ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...

వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...

Friday, May 8, 2009

ఏకాంత పథం

సూర్యుని ప్రతాపం చీకటి పడినా ఇంకా వీస్తున్న గాలిలో కనిపిస్తుంది
రాత్రి తన ప్రయత్నం తను చేస్తూ చల్లదనాన్ని మోసుకొస్తుంది...

తీరిక తెచ్చుకున్న నేను అడుగులేస్తున్నాను
ఏకాంత పథంలో...

.

.

ఒక్కరినే కన్న తల్లి ఊగుడు బల్లకి ఒక వైపుండి
తన బిడ్డకి తోబుట్టువు లోటుని భర్తీ చేయడానికి ప్రయత్నిస్తుంది....
.

తలపండిన ఇద్దరు పెద్దవాళ్ళు కాలాన్ని వెళ్ళదీస్తున్నారు,
ఒకరు రెండేళ్ళ మనవడిని ఉయ్యాలెక్కించి ఊపుతున్నారు...
మా ఊళ్ళో అయితే ఆ వయసువాళ్ళకి ముని మనవళ్ళు నడవడానికి ఊతంగా వస్తారు
.

ఒక అమ్మాయి, ఒక అబ్బాయి
వాళ్ళ స్కూలు స్నేహితుల గురించి మాట్లాడుకుంటున్నారు
ఈ స్నేహాన్ని ఎప్పటి వరకు నిలుపుకుంటారో...?
.

ఒక జంట... నడుస్తున్నారు...
ఎప్పుడూ చీరలో కనపడే ఆవిడ ఈరోజు చుడిదార్లో ఉంది
... ఆవిడ నడుస్తూ కబుర్లు చెప్పేస్తుంది...
ఆయన ఊ కొడుతున్నాడు... వాళ్ళిద్దరూ మేమిద్దరం ఒక జట్టు అన్నట్టుంటారు...
ఆఫీసు నుండి రాగానే వాళ్ళు చేసే మొదటి పని నడక,నడుస్తూ కబుర్లు
పని ఒత్తిడికి మంచి ఉపాయం కదా...!
.

నాలుగేళ్ళున్న ఇద్దరు పాపలు...
ఒక పాప జారుడు బల్ల దిగి, ఎవరు గెలుస్తారో చూద్దాము అంటూ పరుగెడుతుంది
ఇంకో పాప పరుగందుకోలేకపోతే, వెనక్కెళ్ళి చేయి పట్టుకుని తనతో పాటు పరుగెట్టిస్తుంది...
.

ఇద్దరు ఆరుపదులు దాటిన ఆడవాళ్ళు
పిల్లలు కనడం గురించి మాట్లాడుకుంటున్నారు...
ఇప్పటికి ఎంత జీవితాన్ని చూసుంటారో... అయినా కొత్త విషయం లానే! అంతే ఆసక్తితో!
.

ఇంకో పెద్దాయన,
వంగీ వంగలేక వాటర్ ట్యూబుని ఎత్తబోతున్నాడు ఇంకో పక్క తడపడానికి
అసంకల్పితంగానే ఆ ట్యూబుని ఎత్తి పక్కన పెట్టాను
.

నడచి అలసిన "ఆ జట్టు" బెంచి మీద కుర్చుంది...
ఇప్పుడు ఆయన కూడా కబుర్లు చెప్తున్నాడు
ఆవిడ కూడా ఊ కొడుతుంది
వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళ పాప
.

ఎంత నడిచినా నా కాళ్ళు అలసిపోవు
నడిచీ నడిచీ నా మనసు అలసిపోతుంది
అది అలసిన మరు క్షణం, ఒక్క అడుగూ ముందుకు పడదు...

నడుస్తూ...

.
.
.

దూరంగా ప్రతి పది నిమిషాలకి పైపైకి ఎదుగుతున్న పెద్ద చందమామ
పచ్చగా జ్వరం వచ్చినట్టు... నాలా ఒంటరిగా...

