
ఇప్పటి వరకూ వాన...
ఇప్పుడే మేడ మీదకి వచ్చాను...
గంట క్రితం ఒళ్ళంతా మేఘాల ముసుగేసుకున్నట్టున్న ఆకాశం,
ఇప్పుడు కోటి కళ్ళతో ఒంటి నిండా వెన్నెల పూసుకుని నగ్నంగా నా కోసం ఎదురుచూస్తున్నట్టుంది...
ఇది చూసి తేరుకుని మళ్ళీ ఆకాశం వైపు చూస్తే..,
చంద్రుడు నాకేమీ తెలియదు,నేనేమీ చూడలేదు అన్నట్టు కొబ్బరాకుల చాటున దాక్కుంటున్నాడు...
నా నుండి ఎంత దాగినా అద్దంలాంటి తడిచిన నేలకి దొరికిపోయాడు...
వీచే చల్ల గాలి తాకీ తాకనట్టు నా చూపుని మరల్చడానికా అన్నట్టు కొంటెగా నన్ను అల్లరి చేస్తుంది...
గూటికి చేరే పక్షులు నా చూపుల దారికి అడ్డంగా వెళ్తూ ఇక చూసింది చాలు అన్నట్టు నన్ను ఆట పట్టిస్తున్నాయి...
ఇంతకీ నేను ఏంచూసాను..?
దేనికీ ఈ మైమరపు?!!!
మూడేళ్ళుగా ఆహ్లాదకరమైన ఇలాంటి ప్రకృతికి దూరంగా ఉన్నాను...
కానీ ఈ మైమరపు నన్ను వెంటాడుతూనే ఉంది...