ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...

వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...

Sunday, July 13, 2008

కాలపు కడలి కెరటాలు: చెంప ఛెళ్ళుమంది

పాప టీచర్ నన్ను కొడుతున్నారు అని నేను బడికెళ్ళనని ఇంట్లో ఉండిపోతే మా అమ్మ వచ్చి నా దగ్గరకి రా... నా దగ్గర ఉండి చదువుకుందువు అంది...మన ఊళ్ళో స్కూల్లో కొట్టరు అని చెప్పింది. అయినా సరే నేను రాను.. నేను చదువుకోను అన్నాను... అమ్మమ్మని వదిలి వెళ్ళడం నాకు అస్సలు ఇష్టం లేదు... కానీ పాప టీచర్ ని తలచుకుంటే భయం వేసింది...అప్పుడు అమ్మ నాతో బేరం మొదలుపెట్టింది... సెలవొస్తే నిన్ను అమ్మమ్మ దగ్గరికి పంపించేస్తాను కదా అని... అక్కడ కొట్టరు అంటుంది కదా అని ఆలోచించి ఒప్పందానికి సరే అన్నాను... ఆ తరవాత ఈ ఒప్పందం నిలబెట్టుకోవడానికి అమ్మకి చాలా కష్టమయ్యేది... తమ్ముడు నిద్రలేస్తే తను కూడా నాతో వచ్చేస్తాడని, తను ఒక్కతే ఉండాల్సి వస్తుందని, వాడు నిద్రలేవకముందే అంటే ఆరింటిలోపే నన్ను రిక్షా కట్టించి అమ్మమ్మ దగ్గరికి పంపించేది... నేను మా ఇంటికి, అక్కడ చూట్టాలకి అలవాటు అయ్యేవరకు అమ్మకి అది తప్పలేదు...మా అమ్మమ్మ వూరు, మా వూరు పక్క పక్కనే.. ఈ ఊరి పొలిమేర దాటితే ఆ ఊరు వచ్చేస్తుంది...

అలా మా వూరెళ్ళాను... అక్కడ అంతా కొత్తే... అమ్మా, నాన్న, తమ్ముడు.. చుట్టూ చుట్టాలు అందరూ కొత్తే... నన్ను మా ఊళ్ళో ఉన్న నాగార్జున పబ్లిక్ స్కూల్లో చేర్చారు... అది మా చుట్టాలదే... చుట్టు పక్క ఉన్న పది ఊళ్ళకి ఏకైక ప్రైవేట్ స్కూలు. స్కూలు ప్రిన్సిపాల్ నాకు వరసకి మావయ్య అవుతారు. నన్ను చేర్చే ముందు మా ఇంటికొచ్చారు. అప్పుడు బాగా మాట్లాడారు. స్కూల్ మొదలయింది. నేను మూడో క్లాస్లో చేరాను.

ఒక రోజు అమ్మ లంచ్ బాక్సు ఇవ్వలేదు. ఇంటెర్వేల్ లో వచ్చి తీసుకెళ్ళు అని చెప్పింది. స్కూల్ కి వెళ్ళగానే పెద్ద వర్షం పడటం మొదలుపెట్టింది. రెండు క్లాస్లు అయిపోయాయి అయినా ఇంటెర్వెల్ బెల్ కొట్టలేదు... మూడో క్లాస్కి టీచర్ రాలేదు... పిల్లలంతా గొడవ గొడవ.. నాకేమో ఒక్కటే టెన్షన్. అమ్మ ఇంటెర్వల్లో రమ్మంది... ఇంకా ఇంటెర్వెల్ బెల్ల్ కొట్టలేదు... క్లాస్లైపోతున్నాయి అని... సరే పర్మిషన్ తీసుకుని వెళ్ళొద్దాము అనుకుని దూరంగా ప్రిన్సిపల్, ఇంకో టీచర్ మాట్లాడుకుంటుంటే వాళ్ళదగ్గరకి వెళ్ళాను... వర్షం ఇంకా జోరు తగ్గలేదు... జోరుగా పడటం వల్ల స్కూల్లోకి నీళ్ళు వచ్చేసాయి... వాళ్ళు మాట్లాడుకుంటుంటే నేను సార్ అమ్మ లంచ్ బాక్స్ తెచ్చుకోవడానికి ఇంటికి రమ్మంది అన్నాను... అంతే అన్నానో లేదో మా ప్రిన్సిపాల్ నా చెంప ఛెళ్ళుమనిపించారు... నా లాగు తడిచిపోయింది... చిన్న పిళ్ళోడిని అని, చుట్టాన్నని కూడా చూడకుండా అందరి ముందూ అలా కొట్టేసారు :-( ఏడుస్తూ వెళ్ళి నా బెంచ్ మీద కుర్చున్నాను...అమ్మ మీద అప్పుడు కోపం వచ్చింది... బాక్సు పెట్టిచ్చి ఉంటే ఇలా జరిగుండేది కాదని... ఆ తరవాత ఇక్కడ కొట్టరు అని చెప్పింది... కొట్టేసారని.. :-( అసలు అలా పాప టీచర్ కూడా కొట్టలేదు మరి..