.
.
.

అమ్మ ఫోన్ చేసింది...
ఎంత సేపు మాట్లాడాను? 54 నిముషాలు...

.

నడుస్తూనే ఉన్నాను

.

దూరంగా చందమామ... ఇంకా పైన...చిన్నగా
ఇప్పుడు తెల్లగా మెరుస్తూ!

14 comments:

YaminiCR said...

ఒక మంచి దృశ్యకావ్యం...

Hima bindu said...

గాడమైన నిట్టుర్పూ ......నా ప్రమేయంలేకుండా ......గుడ్ ,

రాధిక said...

అవును అందమైన దృశ్యకావ్యం.మొదలు పెట్టిన తీరు చాలా బాగుంది.తరువాత అలా చదువుకుంటూ వెళ్ళిపోయాను.మధ్య మధ్య అరే ఇది బాగుందే అనిపించేలా కొన్ని చిత్రాలు.చూసిన ప్రతి సన్నివేశానికీ మీ మాటల ముగింపు ఇవ్వడం చాలా బాగుంది.

పరిమళం said...

దిలీప్ గారూ !
"ఒక్కరినే కన్న తల్లి ఊగుడు బల్లకి ఒక వైపుండి
తన బిడ్డకి తోబుట్టువు లోటుని భర్తీ చేయడానికి ప్రయత్నిస్తుంది"
ఎంత చక్కటి భావన ! అంతా....మీరు రాసినదంతా ....
నా కళ్ళ ముందే జరిగినట్టు ....ఓహ్ ....
అమ్మతో 54 నిముషాలు ...:) :)
మా అమ్మతో నా ఫోన్ సంభాషణ గుర్తొచ్చింది ...

మరువం ఉష said...

మీ దృశ్య కావ్యంలోని పాత్రలన్ని నాకూ అగపడతాయి కానీ మా వూర్లో చందమామ పచ్చగా కానరాడు, ఒకరకమైన ఎరుపు వర్ణంలో, ఎవరి మీదనో కినుక వహించినట్లో, లేదా ఎవరి చేతో వొళ్ళంతా ఎర్రగా కందేలా దెబ్బలు తిన్నట్లుగానో అనిపిస్తాడు. నా విధి మీద నేను అలిగినట్లో, లేదా ఆ విధి చేతిలో నేను దెబ్బలు తిన్నట్లుగానో.

కొసమెరుపు బాగుంది, అమ్మ, ఆమెతో సంభాషణ, ఆ అనుభూతి నేనూ చవిచూసాను, రెండు పాత్రల్లోనూ.

Bolloju Baba said...

మంచి పరిశీలనలు ఉన్నాయి. మీ నిశిత దృష్టికి జయహో.

౧.ఒక్కరినే కన్న తల్లి ఊగుడు బల్లకి ఒక వైపుండి
తన బిడ్డకి తోబుట్టువు లోటుని భర్తీ చేయడానికి ప్రయత్నిస్తుంది....
అంతే కదా. ప్రస్తుతం, ఒక్కరు చాలులే, ఇద్దరైతే మజ్జిగపలుచపడుతుందనో, లేక పురుడు వీనింగ్ వంటి గ్రేట్ ఆర్డియేల్ ని ఎవరు భరించగలరు (ఉమ్మడి కుటుంబాలు కావుకదా)అనే ఆలోచనలు మొత్తానికి ఒకే సంతానానికి కుటుంబాలు పరిమితమైపోయేలా చేస్తున్నాయి. అలాంటి వారికి ఇలాంటి పరిస్థితి తప్పదన్న సూచన .... బాగుంది.

౨.మా ఊళ్ళో అయితే ఆ వయసువాళ్ళకి ముని మనవళ్ళు నడవడానికి ఊతంగా వస్తారు. వివాహ వయస్సు పెరగటం వలన తాత అవ్వటానికే అరవై ఏళ్లు దాటుతుంది ఇప్పుడు. ఇప్పటి తరాల్లో ముత్తాతలు అయ్యే అవకాశాలు రాను రాను తగ్గిపోతున్నాయి.


