ఏకాంత వేళ... ఉప్పొంగే భావాల...

వాన రాకకి తన్మయత్వంతో మయూరి నాట్యం చేస్తున్నప్పుడు, వసంతాన్ని పసిగట్టి ఆనందంతో కోకిల రాగం తీస్తున్నప్పుడు, పరస్పర ప్రేమ పరవశంతో యుగళం ఏకమవుతున్నప్పుడు, ఏకాంతం పరిఢవిల్లుతుంది... మీరు గమనించారా? ప్రకృతి ఏకాంతవాసి అని? ఏకాంతంలో సృష్టి జరుగుతుందని...

Friday, July 4, 2008

పున్నమి రాత్రి చిమ్మ చీకటి రాజ్యమేలింది...


చీకటితో స్నేహం కుదిరింది

చెట్టపట్టాలేసుకుని సావాసం చేస్తున్నాను...
ఒకసారి పగలు నిన్ను చూడాలనిపిస్తే ఎలా అని అడిగినప్పుడు,
నీ కళ్ళు మూసుకో నీ చెంతే ఉంటాను అని చెప్పింది

పున్నమి వెన్నెల అలా ఉంటుందంట ఇలా ఉంటుందంట అని నేను చెప్పే కబుర్లు
చక్కగా వింటుంది నన్ను తన ఒడిలో పడుకోబెట్టుకుని..

ఒక రాత్రి నాకు పున్నమి వెన్నెల కావాలన్నాను.., అప్పుడు
నా తల నిమురుతూ నన్ను నిద్రపుచ్చింది

నాకు నేస్తం చెప్పనే లేదు
ఒక సాయంత్రం నా కబుర్లలోని వెన్నెలలాంటి వెన్నెల కురవడం మొదలుపెట్టింది...
నేను ఆనందాతిశయంతో అలానే చూస్తుండిపోయాను...
అది చెప్దామని చీకటిని పలకరించబోతే తను ఆందోళనతో
నా వైపు చూస్తూ దూరంగా వెళ్ళిపోతుంది...
నాకు భయం వేసింది
ఆ క్షణంలో ఏంచెయ్యాలో తెలియక...,
రెప్పలు మూసుకుని నా కన్నుల్లో చీకటికి చోటిచ్చాను...
అప్పటికే కన్నుల్లో నెలకొన్న గాఢార్ద్రత
నా చీకటి నేస్తాన్ని చిమ్మ చీకటిగా ఆవిష్కరించింది
నా నేస్తాన్ని అలా చూసి భరించలేకపోయాను
కానీ తను ఎక్కడ దూరమవుతుందేమో అని కళ్ళు తెరవలేకపోయాను...



ఎప్పుడు నిద్రపోయానో తెలియదు... కళ్ళు తెరిచేసరికి తెల్లవారింది...

12 comments:

ప్రతాప్ said...

ఒంటరి తనపు కైవారంలో మీరు తిమిరంతో సావాసం చేస్తున్నారా?
ఇంతకీ మీకు ఒంటరిగా ఉండటం ఇష్టమా? లేక ఏకాంతంగానా?

ఏకాంతపు దిలీప్ said...

@ ప్రతాప్

లేదు. ఒంటరితనపు కైవారంలో తిమిరంతో సావాసం చెయ్యడం లేదు. అదొకరకమైన అజ్ఞానపు కైవల్యం లో తిమిరంతో సావాసం చేస్తున్నాను.

ఒంటరితనం నన్ను నన్నుగా కూడా భరించలేకుండా చేస్తుంది. ఏకాంతం నన్ను నాకు పరిచయం చేస్తుంది, నావాళ్ళెవరో నాకు చెప్తుంది.

MURALI said...

చాలా బావుంది. మెల్లగా వెన్నెలకి, వర్షానికి,ఇప్పుడు చీకటి కి నేస్తాలు పెరుగుతున్నారు.