కొంచెం సేపాగి స్కూల్కి సెలవు అన్నారు..! ఇంటికెళ్ళి భోంచేసాను...

అంతే అప్పటి నుండి తరవాత కొన్ని సంవత్సరాల వరకు ఎవరైనా పెద్ద వాళ్ళు మాట్లాడుకుంటుంటే వెళ్ళి కదిలించాలంటే చాలా ఆలోచించేవాడిని...

తలచుకున్న ప్రతీ సారి నా అప్పటి అమాయకత్వం నాకు నవ్వు తెప్పిస్తుంది...

ఎప్పుడైనా మీ తప్పులేదు అనిపించించినా మీ చెంప ఛెళ్ళుమందా?

9 comments:

నిషిగంధ said...

తప్పు లేకుండా చెంప ఛెళ్ళుమనడమా! O yea, మనకి అనుభవమే అది.. ఏడో క్లాస్ కామన్ పరీక్షలు జరిగే టైం అది.. ఆ వారం మన షెడ్యూల్ బాధ్యత అంతా మా నాన్న గారు తీసుకున్నారు.. పరీక్ష పొద్దున్న పూట ఉండేది.. మధ్యాహ్నం ఇంటికి రాగానే అన్నం పెట్టి, కాసేపు నిద్రపోమ్మని లేచిన తర్వాత దగ్గరుండి చదివించేవారు.. ఒకరోజు మా పిన్ని వచ్చిందని తెలిసి పడుకుని లేవగానే పక్కనే ఉన్న అమ్మమ్మ ఇంటికి వెళ్ళాను. మా పిన్నేమో వంట్లో బాలేదని ఏవో టాబ్లెట్స్ తెమ్మని డబ్బులు, చీటీ ఇచ్చింది.. పక్కనే కదా మెడికల్ షాప్ అని మనం గెంతుకుంటూ వెళ్ళాం.. వాడేమో అక్కడా టాబ్లెట్లు లేవన్నాడు.. సరే రెండు సందుల అవతల ఇంకో షాపుంది కదా అని అవే గెంతులు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాను.. అక్కడ దొరికాయి కానీ వాడు ఎవరితోనో మాట్లాడుతూ చాలా ఆలస్యం చేశేసాడు.. అవి తీసుకెళ్ళి మా పిన్నికిచ్చేసి నా పనితనాన్ని నాన్నకి చెప్పాలని హుషారుగా "నాన్నా" అని అరుస్తూ ఇంట్లోకి అడుగుపెట్టాను.. మరు నిమిషం నా చెంప పేలిపోయింది!! ఒక 2,3 నిమిషాలు అంతా చీకటి.. "రేపొద్దున్న పరీక్ష పెట్టుకుని ఎక్కడ పెత్తనాలు చేసొస్తున్నావ్?" అని అడుగుతుంటే నాకైతే ఉక్రోషంతో ఏడుపు కూడా రాలేదు.. మాట్లాడకుండా వెళ్ళి పుస్తకాల ముందు కూర్చున్నాను.. తర్వాత విషయం తెలిసి నాన్న చాలా బుజ్జగించారు.. సమయము, దాని ఆవశ్యకత గురించి దశలవారీగా ఉపన్యాసాలు ఇచ్చారు..

కొసమెరుపు ఏంటంటే ఆ సంవత్సరం కామన్ ఎగ్జాం లో స్కూల్ ఫస్ట్ వచ్చాను.. అలానే NTR merit scholarship (rs. 750/year for 3 years) వచ్చింది..

మొత్తానికి నీ చెంపదెబ్బ నాతో ఒక టపా సైజ్ కామెంట్ రాయించింది :))

Kranthi M said...

దిలీప్ గారు,
చిన్నప్పుడు ట్యూసన్‍లో మా సారు వారు వాళ్ళావిడ ఎప్పుడూ గొడవ పడేవారు.ఇక తరువాత స౦గతి చెప్పాల౦టారా???హ హ హ.ఎన్ని సార్లు పేలి౦దో నా చె౦ప నా తప్పు లేకు౦డా లెక్కలేదు.బాగు౦ది చాలా బాగా రాసారు.

http://srushti-myownworld.blogspot.com

Purnima said...

