ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...

వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...

Tuesday, July 22, 2008

కాలపు కడలి కెరటాలు: జ్ఞాపకాలు

ఏంటి! నే ఎక్కడికెళ్తే అక్కడికొస్తున్నావు? అని
చందమామని ప్రశ్నిస్తూ కోప్పడ్డాను
ఆ అమాయకత్వం ఒక జ్ఞాపకం

గాల్లో గెంతుతూ ఎగురుతూ కిందపడి
తగిలించుకున్న గాయాన్ని భరించలేకపోయాను
ఆ నొప్పి ఒక జ్ఞాపకం

ఊహల్లో ఊరేగుతూ ఏగుతూ ఒక్కసారిగా
నిజాన్ని ఢీకొట్టి నిలవలేకపోయాను
ఆ అదురు ఒక జ్ఞాపకం

పంచుకుని పెంచుకున్న బంధం స్నేహంగా
వికసించినప్పుడు పులకించిపోయాను
ఆ పరవశం ఒక జ్ఞాపకం

దగ్గర తీసుకున్న స్నేహం నా విశ్వాసాన్ని
వెక్కిరించినప్పుడు తట్టుకోలేకపోయాను
ఆ నిర్వేదం ఒక జ్ఞాపకం

సాధించి ముందడుగు వేసి అందరి మన్ననలు
పొందుతున్నప్పుడు ఉబ్బిపోయాను
ఆ విజయగర్వం ఒక జ్ఞాపకం

ఒక్కో అనుభవం నన్ను నాకు పరిచయం చేస్తూ
జ్ఞాపకాలుగా నిక్షిప్తమవుతున్నాయి
గుర్తొచ్చిన ప్రతీ సారీ నాకు ఏదొకటి బోధిస్తున్నాయి
అవి గుర్తొచ్చిన ఈసారి...
నన్ను ప్రశ్నించే క్షణంతో అనుబంధం అవివేకమని
ఆ క్షణాన్ని ప్రశ్నించకుండా సాగిపోనివ్వాలని
ఆ క్షణం నాలో పలికే రాగమే నా జీవనపు సంగీతం కాదని... చెప్తున్నాయి...

10 comments:

మోహన said...

నన్ను ప్రశ్నించే క్షణంతో అనుబంధం అవివేకమని
ఆ క్షణాన్ని ప్రశ్నించకుండా సాగిపోనివ్వాలని
ఆ క్షణం నాలో పలికే రాగమే నా జీవనపు సంగీతం కాదని... చెప్తున్నాయి...

I am confused! :)

ఏకాంతపు దిలీప్ said...

గుర్తొచ్చిన ఈసారి ఏమి బోధించాయి అంటే...
నిన్ను తీవ్రంగా బాధ పెడుతున్న/సంతోష పెడుతున్న ఈ క్షణాన్ని ప్రశ్నించకు, ఈ క్షణంతో attachment అవివేకము, ఈ క్షణం నీలో పలికిస్తున్న ఈ బాధ శాశ్వతం కాదు, అదొక్కటే నీ జీవనపు రాగం కాదు... ఆ క్షణాన్ని అలా సాగిపోనివ్వు అని...

రాధిక said...

నిజమే దిలీప్ ఏ భావమైనా అనుభవి0చేసాకా అదొక జ్ఞాపకమే.జ్ఞాపకాలన్నీ ఆన0దాల్నే మిగల్ఛాలని లేదు.ఒకప్పటి బాధలన్నీ ఇప్పటికీ భార0గా అనిపి0చాలనీ లేదు.అనుభవాలు ఎన్ని పాఠాలు నేర్పి ఏమిటి ప్రయోజన0?అవి జ్ఞాపకాలై మనల్ని నిర0తర0 ప్రశ్ని0చకపోతే?

చాలా బాగా రాసారు.ఇక చివరి లైన్ల దగ్గరకి వస్తె నాకు ఎదొ కొద్దిగా అర్ధ0 అయిన్ది.కానీ పక్కవాళ్ళకి వివరి0చి చెప్పేఅ0త క్లారిటీ ప్రస్తుత0 నా భావాలకి లేదు.

Purnima said...