౩.ఈ స్నేహాన్ని ఎప్పటి వరకు నిలుపుకుంటారో...?
ఇలాంటి సీన్లు చూస్తే నాకూ అలాంటి అనుమానాలే వస్తూంటాయి.

౪.ఈరోజు చుడిదార్లో ఉంది
ఇన్ గుడ్ స్పిరిట్స్ అన్నమాట. అందుకే ఆమే మాట్లాడుతూంది.

౫ఇంకో పాప పరుగందుకోలేకపోతే, వెనక్కెళ్ళి చేయి పట్టుకుని తనతో పాటు పరుగెట్టిస్తుంది...

అసంకల్పితంగానే ఆ ట్యూబుని ఎత్తి పక్కన పెట్టాను

పై రెండు వాక్యాల్లో కల్మషంలేని ఆ పాపా, నిస్వార్ధంగా ప్రవర్తించే కవీ ఒక్కలాగే అనిపించారు.

౬.వాళ్ళిద్దరి మధ్యలో వాళ్ళ పాప--?? అప్పుడే పుట్టేసిందా?? :-)))

అమ్మ ఫోన్ చేసింది...
ఎంత సేపు మాట్లాడాను? 54 నిముషాలు...
పరవాలేదు. ఓమాదిరిగా మాట్లాడు కున్నారన్నమాట.. :-౦

మొత్తంమీద కవిత మంచి దృశ్యాల్ని ఆవిష్కరించింది. ఆనందాన్నిచ్చింది.

బొల్లోజు బాబా

శేఖర్ పెద్దగోపు said...

"ఒక్కరినే కన్న తల్లి ఊగుడు బల్లకి ఒక వైపుండి
తన బిడ్డకి తోబుట్టువు లోటుని భర్తీ చేయడానికి ప్రయత్నిస్తుంది" భలే నచ్చింది ఈ లైన్.

చాలా బాగుంది మీ దృశ్యకావ్యం.

నిషిగంధ said...

"ఒక్కరినే కన్న తల్లి "..
ఒక ఆహ్లాదకరమైన దృశ్యంలో అకస్మాత్తుగా రంగుల గాఢత ఎక్కువైనట్లుంది..

"ఓ తల్లి ఊగుడు బల్లకి మరో వైపుండి
తన బిడ్డకి తోబుట్టువు లోటుని భర్తీ చేయడానికి ప్రయత్నిస్తుంది...."

కేవలం నా అభిప్రాయం.. :-)


"నాలుగేళ్ళున్న ఇద్దరు పాపలు...
ఒక పాప జారుడు బల్ల దిగి, ఎవరు గెలుస్తారో చూద్దాము అంటూ పరుగెడుతుంది
ఇంకో పాప పరుగందుకోలేకపోతే, వెనక్కెళ్ళి చేయి పట్టుకుని తనతో పాటు పరుగెట్టిస్తుంది..."

just beautiful!

మోహన said...

Nice capture.

ఏకాంతపు దిలీప్ said...

భర్తీ చేయలేని లోటు కలగడం వల్ల 8 రోజులుగా బ్లాగు చూసుకోలేకపోయాను. వ్యాఖ్యానించిన అందరికి నెనర్లు..

కెక్యూబ్ వర్మ said...

దృశ్య కావ్యం

ఓ చిన్నోడు said...

తొమ్మిది ఆర్లు సీన్ బావుంది అన్నిటికంటే

హను said...

nice, chala bagumdi mee visleshana, nice,
naku telugu bloggerlo naa blog ela add cheyyalo teliyatam ledu akkada blog cherchamdi daggara kottina kuda raava tam ledu, meeru komcham cheppara pls

నేస్తం said...

ఆలస్యం గా చూసాను మీ పోస్ట్ చదివాకా మన్సంతా హాయిగా అనిపించింది