ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...

వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...

Friday, June 18, 2010

శూన్యత

మేఘ మాల పరుగులు తీస్తుంది
వాటి వెనక తారలూ తళుక్కుమంటున్నాయి
నెలవంక అంత నిండుగా ఉంది ఏంటో!
ఆకు ఆకు మాట్లాడుకోటానికి చిరుగాలి సాయం చేస్తుంది
ప్రశాంతత అంతా ఆవరించి ఉంది
మాములుగా అయితే ఈ బాహ్య స్థితి నాలో ఓ భావ ప్రపంచాన్నే సృష్టిస్తుంది
కానీ ఇప్పుడేంటి?
పట్టుకుందామంటే ఒక్క ఆలోచన లేదు!
గడచిన క్షణం ఏం పలికించింది నాలో?
ఈ క్షణం? ఏమీ లేదు
అంతా శూన్యం

Monday, June 14, 2010

అమ్మమ్మ

నాకు గుర్తే లేదు
నువ్వే అమ్మవి మమ్మీ అమ్మ కాదు అన్నానంట
కానీ మమ్మీని అమ్మని ఒప్పుకోడానికి ఎన్నేళ్ళు పట్టిందో
నాకింకా గుర్తే

నా చిట్టి చేతులు నీ కోసం ఎన్ని పనులు చెయ్యాలనుకునేవి
పొయ్యిలో పుల్లల్ని, రోటిలో పిండిని ఎగతోయడం
నీళ్ళు పట్టడం, పిడకలు చెయ్యడం
నువ్వు ఏం చేస్తే అదీ నేనూ

మనింటికి కొత్తవాళ్ళెవరు వచ్చినా నా చోటు నీ కొంగు చాటే
ఆడి ఆడి పరుగున వచ్చి నీ ఓడిలో ముడుచుకుని ఒదిగిపోయేవాడిని
నువ్వు తల నిమురుతుంటే అలసట మాయమయ్యేది
నీ ఒడి వాసన నాకింకా గుర్తే అమ్మా

ఆరుబయట నులకమంచమ్మీద నక్షత్రాలని లెక్కబెడుతూ
సమాధానాలు తెలియని ప్రశ్నలెన్ని ఉన్నా
నీ మీద చేయి వేసుకుని పడుకున్న అప్పటి కన్నా
భద్రంగా నేనెప్పుడైనా ఉన్నానా?

నీ మాటల్లో ఎంత ఆపేక్ష నా గురించి చెప్పేప్పుడు
వీడికి నేనే లెక్కలు నేర్పించానని
వీడిని నేనే కాపాడుకున్నానని
వీడు నా పక్కలోనే పడుకుంటాడు అని

నువ్వు జబ్బు పడి ఎముకలైపోయినప్పుడు నిను చూడటానికి వచ్చాను
నను చూడగానే రా నా పక్కన పడుకో అన్నావు
నే పడుకోలేదు, ఏ చిన్న కదలికతో నీ మీద ఒరిగిపోతానేమోనని భయం
కానీ ఇప్పుడనిపిస్తుండి నీ పక్కనే పడుకునుండాల్సింది

Wednesday, June 9, 2010

...ఎంత?


ఎదురుచూపు కనుగిలుపుల కను రెప్పల బరువెంత?
తీరని దాహపు గొంతు గుటకల మంటెంత?
చేరువవని గమ్యపు పరుగు రొప్పి వేగమెంత?
ఆరని ఆశల మనసు అలుపెంత?
.
.
.
ఏకాంతాన పార్క్లో జంటకి చిక్కిన బెంచి విలువెంత?
ఎడబాటుని చెరిపే ఆలింగనపు దగ్గరతనమెంత?
.
.

Friday, June 4, 2010

ప్రియోదయం చూడాలని


ఏ కోడో కూస్తుందని
నీ ఉనికిని చాటుతుందని
ఎటు సాగినా
మెలకువ నను వీడలేదు
నే నడకా ఆపలేదు
నిద్ర నన్నావహించనంటుంది
నడక పరుగవుతానంటుంది
దిక్కులు తెలియకుండా సాగుతుంది నా పయనం
నీ దిక్కుకి చేరుకోవాలని
నీలో నా మనోదయాన్ని చూడాలని