టపాని అలా ప్రశ్నతో ముగిస్తే.. ఇదో ఇలా "టపా" అనేంత వ్యాఖ్యలు చదువుకోవాల్సి వస్తుంది. నా స్వగతంలో రెండూ వేరు వేరుగా జరిగాయి:

చెంపచెల్లుమన్న సంఘటన: నేనూ కే,జీలో ఉండగా.. పీ.జీలో ఉన్న అబ్బాయి నన్ను ఊరికే ఏడిపించేవాడు. ఎంత కాదనుకున్నా కోపం, ఉక్రోషం వచ్చేవి. చీటికి మాటికి నన్ను "కోతి" అనేవాడు.. తిక్కరేగేది. అయినా చాలా మర్యాదగా చెప్పా అలా అనద్దు అని. మరలా బెదిరించా.. "మా నాన్నకి నీ పేరు చెప్తానుండు" అని. ఒకరోజు మా నాన్న, నేనూ కొట్టుకి వెళ్ళి వెళ్ళి వస్తుండుగా.. మా నాన్న ముందే అలా పిలిచాడు.. మా నాన్న పట్టించుకోలేదు.. నాకు మాత్రం మండిపోయింది. చిర్రెత్తుకొచ్చి.. చేతిలో ఉన్న డబ్బాలో ఒక గుడ్డు తీసి కొట్టాను. ఈ విపరీత రియాక్షన్ కి అందరితో పాటు నేనూ ఉలిక్కిపడ్డా!! మా నాన్నకి నాకన్నా మండిపోయింది.. నా చెంప చెల్లుమంది. అదే మొదటిసారి.. ఇప్పటిదాక.. చివరి సారి, ఎవరినుండైనా!!

చేయని తప్పుకు శిక్ష: నేను ఒకటో తరగతిలో ఉండగా.. మా సైన్స్ టీచరు.. వారంలో ఒకరోజు మా నోట్స్ కరెక్ట్ చేసేవారు. ఆవిడ కూర్చిలో కూర్చుని ఉండగా.. రెండేసి బెంచీల్లో అమ్మాయిలు.. ఎడమ చేతి వైపు.. కుడి చేతి వైపు.. రెండు క్యూలు కట్టాలి.. ముగ్గురేసి చొప్పున. అలా ఒక క్యూలో నేను నిలుచున్నా.. మొదటిగా!! అవతలి లైన్లో అమ్మాయి నోట్స్ కరెక్ట్ చేస్తున్నారావిడ.. ఆ పిల్ల ఎదో తప్పు రాసింది.. ఖాళీగా నా వైపు చేయి ఉంది కావున.. నా చెవి.. ఊ..హూ.. మెలిపెట్టలేదు, పదునైన గోర్లతో గిల్లారు. కాస్త ముక్క.. బోలెడు రక్తం వచ్చాయి. ఆవిడకదే అలవాటు.. చెవి గిచ్చడం!! ఎంత జాగ్రత్తగా ఉండేదాన్నో.. అయినా నా వాటా నాకిచ్చేసారు. ఇది తెలిసిన మా నాన్నను ఆపడం మా ప్రిన్సిపల్ తరం కూడా కాలేదు. ఈ సంఘటన తర్వాత ఆవిడ చాలా తగ్గించేసారు అని విన్నా.. నిజం తెలియలేదు.

ఒక్కసారిగా నన్ను మా పాత ఇంట్లో, స్కూల్లో తిప్పినందుకు.. థాంక్స్!!

Anonymous said...

anna garu

ఏకాంతపు దిలీప్ said...

@ నిషిగంధ గారు
భలే రాసారు... "అవే గెంతులు కంటిన్యూ చేసుకుంటూ.." :-) మీరు కూడా ఏడో క్లాస్ కామన్ పరీక్షల్లో టాపరేనా? :-)

మా ప్రిన్సిపల్ నన్ను కొట్టినప్పుడు నాక్కూడా అలాంటి ఉక్రోషమే కలిగింది...
ఇలానే మీరు మీ జ్ఞాపకాలని పంచుకుంటానంటే నావీ రాస్తూనే ఉంటా..

ఏకాంతపు దిలీప్ said...