నన్ను ప్రశ్నించే క్షణంతో అనుబంధం అవివేకమని
ఆ క్షణాన్ని ప్రశ్నించకుండా సాగిపోనివ్వాలని
ఆ క్షణం నాలో పలికే రాగమే నా జీవనపు సంగీతం కాదని... చెప్తున్నాయి...

You got your lesson.. just too perfectly!! Happy for you. :-)

jeevana sangeetaani ki bolEDanni raagaalu kalavaali... E okka daggarO aagakooDadu.

కల said...

మీరు చెప్పింది నిజమే కదా, జ్ఞాపకాలన్నీ మనకు ఏదో ఒకటి నేర్పుతూనే ఉంటాయి.
ఇలా నేర్పేవాటిని జ్ఞాపకాలు అనడం కన్నా అనుభవాలు అనడం కరెక్టేమో?
నను కలవర పెడుతున్న క్షణంతో అనుబంధమా?
లేక నను కలవరపెడుతున్న వ్యక్తి తో అనుబంధమా?
దేనితో అనుభంధం తెంచుకోవాలి?
క్షణంతో అనుబంధం అస్సలు కుదురుతుందా?
మనతో ఉన్న వ్యక్తితో అనుబంధం కుదురుతుందేమో?
ఆ అనుబంధం కుదిరిన క్షణాన్ని అపురూపంగా దాచుకొంటామేమో కానీ ప్రశ్నించవేమో?
లేక ఆ అనుబంధం మిగిల్చిన శిలాక్షరాలని కూడా భధ్రపరుచుకుంటావేమో?
ఏమో ఇన్ని సందేహాలని మిగిల్చింది మీ కవిత :-)

ప్రతాప్ said...

దిలీప్-కలా,
ఏంటో ఇద్దరూ confuse చేసేసారు :-(

Srividya said...

చాలా బాగా రాసారు. ఇలాంటి భావాల్ని భాషలోకి అనువదించడం చాలా కష్టం. ప్రతీ క్షణాన్ని ప్రశ్నించి ఏదో నేర్చేసుకోవాలనే తాపత్రయం కంటే, దాన్ని ఆస్వాదించి, అనుభవించి దాని అంతట అది జ్ఞాపకంగా మారి మనసులో చెరగని పాఠమయ్యేవరకు వేచి వుండటం ఉత్తమం.

Bolloju Baba said...

ప్రతాప్ తమ్ముడూ
అంతే అంతే
సరదాగా.

కవిత బాగుంది.
బొల్లోజు బాబా

ఏకాంతపు దిలీప్ said...

@ కల
@ ప్రతాప్
ఒక్కోసారి ఈ క్షణం ఇలానే ఎందుకు జరుగుతుందని? ఆ క్షణం అలానే ఎందుకు జరిగిందని... ఆ క్షణాలు బాధని, ఇంకేదైనా భరించలేని భావాలని మిగిల్చినప్పుడు ప్రశ్నిస్తుంటాము... ఒక్కో క్షణం మనకి అంతా అగమ్యగోచరం అనేట్టు చేస్తుంది, ఒక్కో క్షణం అసలు జీవితం ఇంక ఇంతే అనేట్టు అనిపిస్తుంది... నేను అనుబంధం అని రాసినప్పుడు, పై చెప్పినట్టు ఆ క్షణంతో లేక ఆ క్షణం మిగిలిచిన భావాలతో అటాచ్మెంట్ అని నా ఉద్దేశం...

ఏకాంతపు దిలీప్ said...

@ రాధిక గారు
"ఒకప్పటి బాధలన్నీ ఇప్పటికీ భార0గా అనిపి0చాలనీ లేదు."
అవునండి... ఆ క్షణంలో భరించలేనట్టు అనిపించినవి, ఆ రోజు గడిస్తే అసలు సమస్యే అనిపించదు... కొన్నైతే మనల్ని వెంటాడుతూనే ఉంటాయి, వాటికి మనం ఏ విధంగా స్పందిస్తున్నామో అనే దాన్ని బట్టి అది ఇంకా భారం అనిపిస్తుందా లెదా అని అధారపడి ఉంటుంది...

@ శ్రీవిద్య
నేను ఏదైతే ఉద్దేశంతో రాసానో, దాన్ని కనీసం ఒక్కరు పోల్చుకోగలిగినా ఆ ఆనందమే వేరు :-) మీకు నెనర్లు...

@ బాబా గారు
నెనర్లు :-)