో అని కళ్ళు తెరవలేకపోయాను...
ఎప్పుడు నిద్రపోయానో తెలియదు... కళ్ళు తెరిచేసరికి తెల్లవారింది...