@ క్రాంతి

పాపం... నాక్కూడా ట్యూషన్ టీచర్తో ఇబ్బంది ఎదురయ్యింది... అది గుర్తొచ్చింది ఇప్పుడు... అసలు చిన్నప్పటి నుండీ మనకి ట్యూషన్లు అలవాటు లేదు... ఎనిమిదో క్లాస్లో అనుకుంట ఇంగ్లీష్ గ్రామర్, మోరల్ సైన్స్ చెప్పడానికి ఒకావిడ వచ్చారు... ఆవిడ చిన్నావిడే... క్లాస్ అంటటిని ఫ్రెంద్స్ చేసుకున్నారు... తరవాత మెల్లగా కొంత మందిని తన దగ్గర ట్యూషన్ చేర్పించుకున్నారు.... వాళ్ళ చేత మిగిలిన వాళ్ళని కూడా.. అలా నాకు అవసరం లేదు అనిపించినా క్లాస్లొ చాలా మంది వెల్తున్నారు, అడుగుతున్నారు కదా అని సరే అని వెళ్ళాను.... అంతా వెళ్ళి, నేను వెళ్ళకపోతే నా మీద ఎక్కడ కోపం తెచ్చుకుంటుందొ.. ఎందుకులే అని... ఆవిడ క్లాసుల్లో పెద్ద చెప్పేదేమీ ఉండేది కాదు... గొడవ గొడవగా ఉండేది... మా స్కూలు అసలు విహార యాత్రలకి తీసుకెళ్ళదు... అలా మొహం వాసిపోయిన కొంతమందికి ఈవిడ కనపడ్డారు... మరి ఎవరు ముందన్నారో తెలియదు కానీ... ఆవిడ మమ్మల్ని అమరావతి తీసుకెళ్ళడానికి సిద్ధమైపోయారు.... డబ్బులు వసూలైపోయాయి... అమరావతి వెళ్ళాము... ఇక్కడ చెప్పుకోవాల్సిందేంటంటే ఆవిడతో పాటూ వాళ్ళ అన్న కొడుకులని కూడా తీసుకొచారు... వాళ్ళు చిచ్చర పిడుగులు... చెప్పింది చెయ్యరు... గుడిలొ దర్శనం చేసుకుని ఆ ప్రాంగణంలో కూర్చున్నాము... ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి... గుడికి ఇటువైపు అన్నీ చూసేసి, కృష్ణ పడవలో దాటి అక్కద తోటల్లోకి వెల్దామనుకున్నాము... అంతా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాము... అప్పటికే ఆ బుడ్డోళ్ళు గొడవ చేస్తున్నారు... చెప్పిన వినడం లేదు... గుడి బయట ఆడుతూ ఒకడికి చిన్న దెబ్బ తగిలింది... కొంచెం చర్మం గీసుకుపోయింది... అంతే వాడికి అలా అయిందని.... మా యాత్ర మొత్తం అక్కడితో ఆపేసి మమ్మల్ని అంతా ఆవిడ తిరిగి బస్ ఎక్కించేసారు... :( మా ఉత్సాహమంతా నీరుగారిపోయింది... తరవాత అనుకున్నాము ఆవిడకి వసూలు చేసి ఇచ్చిన డబ్బు అంతా వృధా అయిపోయినట్టే అని...

ఏకాంతపు దిలీప్ said...

@ పూర్ణిమ
చిన్నప్పుడే అంత పెద్ద వాడిని గుడ్డుతో కొట్టావా.. అసలు గుడ్డుతో కొట్టాలన్న ఆలోచన ఎలా వచ్చిందో? అసలు నాకు ఆ వయసులో మామూలుగా కొట్టడమే వచ్చి ఉండేది కాదేమో.. ఇప్పుడు కూడా అంతేనా? :-)

నిన్ను గిల్లిన ఆవిడెవరో మా పాప టీచర్ గారి లాంటావిడేమో... మరీ అంత భయంకరంగానా?! నాకైతే చిన్నప్పుడు కొంత మంది టీచర్లని చూస్తుంటే అసలు వాళ్ళు హింసించడానికే పాఠాలు చెప్తారేమో అనిపించేది... మాకు హై స్కూల్లో ఒకాయన ఉండేవారు... ఆయన ఊత పదం "అక్కు పక్షి"... ఎవడైనా అడిగింది చెప్పకపోతే అదొకరకమైన నవ్వుతో దగ్గరకొచ్చి కంఫర్ట్ పెన్(దానికి ఆరు సైడ్లు ఉంటాయి కదా) ని వేళ్ళ సంధులు మధ్య పెట్టి వేళ్ళని నొక్కుతూ ఆ పెన్ ని తిప్పుతూ అక్కు పక్షీ అనే వాళ్ళు.... ఆ బాధ ఉంటుంది చూడూ... వర్ణనాతీతం... ఎక్కడున్నరో ఇప్పుడు...

నీ జ్ఞాపకాలు పంచుకున్నందుకు థాంక్స్... :-)

ఏకాంతపు దిలీప్ said...

@ Anonymous
ఎవరు ఈ తమ్ముడు గారు? :-)

వేణూశ్రీకాంత్ said...

బాగుంది దీపూ...మీ టపా మరియూ దానికి టపా లాంటి వ్యాఖ్యలు :-) అన్ని జ్ఞాపకాలు చదవడం బావుంది.