రాధిక said...

photo caalaaaaa baaguni

Bolloju Baba said...

చాలా సాదా సీదా పదాలతో ఇంత గాఢత ఎలా సాధిస్తారో నాకెప్పటికీ అర్ధం కాని విషయమే.

ఒకే పదాన్ని భిన్న సందర్భాలకు భిన్న అర్ధాలలో వాడటం వల్ల ఈ కవితకు కొత్త అందాన్నిచ్చిందని భావిస్తున్నాను.

నా చీకటి నేస్తాన్ని చిమ్మ చీకటిగా
నా కబుర్లలోని వెన్నెలలాంటి వెన్నెల

పగలు నిన్ను చూడాలనిపిస్తే ఎలా..........
ఈ అతి సరళమైన ప్రశ్న, చదువుతూంటే ఎంతో లోతైన భావాన్ని ఎలా పొదుగుకుందో గమనించారా?

మీ కవితలో, ప్రేమ తో కూడిన ఆర్ధ్రత, వెన్నెల వంటి చల్లదనం, తలనిమురుతో నిద్రపుచ్చే ఆత్మీయతా --- నేత చీరపై కలంకారీ అద్దకం లా ఒదిగిపోయినయ్.

అభినందనలతో

బొల్లోజు బాబా

ఏకాంతపు దిలీప్ said...

@బాబా గారు
మీ వ్యాఖ్యను చదివిన క్షణం నాకు చాలా ఆనందం కలిగింది.

ఎంతో మధన పడి, ఆలోచించి నాకలవాటైన వస్తువులు వెన్నెల,చీకటి తో చాలా గంభీరమైన అంశాన్ని రాస్తున్నాను అనుకున్న నాకు... ఈ టపాకి పెద్దగా వ్యాఖ్యలు రాకపోవడం చూసి... అరే ఎవరికీ అర్ధం కాలేదా అనిపించి బాధ పడ్డాను...

ఆ ప్రశ్నల్లోనే లోతైన భావాన్ని మీరు గ్రహించగలిగినందుకు చాలా ఆనందం కలిగింది... నేను రాసింది కనీసం ఒక్కరినైనా తాకగలిగిందని... మీకు నా ధన్యవాదాలు.

prashanth said...

chala bagundi andi....

నేస్తం said...

చాలా బావుంది :)

ఏకాంతపు దిలీప్ said...

ప్రషాంత్ గారూ, నేస్తం గారూ
నెనర్లండీ... నాకు ఈ రచన అంటే ప్రత్యేకమైన ఇది.. ఎప్పుడోరాసినా ఇప్పుడు చదివి వ్యాఖ్య రాస్తుంటే ఆనందంగా ఉంది.. :-)

Sai Praveen said...

వ్యాఖ్య రాయడం కొంచెం ఆలస్యమయిందేమో ? :)
ఎం చెయ్యనండి. నేను బ్లాగులు చదవడం మొదలు పెట్టిందే ఈ మధ్య.
చాల బావుంది మీ రచన. రచన ఒక ఎత్తు అయితే కింద ప్రతాప్ గారి వ్యాఖ్యకు ప్రతిస్పందనగా మీరు రాసిన

"ఒంటరితనం నన్ను నన్నుగా కూడా భరించలేకుండా చేస్తుంది. ఏకాంతం నన్ను నాకు పరిచయం చేస్తుంది, నావాళ్ళెవరో నాకు చెప్తుంది." మరొక ఎత్తు.
చాలా అద్భుతంగా రాసారు.

sindhu said...

hi dilip garu,

nenu mee blog chadavatam ee roje start chesanu... okkokka kavita chaduvutunte... next danilo inkenta lotu ardham untundo anna interest perugutundi... mee nunchi inka ilantivi chala kavitalu ravalani korukuntunnanu....

-Sindhu

ఏకాంతపు దిలీప్ said...

Sindhu garu, thank you.. You made my day! :) raastuunE unTaanu!