ఇవి ఈ మధ్య నా ఊహలు చెప్పిన ఊసులు...
కొన్ని అమ్మాయి ఊహలని అబ్బాయి చెప్తున్నట్టు, కొన్ని అమ్మాయికి అబ్బాయి చెప్పే ఊసులు..
~~~~~~~~~~~~~~~
కోటీ కలలా నీ కళ్ళూ
కోటీ చుక్కాలా నీలాంబరాలూ
చుక్కాలున్నాచోటే చందురూడూ
చిక్కేను నీ కనుల ఓ నిండూ పున్నమీ నాడూ
~~~~~~~~~~~~~~~
అడగాలేదని నేనూ అడగాలేదని
అలిగినా నీ కళ్ళు మండే గోళాలు
పలకనీ నీ పెదవులు పట్టు కర్రలు
బుంగా మూతీ నీ బుగ్గలు కఠిన పాషాణాలు
అడగాలేదనీ అలకెందుకే
అడుగుతాననీ తెలిసీ కులుకెందుకే
నీ అలకనీ నేనూ ఓర్చలేనూ
ఇదిగో అడుగుతున్నాను నేను ప్రేమతో
చెలీ, కనికరించి నను కాసుకో!
~~~~~~~~~~~~~~
కలత చెందకు నేస్తం
కలలు కనే కళ్ళని కనికరించు నేస్తం
కలలు నిజమాయే వేళ రాలేదని
కను రెప్పల కౌగిలిని కనుపాపలకి దూరం చెయ్యకు నేస్తం
నిజమయ్యే కలలని నిండుగా చూపించేందుకు
ఆ కనుపాపలకి విరామం కావాలి నేస్తం
కలత చెందకు నేస్తం
నిదురపో నేస్తం
~~~~~~~~~~~~~~
కనుల కొలనులో కౌముది నిలిచే వేళలో
మనసు నీరధిలో అలలు నిను తలచే వేళలో
కలల తీరానికి నను చేర్చమని
నను ఈ అలల తాకిడి నుండి తప్పించమని
నెలరాజుని నిలదీస్తున్నాను..
~~~~~~~~~~~~~~
అడిగినా సరే అడగాలేదని అంటావు
నువ్వడిగిందే ముందూ అంటావూ
నేననడిగింది కానే కాదంటావు
వేడుకోలుకి వేళేనా ఇది?
నీ దోబూచులాటలో దారేది?
చెలీ చెప్పుకుంటున్నానూ
ఇలా వచ్చి ఆలకించూ..
~~~~~~~~~~~~~~
మౌనమే నీ బాష అయినపుడు
నీ ఉనికిలో ఒదిగిపోతా
నీరవ నిశీధిలో చంద్రాన్ని కనుగున్నట్టు
నిను చూస్తూ నీ ఒడిలో నిదురపోతా
~~~~~~~~~~~~~~