
తీరైన తన నడకతొ లయబద్ధంగా సవ్వడి చేస్తున్న పట్టీలు
నా చూపుని తన వైపు మరల్చాయి...
సింధూరం, పసుపు పచ్చల పట్టు పరికిణీని మునివేళ్ళతో
కొంచెం పైకి లాగి తను కలియతిరుగుతుంది వాకిట దేని కోసమో వెతుకుతూ...
ఏదో కనుగున్నట్టు ఇంట్లోకి పరుగెట్టింది...
నేను తనకోసం ఎదురుచూడకుండా ఉండలేకపోయాను...
ముగ్గు గిన్నెతో తను బయటకొచ్చింది
పైటను నడుముకు చుట్టుకుని, పరికిణీ సర్దుకుని
ఒంటి కాలిపై భారం మోపి, కూర్చుంది ముగ్గుపెట్టటానికి...
నేను అలానే చూస్తున్నాను...
తన వేళ్ళు ఏదో మాయం చేస్తున్నట్టు
చక చకా చుక్కలు పెట్టుకుంటూ వెళ్తున్నాయి
ఆ వేగంతో చుక్కలని అనుసరించడానికి ప్రయత్నించిన నా కళ్ళు తిరిగాయి...
ఒకసారి పైకి చూసాను
నింగిలో చుక్కలు నేలపై ఆమె వేలు జారిన చుక్క చుక్కలో
పోలికలు వెతుక్కుంటు మురిసిపోతున్నాయి ఎంచక్కా...
అదే పనిగా... చంద్రుడు లేడని గుసగుసలాడుతున్నాయి
అది విని నెలరాజు మోము చిన్నబోయింది,
రోజు తనతో ఊసులాడే చిన్నది తనని ఈరోజు మరచిపోయిందని...
నేను తేరుకుని తనవైపు చూసాను
ముంగురులను పైకి పోగు చేసుకుంటూ తను పైకి లేచింది
ఒక్కసారి తనివితీర కిందకిచూసింది
తన చూపుల్ని నా చూపులు అనుసరించాయి
ఆహా... ఎంతటి అందమైన ముగ్గు...!
చంద్రుడు చిన్నబోవటంలో అర్ధం వుందనిపించింది...
ముగ్గుని చూసుకున్న ఆనందంతో తన కళ్ళు మెరిసాయి
పెదవులపై నవ్వులు విరిసాయి
ఆ నవ్వులో తడిసిన ముగ్గు ముత్యాల ముగ్గయ్యింది
ఆ ముంగిట వెలుగులు నింపింది...