ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...

వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...

Saturday, April 17, 2010

నెలవంక


నేల వంక చూపులు
నిట్టూర్పుకి ఆనవాలు

జీవన సాగరంలో
ఆశా నిరాశల
ధ్యాస అడియాసల ఆటు పోట్లు
ఏకాంత నౌకని ఓలలాడిస్తుంటాయి
వెన్నెల తీరాలని ఎండమావులు చేస్తూ

పున్నమి సమీపిస్తున్న కొద్దీ
ఆ ఆటు పోట్ల చెలగాటం ఉధృతమవుతుంది
ఏకాంతరంగాల్లో అలజడి తీవ్రమవుతుంది
అయినా ఆశల దిక్సూచి పని చేస్తూనే ఉంటుంది
వెన్నెల తీరాన్ని అన్వేషిస్తూ నౌక సాగుతూనే ఉంటుంది

అవును
నేల వంక చూపులు
నిట్టూర్పుకి ఆనవాలు

ఆశని శ్వాసించుకుని
చూపులు నింగిలోకి
అదిగో నవ్వుతూ నెలవంక

7 comments:

రాధిక said...

బావుందండి దీపు గారూ.నేలవంక చూపులా... సరే :)
"ధ్యాస అడియాసల" అన్నది ప్రాసకోసం రాసారా? ఆ ఒక్కటీ కొద్దిగా చదవడానికి అందులో ఇమిడినట్టు లేదు కానీ భావపరం గా సరిపోతుంది.

పద్మ said...

చాలా బావుంది. పున్నమి సమీపిస్తున్న కొద్దీ ... ఆ పేరా చాలా బావుంది. :)

నేల వంక, దిక్కుల వంక చూస్తే నెలవంక కూడా దక్కదు. సాహసం చేసి ఆ నింగిలోకి దూసుకెళ్ళారా, ఏ వంకా లేని నిండు జాబిల్లి మీ సొంతం అవుతుంది. :)

ఏకాంతపు దిలీప్ said...

@రాధిక గారు
ఆశా నిరాశలు ఆలోచనల వరకే..
ధ్యాస పెట్టినప్పుడే ఆశ నిజమవకపోతే అడియాస కాగలదు. ధ్యాస పెట్టని ఆశకి అడియాస అయ్యే అర్హత ఉండదు. అందుకే ఆ వరస కూడా వుంచాలనిపించింది. :)

ఏకాంతపు దిలీప్ said...

@పద్మ గారు
థాంక్స్ అలాట్. మీరు చెప్పిన దానిలో నేను గుర్తించుకోవాల్సిన విషయం ఉంది. :)

మోహన said...

:) Beautiful

రవి said...

చాలా బావుంది.

ఏకాంతపు దిలీప్ said...

@రవి గారు, నెనర్లు